ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా, స్వశక్తితో అంచెలంచెలుగా ఎదిగిన దర్శకుడు హరీశ్ శంకర్. మిరపకాయ్, గబ్బర్ సింగ్ సినిమాల దర్శకత్వంతో గుర్తింపు పొందారు. తనకంటూ సొంత ఇమేజ్‌ను తెచ్చుకున్నాడాయన. గబ్బర్‌సింగ్ సినిమా తర్వాత మరోసారి పవర్‌స్టార్ పవన్‌కల్యాణ్‌తో సినిమా తెరకెక్కిస్తున్నారు.
ఇలీవల బండ్ల గణేష్‌తో వివాదం తలెత్తడంతో సోషల్ మీడియా వార్తలకెక్కారు. కౌంటర్, ఎన్‌కౌంటర్లతో చివరికి ఎట్టకేలకు వారిద్దరి మధ్య వివాదం సమసిపోయినట్టే కనిపిస్తోంది. లాక్‌డౌన్ జీవితం, కరోనా వైరస్ తీసుకొచ్చిన మార్పులపై ఆయన మనసులో మాట బయటపెట్టారు. అవేంటో తెలుసుకుందాం.
కరోనా వైరస్ తీవ్రరూపం దాల్చుతోందని ఇటలీలో దాని విస్తరణను బట్టి అంచనా వేసుకున్నట్టు ఆయన తెలిపారు. ఇటలీ ఎంతో అందమైన , అభివృద్ధి చెందిన దేశమని హరీశ్ శంకర్ తెలిపారు. జనసాంద్రత తక్కువగా ఉన్న ఆ దేశంలోనే కరోనాకు అడ్డుకట్ట వేయలేకున్నారంటే…ఇక అందుకు పూర్తిగా భిన్నమైన మన దేశంలో కచ్చితంగా బాగా వ్యాపిస్తుందని అంచనా వేసుకున్నట్టు ఆయన చెప్పుకొచ్చారు.
ముఖ్యంగా కరోనా మహమ్మారి చేస్తున్న హెచ్చరికను ప్రతి ఒక్కరూ పరిగణలోకి తీసుకోవాలన్నారు. ప్రతి ఒక్కరూ జీవితాన్ని ఎవరిష్టానుసారం వారు గడపడానికి వీల్లేదన్నారు. కరోనా అనేది ఒకరి నుంచి మరొకరికి వ్యాపిస్తున్న నేపథ్యంలో మనతో పాటు ఇతరులు కూడా సంతోషంగా ఉండాలంటే అందరూ జాగ్రత్తగా ఉండాల్సిందే అన్నారు. అందువల్ల సాధ్యమైనంత వరకు ఇంటి నుంచి బయటికి కదలకపోవడమే ఉత్తమమన్నారు.
తన వరకూ వస్తే కరోనా మార్పు తీసుకొచ్చిందని భావిస్తున్నానన్నారు. తనలో సహానుభూతి, మానవత్వం పెరిగాయనే భావన వ్యక్తపరిచారు. అంతేకాదు, వలసకార్మికులు, రోజువారీ కూలీలు, మరికొంత మంది కష్టాలు చూసిన తర్వాత డబ్బు విలువ గురించి మరింత తెలిసి వచ్చిందన్నారు.
ఇక సినిమా విషయానికి వస్తే లాక్‌డౌన్ పూర్తిగా తొలగిపోయి, షూటింగ్ స్టార్ట్ అయితే తప్ప ఏం జరుగుతుందో చెప్పలేమ న్నారు. చిత్ర పరిశ్రమలో చోటు చేసుకునే మార్పుల గురించి తెలుసుకోవాలని కుతూహలం అందరితో పాటు తనకూ ఉందని చెప్పుకొచ్చారు. ఓటీటీ వేదికలు సినిమాకు మరింత డిమాండ్ పెంచినట్టే అని ఓ ప్రశ్నకు సమాధానాంగా చెప్పారాయన. ఎందుకంటే సినిమా రంగానికి మరో కొత్త మాధ్యమమే ఓటీటీని చూడాలన్నారు.
పవన్‌కల్యాణ్‌తో చేస్తున్న సినిమాపై ఆయన తన అభిప్రాయాలను పంచుకున్నారు. ‘గబ్బర్ సింగ్’ తర్వాత పవన్‌కల్యాణ్‌తో చేస్తున్న సినిమాపై అభిమానుల్లో చాలా అంచనాలున్నాయన్నారు. దీంతో సహజంగానే తనపై ఒత్తిడి పెరిగిందన్నారు. అయితే పవన్‌కల్యాణ్‌ను ఎలా చూడాలని అభిమానుఅంతా ఆశిస్తున్నారో, తమ హీరోని ఎంత ఎనర్జిటిక్‌గా చూడాలనుకుంటున్నారో ….వారి నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా, అభిమానుల్ని నిరాశ పరచకుండా తప్పక పవన్ క్యారెక్టర్‌ను తీర్చిదిద్దుతానని ఆయన చెప్పుకొచ్చారు. ఒక్కసారి చూస్తే తనివి తీరనంతగా, మళ్లీమళ్లీ చూడాలనిపించేలా పవన్‌కల్యాణ్ సినిమా ఉంటుందన్నారు.
తన సినిమాలపై కుటుంబ సభ్యుల అభిప్రాయాలను కూడా ఆయన వెల్లడించారు. ముఖ్యంగా తన భార్యతో పాటు ఆమె తరపు బంధువులందరికీ ‘మిరపకాయ్’ అంటే చాలా ఇష్టమన్నారు. ఆ తర్వాత ‘సుబ్రమణ్యం ఫర్ సేల్’ చిత్రాన్ని ఎక్కువగా ఇష్టపడతారన్నారు.
ఇక తన తల్లిదండ్రుల అభిప్రాయానికి వస్తే తానేం తీసినా ఇష్టమే అంటూ మరో మెలిక పెట్టారు…. ‘మా నాన్న పెద్దగా నా చిత్రాలు ఇష్టపడరు. (నవ్వుతూ…) ‘సర్లే! ఏదో…’ అనుకుంటారు. మా నాన్నకు ‘అతడు’ సినిమా అంటే చాలా ఇష్టం. ఆయన త్రివిక్రమ్ వీరాభిమాని’ అని హరీశ్ శంకర్ చెప్పుకొచ్చారు. సర్లే! ఏదో అనుకుంటారని చెప్పడం ద్వారా ఏదో చేస్తున్నావులే అని అన్నట్టుంది.