ఇలా చేస్తే మూవీ బిజినెస్ లో లాస్ రాదు: గోపీచంద్

సినిమా ఎలా తీయాలో చెబుతున్నాడు హీరో గోపీచంద్. ఎలా తీస్తే నష్టాలు రాకుండా బయటపడొచ్చో చెబుతున్నాడు. ప్రస్తుతం చాలామంది అలా సినిమాలు తీయడం లేదని, తను చెప్పినట్టు సినిమా తీస్తే కచ్చితంగా లాభాలొస్తాయని చెబుతున్నాడు.…

సినిమా ఎలా తీయాలో చెబుతున్నాడు హీరో గోపీచంద్. ఎలా తీస్తే నష్టాలు రాకుండా బయటపడొచ్చో చెబుతున్నాడు. ప్రస్తుతం చాలామంది అలా సినిమాలు తీయడం లేదని, తను చెప్పినట్టు సినిమా తీస్తే కచ్చితంగా లాభాలొస్తాయని చెబుతున్నాడు.

“సొంత బ్యానర్ లో నేను సినిమా నిర్మిస్తే, మొత్తం పేపర్ పై పెడతాను. సీన్, డైలాగ్ అంతా పేపర్ మీద పెట్టమని దర్శకుడికి చెబుతాను. ఎన్ని రోజులు కావాలంటే అన్ని రోజులిస్తా, ఏం కావాలంటే అదిస్తా. కానీ సీన్ పెర్ ఫెక్ట్ గా ఎలా తీస్తాడో చెప్పమని అడుగుతా. అలా చెప్పిన దర్శకుడితోనే సినిమా నిర్మిస్తా. ఫైనల్ కాపీని నేను చూసుకొని నచ్చకపోతే మళ్లీ తీసుకుంటా. ఓ 10మందికి చూపించుకుంటా. నేను 10 మందిని కన్విన్స్ చేయకపోతే, లక్షమంది ప్రేక్షకుల్ని ఎలా మెప్పిస్తాను. ఏ నిర్మాతైనా ఇలా చేస్తే సినిమా బిజినెస్ లో లాస్ రాదు. నేను చెప్పినట్టు కరెక్ట్ గా చేసుకుంటే సినిమా అనేది మంచి లాభసాటి వ్యాపారం. ఈ విషయం తెలియక, సరిగ్గా తీయడం రాక, ఫార్ములా అంటూ ఏదేదో రాసుకొని, బడ్జెట్ పెరిగిపోయిందని చెప్పుకుంటున్నాం.”

ఇన్ని తెలిసిన గోపీచంద్, తన సినిమాల ఫ్లాపులపై కూడా స్పందించాడు. తను కొన్ని సూచనలు చేస్తానని, కానీ మేకర్స్ పట్టించుకోరని అన్నాడు. కొన్ని సందర్భాల్లో మాత్రం లెక్క తప్పుతుందని తెలిసినప్పుడు తనే స్వయంగా తప్పుకుంటానని అంటున్నాడు.

“కొన్ని ముందే జాగ్రత్తపడతాం. ఓ తమిళ దర్శకుడి సినిమా విషయంలో అలానే చేశాను. 2 రోజుల షూటింగ్ కే నాకు విషయం అర్థమైపోయింది. నిర్మాతను కూర్చోబెట్టి చెప్పేశాను. కోట్ల రూపాయల నష్టాన్ని ఆపగలిగాం. కానీ కొన్ని సందర్భాల్లో సినిమా సగానికి పైగా అయిపోతుంది. అప్పుడు తెలుస్తుంది. మనమేం చేయలేం.”

ప్రస్తుతం విలన్ గా నటించే ఉద్దేశం లేదని స్పష్టంచేశాడు గోపీచంద్. హీరోగానే కెరీర్ కొనసాగిస్తానని, కాకపోతే కథల విషయంలో ఇకపై ఇంకాస్త డిఫరెంట్ గా వెళ్తానని అన్నాడు. గోపీచంద్ నటించిన సీటీమార్ సినిమా ఈ వీకెండ్ ఎట్రాక్షన్ గా థియేటర్లలోకి రాబోతోంది.