నటి హేమ విసిరిన పంచ్ అదుర్స్ అనే రీతిలో ఉంది. ఇంధ్రకీలాద్రిపై దుర్గమ్మ అమ్మవారిని దర్శించుకున్న అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ తనదైన స్టైల్‌లో ప్రత్యర్థులపై విమర్శల బాణాన్ని సంధించారు.
ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో 8వ రోజు అమ్మవారు మహిషాసుర మర్దినిగా దర్శనమిచ్చారు. రేపటితో దసరా వేడుకలు ముగియనున్నాయి. దీంతో అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులకు బారులుతీరారు.
ఈ నేపథ్యంలో ప్రకాశ్‌రాజ్ ప్యానల్ తరపున బరిలో నిలిచిన నటి హేమ ఇంద్రకీలాద్రిపై కొలువైన అమ్మవారిని దర్శించుకున్నారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ అమ్మవారిని దర్శించుకున్న అనంతరం తన ఫీలింగ్స్‌ని వ్యక్తపరిచారు. ప్రతి ఏడాది తాను అమ్మవారి గుడికి వస్తున్నట్టు చెప్పారు. ఈ ఏడాది “మా” ఎన్నికల వల్ల అమ్మవారిని దర్శించుకోలేనేమో అనుకున్నట్టు చెప్పారు.
కానీ అత్యవసర పనిపై విజయవాడకు రావడం, అమ్మవారిని దర్శించుకోవడం జరిగిపోయాయన్నారు. చాలా సంతోషంగా ఉందన్నారు. నిజానికి ప్రతి ఏడాది అమ్మవారికి చీర సమర్పిస్తున్నట్టు చెప్పారు. ఈ దఫా అమ్మ వారి గర్భగుడిలోకి వెళ్లినప్పుడు తనకు దుర్గమ్మే చీర ఇవ్వాలని కోరుకున్నట్టు తెలిపారు. గుడి నుంచి బయటికి వచ్చిన తర్వాత ఓ ప్రిన్సిపల్ తనకు చీర సమర్పించారని పేర్కొన్నారు. తనంత అదృష్టవంతురాలు లేరని ఆనందం వ్యక్తం చేశారు.
అమ్మవారు సత్యదేవత అనేందుకు ఇదే అతిపెద్ద నిదర్శనమన్నారు. తన కళ్లలో ఆనందభాష్పాలు వచ్చాయన్నారు. రాత్రికి గెలిచామని, పొద్దునకల్లా ఓడిపోయామన్నారు. ఇలా ఎందుకు జరిగిందో తనకు తెలియదన్నారు. అమ్మవారికైనా తెలుసో లేదోనని హేమ వ్యాఖ్యానించడం గమనార్హం.
ఒక వైపు దుర్గమ్మ చెంత రాజకీయాల గురించి మాట్లాడనంటూనే, మరోవైపు పరోక్షంగా ఇటీవల వివాదాస్పదమైన “మా” ఎన్నికల తీరుపై హేమ ఘాటు వ్యాఖ్యలు చేయడం చర్చనీయాంశమైంది.