సినిమాకు పబ్లిసిటీ అంటే కోట్ల ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. అందులోనూ ఎప్పటి నుంచో నిర్మాణంలోనే వుండి, పెద్ద సినిమాల మధ్య వస్తున్న చిన్న సినిమా కాస్తయినా కనపడాలి అంటే సమ్ థింగ్ ఏదో జరగాలి. కేవలం ప్రెస్ మీట్ లు, ప్రకటనలతో సరిపోదు. మిగిలిన సినిమాలతో పోల్చుకుంటే కాస్త చిన్న సినిమా. మిగిలిన హీరోలతో పోల్చుకుంటే చిన్న హీరో. కొత్త నిర్మాత. ఇలాంటి సినిమాకు ఈ రేంజ్ బజ్ వచ్చింది, ప్రీమియర్లకు ఇన్ని టికెట్ లు హాట్ కేక్ ల్లా అమ్ముడుపోతున్నాయి అంటే అది దర్శకుడు ప్రశాంత్ వర్మ ప్లానింగ్ నే.
ప్రశాంత్ వర్మ ఈ ప్లానింగ్ ను ఆరు నెలల ముందు నుంచే ప్రారంభించారు. డిసెంబర్ లో పబ్లిసిటీ స్టార్ట్ చేసిన తరువాత ఎప్పుడు ఏ కంటెంట్ వదలాలి, డైలీ ఏ పోస్టర్ వదలాలి, సినిమా హీరోల బొమ్మలు ఎలా వాడుకోవాలి. ఇలా అన్నీ చేసుకుంటూ వచ్చారు. సినిమా వర్క్ అయిపోయింది. సిజి చెకింగ్ మాత్రం మిగిలింది. ఈ గ్యాప్ ను అలా వాడుకున్నారు. దగ్గర మొత్తం కంటెంట్ అంతా రెడీగా పెట్టుకున్నారు.
ట్రయిలర్ వదిలిన దగ్గర నుంచి తమ దగ్గర వున్న మెటిరియల్ ను పంప్ చేయడం ప్రారంభించారు. అదే సమయంలో దర్శకుడు ప్రశాంత్ వర్మ, హీరో తేజ ఇంటర్వూలు ఇవ్వడం ప్రారంభించారు. ప్రశాంత్ వర్మ కాస్త టోన్ పెంచి అగ్రెసివ్ గా వెళ్లారు. హీరో తేజ డౌన్ టు ఎర్త్ అన్నట్లు ముందుకు సాగారు. ఈ రెండు విధాల స్కీము వర్కవుట్ అయింది. సినిమా మీద సింపతీ జనరేట్ అయింది.
థియేటర్ల సమస్య దీనికి తోడయింది. మీడియాలో వచ్చిన అనేక కథనాలు మరింత సపోర్ట్ గా నిలబడ్డాయి. దీంతో ప్రేక్షకుల్లో చిన్న హీరోకి మద్దతు ఇవ్వాలి. చిన్న సినిమాకు అండగా వుండాలి అనే ఫీలింగ్ కలిగింది. 12న విడుదల అనుకున్న సినిమాకు 11న పెయిడ్ ప్రీమియర్లు వేయాలని ధైర్యంగా ముందుకు వచ్చారు. ఇది నిజానికి కాస్త రిస్క్ నే. సినిమా తేడా కొడితే మర్నాడే సమస్య అయిపోతుంది. కానీ కంటెంట్ మీద నమ్మకంతో ముందుకు వెళ్లారు.
రెండు రాష్ట్రాల్లో వందల కోద్దీ షో లు పెట్టుకుంటూ, పెంచుకుంటూ వెళ్లారు. అన్నీ ఫుల్స్ అయ్యాయి. 12న మహేష్ బాబు సినిమా వుంది కనుక హనుమాన్ కు ఎలాగూ కాస్త ఇబ్బందే. ఆ ఇబ్బంది ముందు రోజే కవర్ అయిపోతోంది.
ఇక మిగిలింది. ఫలితం. కంటెంట్ బాగుంటే, ఈ బజ్, ఈ సింపతీ ఫ్యాక్టర్ తో సినిమా ఎక్కడికో వెళ్తుంది. లేదు కంటెంట్ అనుకున్న రేంజ్ కు లేకుంటే ఈ చేసినదంతా కలిపి సినిమాను కనీసం యావరేజ్ రేంజ్ కు తీసుకెళ్లి వదుల్తాయి.
చాలా సినిమాలకు తెరవెనుక పబ్లిసిటీ సలహాలు ఇచ్చిన ప్రశాంత్ వర్మ తన సినిమా పబ్లిసిటీని కూడా పెర్ ఫెక్ట్ గా ప్లాన్ చేసుకుని సినిమాకు కావాల్సిన బజ్ ను తెచ్చుకోవడంలో సక్సెస్ అయ్యారు.