ఆస్కార్ కావాలంటే ముందు “గట్టిగా” అనుకోవాలి

“గట్టిగా అనుకో. అయిపోతది” అని ఒక డైలాగుంది. ముందు గట్టిగా అనుకుంటే తర్వాత దారులు అవే తెరుచుకుంటాయి, శక్తులు, యుక్తులు అవే వస్తాయి. మరి ఇన్నాళ్లూ మనవాళ్లు ఆస్కారు రావాలని అనుకోలేదా అంటే “గట్టిగా”…

“గట్టిగా అనుకో. అయిపోతది” అని ఒక డైలాగుంది. ముందు గట్టిగా అనుకుంటే తర్వాత దారులు అవే తెరుచుకుంటాయి, శక్తులు, యుక్తులు అవే వస్తాయి. మరి ఇన్నాళ్లూ మనవాళ్లు ఆస్కారు రావాలని అనుకోలేదా అంటే “గట్టిగా” అనుకోలేదనే చెప్పాలి. 

ఏవో విదేశీ ప్రొడక్షన్ కంపెనీల లెక్కలవల్ల (“స్లం డాగ్ మిలియనీర్” తీసిన నిర్మాత క్రీస్టియన్ కాల్సన్ ఇండియన్ కాదు) వస్తేనో, పెద్దగా పోటీ లేని డాక్యుమెంటరీ లాంటి కేటగరీల్లో వస్తేనో అవార్డులు పొందారేమో తప్ప..ఓపెన్ కేటగరీలో గట్టి పోటీ ఉన్న లేడీ గాగా, రిహానా లాంటి హేమాహేమీలని సైతం ఓడించి అవార్డు పొందడమంటే అది మామూలు విషయం కాదు. 

సింపుల్ గా చెప్పాలంటే ఏ ర్యాంకొచ్చినా సివిల్ ఇంజనీరింగులో సీటు పెద్ద ప్రయత్నం లేకుండానే వచ్చేస్తుంది. కానీ ఎంత మంచి ర్యాంకొచ్చినా ఏ రిజర్వేషన్ లేనప్పుడు టాప్ కాలేజీలో కంప్యూటర్స్ లో సీట్ కావాలంటే పరపతి, డబ్బు, లాబీయింగ్..ఇలా చాలా కావాలి. అలాగన్నమాట. అయితే ఇంజనీరింగ్ సీట్ పొందడానికి, ఆస్కార్ పొందడానికి స్థాయిలో చాలా తేడా ఉంటుంది. ఇది కేవలం బేసిక్ గా అర్థం కావడానికి చెప్పినదే.

మనిషికి పొగిడినప్పుడు ఉత్సాహం, తెగిడినప్పుడు నిరుత్సాహం కలుగుతుంటాయి. కానీ కొందరు వాటికి అతీతులు. ఎందుకంటే తమ మీద తమకి బలమైన నమ్మకం, తాము ఏం చేస్తున్నారో తెలిసి చేయడం. 

“నన్ను విమర్శించే వాడి కంటే నాకు ఎక్కువ తెలుసు” అనుకునే వాడిని ఎవ్వడూ కొట్టలేడు. రాజమౌళి ఆ కోవకి చెందే వ్యక్తి. 

బాహుబలి చూసి యావద్భారత్దేశం “సాహోరె రాజమౌళి” అని మోకరిల్లింది. కానీ ఆ వెంటనే “ఆర్ ఆర్ ఆర్” చూసి నిజానికి పెదవి విరిచింది. కానీ రాజమౌళి సినిమా అంటే పెద్ద పండగలాగ భావించే జనం మాత్రం కచ్చితంగా చూడాలని చూసారు. అలా చూసిన లెక్క నిజమో, లేక లోపాయికారిగా లెక్కలు కాస్త ఎక్కువ చూపించగలిగే వెసులుబాటుంటే చూపించారో తెలియదు కానీ భారీగా బాక్సాఫీసు వసూళ్లు చేసిన సినిమాగా ప్రచారాన్నైతే పొందారు.

