ఈరోజు ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి వచ్చింది ఆదిపురుష్. సరిగ్గా ఇదే టైమ్ లో ఈ సినిమాపై కోర్టు కేసు పడింది. రాముడ్ని ఎగతాళి చేసే విధంగా ఆదిపురుష్ సినిమా తెరకెక్కిందని ఆరోపిస్తూ.. హిందూ సేన అనే ధార్మిక సంస్థ, ఢిల్లీ హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం వేసింది.
రాముడ్ని, రామాయణాన్ని, హిందూ సంస్కృతిని అపహాస్యం చేసే విధంగా ఆదిపురుష్ సినిమాను తెరకెక్కించారని ఆరోపిస్తోంది ఈ సంస్థ. వాల్మీకి రచించిన రామాయణం, తులసీదాస్ రచించిన రామచరితమానస్ లో వివరించినట్టుగా ఆదిపురుష్ లో పాత్రల చిత్రీకరణ లేదని అంటున్నారు హిందూసేన జాతీయ అధ్యక్షుడు విష్ణు గుప్తా.
రాముడితో పాటు, రావణుడి పాత్రపై కూడా ఈ ధార్మిక సంస్థ అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. హిందూ బ్రాహ్మణుడైన రావణుడ్ని, ఆదిపురుష్ సినిమాలో తప్పుగా చూపించారని, అతడి ముఖం, పాత్ర వర్ణన సరిగ్గా లేవని ఆరోపిస్తున్నారు. సినిమాలో రావణుడిపై తీసిన సన్నివేశాలన్నీ, ఇతిహాసాన్ని వక్రీకరించే విధంగా ఉన్నాయంటున్నారు.
అంతకంటే ముందు, త్రిశూల్ మీడియా ఎంటర్ టైన్ మెంట్స్ అనే సంస్థ బాంబే హైకోర్టులో కేసు వేసింది. సినిమా క్రెడిట్స్ కు సంబంధించి కేసు వేసిన ఈ గ్రాఫిక్స్ కంపెనీ, ఆదిపురుష్ రిలీజ్ ను ఆపాలని కోర్టును కోరింది. అయితే దీనికి కోర్టు అంగీకరించలేదు. అంతలోనే ఢిల్లీ హైకోర్టులో పిటిషన్తా పడింది. తాజాగా నమోదైన కేసు ఏ మలుపు తిరుగుతుందో చూడాలి.