టాలీవుడ్ కౌన్సిల్ ఎన్నికలు ముగిసాయి. పోటా పోటీగా జరిగిన ఎన్నికల్లో దామోదర్ ప్రసాద్ కౌన్సిల్ చైర్మన్ గా గెలిచారు. జెమిని కిరణ్ ఓడి పోయారు. నిజానికి జెమిని కిరణ్ కచ్చితంగా గెలుస్తారని అంతా అనుకున్నారు. దిల్ రాజు నాయకత్వంలోని పానెల్ రాజకీయం ముందు కౌన్సిల్ పాత పానెల్ చాలా తలవంచినట్లే కనిపిస్తోంది. వైఎస్ చౌదరి, ప్రసన్నకుమార్, నట్టి కుమార్ లాంటి కొద్ది మంది మినిహా మిగిలిన వారంతా యాక్టివ్ ప్రొడ్యూసర్స్ గిల్డ్ రంగంలోకి దింపిన వారే గెలుపొందారు.
ఎన్నికలకు ఒక రోజు ముందు కూడా సి కళ్యాణ్ లాంటి సీనియర్ కౌన్సిల్ నాయకులు దిల్ రాజు మీద బాహాటంగా ధ్వజమెత్తారు. కానీ గమ్మత్తేమిటంటే ఓడి పోయిన తరువాత జెమిని కిరణ్ కూడా ఇండైరెక్ట్ గా సి కళ్యాణ్ నే తప్పు పడుతున్నారు. సి కళ్యాణ్ తెర వెనకు దిల్ రాజు మిలాఖత్ అయిపోయి తనను ఓడించారనే భావనను జెమిని కిరణ్ వ్యక్తం చేసారు.
ఎన్నికల ఫలితాల అనంతరం ‘గ్రేట్ ఆంధ్ర’ ఆయనను పలకరించి, ఫలితం మీద కామెంట్ ఏమిటి అని అడగ్గా..’ఏముంది..ఎవరు నిల్చోమని ముందుకు తోసారో, వాళ్లే ఓడించారు’ అని అన్నారు. దిల్ రాజు రాజకీయానికి సి కళ్యాణ్ తల వోంచారనే భావనను ఆయన వ్యక్తం చేసారు. దామోదర ప్రసాద్ గెలవడం, అలాగే ఈసి లు అధికంగా గిల్డ్ కు రావడం అన్నది అసలు ప్లాన్ అని అదే అమలు చేసారన్నారు.
మొత్తానికి కౌన్సిల్ లో అడ్డంకులు వున్నాయని గిల్డ్ పెట్టి, మళ్లీ అదే కౌన్సిల్ లో ఆధిపత్యం సంపాదించి నిర్మాత దిల్ రాజు తన పట్టు సాధించారు. ఈ క్రమంలో పాపం, జెమిని కిరణ్ అభాసు పాలయ్యారు.