కానీ విమర్శకులు, సోషల్ మీడియా జనాలు “ఇది రాజమౌళి స్థాయి సినిమా కాదు” అనే అన్నారు ఆర్.ఆర్.ఆర్ ని. అయినా అతను నిరాశ చెందలేదు. తన కెరీర్ గ్రాఫ్ నెక్స్ట్ లెవెల్ కి వెళ్లాలంటే దేశం బోర్డర్ దాటి తన సత్తా చాటాలి అనుకున్నాడు. దానికోసం ఆస్కార్ బరిలోకి దిగాలనుకున్నాడు. కానీ చేతిలో ఉన్న “ఆర్ ఆర్ ఆర్” ఆ పనికి సరిపోతుందా? ఒకపక్కన విమర్శకులు, ప్రేక్షకులు కంటెంట్ పరంగా దానిని వీక్ అంటున్నారు కదా? ఈ ప్రశ్నలతో అతను వెనకడుగువెయ్యలేదు. చేతిలో ఉన్న పదునులేదంటున్న బాణాన్నే ఆస్కార్ వైపుకి గురిపెట్టాడు. నిజానికి అతని ప్రయత్నాన్ని చూసి కూడా నవ్విన వాళ్లున్నారు. 

“ఏంటి? ఇంతోటి సినిమాతో ఆస్కార్ కొట్టేద్దామనే? తెల్లవాళ్లని విలన్లగా చూపిస్తూ సినిమా తీసేసి దానిని ఆస్కారులో నిలబెట్టాలనుకోవడం వెర్రితనం కాదూ! అప్పట్లో “గాంధి” సినిమాకి ఇచ్చారంటే తీసినవాడు, చేసినవాడు తెల్లవాళ్లు కాబట్టి చెల్లింది. ఈ అనాకారి ఆర్.ఆర్.ఆర్ ని ఎవడు పట్టించుకుంటాడు”, అన్నవాళ్లున్నారు. 

దీనికి తోడు భారతదేశ ప్రభుత్వం కూడా ఆర్.ఆర్.ఆర్ ని కాకుండా గుజరాతీ సినిమా “చల్లో షో” ని రికమెండ్ చేసి ఆస్కారుకి పంపింది. 

అది చూసైనా రాజమౌళి ఆవేశం తగ్గించుకుంటే మంచిదనుకున్నారు చాలామంది. 

అయినా సరే వామనావతారంలాగ ఇంతింతై అంతంతై అన్నట్టుగా తన సినిమా గురించి అంతర్జాతీయంగా ఊదరగొట్టడం మొదలుపెట్టాడు. ఎక్కడ చప్పుడు చేస్తే ఆస్కార్ జనాల చెవులకి వినిపిస్తుందో, ఎక్కడ ఇంటర్వ్యూ ఇస్తే వాళ్ల కంటపడుతుందో ఆ పనులన్నీ చేయడం మొదలుపెట్టాడు. 

జపాన్, అమెరికా లాంటి చోట షోలు వేసాడు. అమెరికాలో క్రిటిక్స్ కి ప్రత్యేకంగా షోలు వేసాడు. “వెరైటీ” మీడియాతో ఒప్పందం కుదుర్చుకున్నాడు. ఆ సంస్థకి మంచి క్రెడిబిలిటీ ఉంది. “వెరైటీ” చెప్పిందంటే అందులో విషయమున్నట్టే అనే అభిప్రాయం జనాల్లో ఎక్కువ. అందుకే ఆది నుంచి ఆర్.ఆర్.ఆర్ ని పాజిటివ్ లైట్ లో పెట్టి హాలీవుడ్ జనాల చైవిలో ఇల్లు కట్టి కూర్చుంది ఆ మీడియా సంస్థ. 

ఇక ఎవరు ట్వీట్ చేస్తే ఆర్.ఆర్.ఆర్ మీదకు ఆస్కార్ జనం కళ్లు వెళతాయో వాళ్ళ చేత కూడా ట్వీట్స్ వేయించారు రాజమౌళి అండ్ కో. 

