పోలీసులు అడ్డుకోవ‌డంపై హీరో ఆవేద‌న‌

వైద్య సామ‌గ్రి పంపిణీ చేయ‌డానికి వెళుతున్న త‌న‌ను పోలీసులు అడ్డ‌గించ‌డంపై హీరో నిఖిల్ ఆవేద‌న వ్య‌క్తం చేశారు. త‌న ఆవేద న‌ను ట్విట‌ర్ వేదిక‌గా వ్య‌క్తం చేశారు. నిఖిల్ ట్వీట్‌పై పోలీసులు స్పందించారు. అస‌లేం…

వైద్య సామ‌గ్రి పంపిణీ చేయ‌డానికి వెళుతున్న త‌న‌ను పోలీసులు అడ్డ‌గించ‌డంపై హీరో నిఖిల్ ఆవేద‌న వ్య‌క్తం చేశారు. త‌న ఆవేద న‌ను ట్విట‌ర్ వేదిక‌గా వ్య‌క్తం చేశారు. నిఖిల్ ట్వీట్‌పై పోలీసులు స్పందించారు. అస‌లేం జ‌రిగిందో తెలుసుకుందాం.

క‌రోనా సెకెండ్ వేవ్ ఉధృతిని క‌ట్ట‌డి చేసేందుకు తెలంగాణ స‌ర్కార్ క‌ఠిన లాక్‌డౌన్‌ను విధించింది. ఇందులో భాగంగా ఉద‌యం 6 గంట‌ల నుంచి 10 గంట‌ల్లోపు మాత్ర‌మే ప్ర‌జ‌లు త‌మ ప‌నులు చేసుకునేందుకు అనుమ‌తి ఇచ్చింది. ఈ నేప‌థ్యంలో లాక్‌డౌన్ అమ‌ల్లోకి వ‌చ్చిన త‌ర్వాత అన‌వ‌స‌రంగా ఏ ఒక్క‌రు బ‌య‌టికొచ్చిన క‌ఠినంగా వ్య‌వ‌హ‌రిస్తామ‌ని పోలీసులు హెచ్చ‌రించారు. అయితే అత్య‌వ‌స‌రాల‌కు మాత్రం ఇది మిన‌హాయింపు ఇస్తున్న‌ట్టు పోలీసులు వెల్ల‌డించారు.

కానీ అత్య‌వ‌స‌ర‌మ‌ని చెప్పినా హీరో నిఖిల్‌ను పోలీసులు అనుమ‌తించ‌క‌పోవ‌డంపై సోష‌ల్ మీడియాలో నెటిజ‌న్లు విమ‌ర్శిస్తున్నారు. తాను ఏ ప‌రిస్థితుల్లో బ‌య‌టికి వెళ్లాల్సి వ‌చ్చిందో హీరో నిఖిల్ ట్వీట్‌లో తెలిపారు. ఆ ట్వీట్ ఏంటంటే…

‘కొవిడ్‌ వల్ల తీవ్రంగా ఇబ్బందిపడుతున్న ఓ వ్యక్తికి మందులు ఇవ్వ‌డానికి ఉప్పల్‌ నుంచి కిమ్స్‌ మినిస్టర్స్‌ రోడ్డులో ప్రయాణిస్తున్న సమయంలో పోలీసులు నా కారుని ఆపేశారు. ప్రిస్క్రిప్షన్, రోగి వివరాలను అందించినప్పటికీ పోలీసులు నాకు అనుమతి ఇవ్వలేదు. ఈ పాస్‌ ఉండాల్సిందేనని చెప్పారు. 9 సార్లు ప్రయత్నించాను. కానీ సర్వర్ డౌన్ అయింది. వైద్య అత్యవసర పరిస్థితులకు అనుమతిస్తారని భావించి నేను వచ్చాను’అంటూ నిఖిల్‌ ట్వీట్‌ చేశారు.

ఇది సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అయ్యింది. పోలీసుల వైఖ‌రిపై నెటిజ‌న్లు విమ‌ర్శ‌లు గుప్పించారు. దీంతో హైద‌రాబాద్ సిటీ విభాగం స్పందించింది. ‘డియర్‌ సర్‌, మీ లొకేషన్‌ ఒక్కసారి మాకు పంపించండి. స్థానిక అధికారులతో మాట్లాడి మీ సమస్యను తీరుస్తాం’ అని పోలీస్ విభాగం నుంచి స‌మాధానం వచ్చింది. సెల‌బ్రిటీని అడ్డుకోవ‌డంతో స‌మ‌స్య తెర‌పైకి వ‌చ్చింది. ఇదే సామాన్యులు అత్య‌వ‌స‌రం ప‌రిస్థితుల్లో బ‌య‌టికొచ్చి ఎన్నెన్ని ఇబ్బందులు ఎదుర్కొంటున్నారో!