రకరకాల కేటగరీల్లో అవార్డుల కోసం గురిపెట్టాడు. అందులో ఉత్తమ దర్శకుడు అనేది తన ప్రధాన లక్ష్యం అయ్యుండొచ్చు. కానీ ఉత్తమ హీరోలని కూడా ప్రొజెక్ట్ చేయడం వల్ల ఆ హీరోలు కూడా తిరుగుతారు. వాళ్లకి చివరికి అవార్డు వచ్చినా రాకపోయినా అంతవరకు ఆర్.ఆర్.ఆర్ కి ప్రచారమైతే దక్కుతుంది. ఫేసాఫ్ ది సినిమా హీరోలే కదా! హీరోలు ప్రచారంలో భాగమైతే ఇంకేమీ అవసరముండదు. కనుక వాళ్లకి కూడా అవార్డొచ్చే ఛాన్సుందని చెప్పి, హాలీవుడ్ ఎక్స్పోజర్ కూడా ఫ్రీగా దక్కిస్తానని చెప్పి వాళ్లని నెలల తరబడి పక్కనే ఉంచుకున్నాడు. “గ్లోబల్ స్టార్” కలలతో వాళ్ల టైముని రాజమౌళికి కేటాయించారు ఆ హీరోలిద్దరు. 

ఆ తర్వాత తన అన్నయ్య కీరవాణి. తన కోసం ఉత్తమ సంగీతం, ఉత్తమ పాట కేటగిరీల మీద దృష్టి పెట్టాడు. ఇవన్నీ చేయడంతో పాటు…మొదట తన ప్రమేయం లేకుండా వైరల్ అయిన “నాటు నాటు” స్టెప్ ని మరింత వైరల్ చేయించే ప్రయత్నాలు చేసాడు. విదేశాల్లో ఉన్న కొంతమంది యూట్యూబర్స్ తో ఆ పాటని కవర్ సాంగ్ గా చేయించాడు. వాళ్లని చూసి మరో పది మంది ప్రభావితమయ్యి చేసారు. అలా ఆ పాటని ఒక గ్లోబల్ సెన్సేషన్ గా మలిచాడు. 

ఆర్ ఆర్ ఆర్ విడుదలయ్యింది 25 మార్చ్ 2022. సినిమా వచ్చి వెళ్లిపోయిన చాలా నాళ్ల వరకు దాని మీద ఆసక్తిని వదలకుండా అదే కసితో ప్రచారం చేయాలంటే దానికి ఎంత ఓపిక కావాలి? ఎంత తీరిక ఫీలవ్వాలి? ఎంత తపస్సుండాలి? ఎంత నమ్మకముండాలి? ఎంత డబ్బుండాలి? ఇవన్నీ రాజమౌళికి పుష్కలంగా ఉన్నాయి. అందుకే నిర్మాతని రూపాయి కూడా అడక్కుండా అంతా తానే చేసుకుపోయాడు. 

“ఇంతా చేసి తాను అవార్డు దక్కించుకోలేకపోయాడుగా! ఏదో ఒకపాటకి వచ్చిందంతే” అని నిట్టూర్చేవాళ్లున్నారంటే వాళ్లని కుళ్లుతో రగిలిపొతున్న వారిగా గుర్తించాలి. ఎందుకంటే ఒక పాటకి ఆస్కార్ తెప్పించడం ఈజీ కాదు. అది తన తపస్సుతో సాధ్యం అని నిరూపించాడు రాజమౌళి. అంతే కాదు ఈ జైత్రయాత్రలో జేంస్ కేమరూన్, స్పీల్బెర్గ్ లాంటి దిగ్దర్శకులు అతనిని గుర్తించారు. హాలీవుడ్ మీడియాలో అద్భుతమైన ఇంగ్లీషులో మాట్లాడి అబ్బురపరిచాడు. హాలీవుడ్లో కూడా భారీ సినిమా తీయగల సత్తా ఉన్నవాడిగా నమ్మకం కలిగించాడు. అందుకే కేమరూన్ కూడా- “ఇక్కడ సినిమా తీసే ఆలోచన ఉంటే చెప్పు. కూర్చుని మాట్లాడుకుందాం అన్నాడు రాజమౌళితో”. 

ఏవిటిదంతా? తెలుగు దర్శకులు ఊహించదగ్గదేనా? తన తపశ్శక్తితో ఆస్కారుకి దారి కనిపెట్టి చెప్పినందుకు తెలుగు సినీ పరిశ్రమ రాజమౌళికి ఎన్ని గజారోహణాలు చేయించినా తక్కువే? కానీ దారి కనిపిస్తున్నంత మాత్రాన రాజమౌళి వెళ్లిన దారిలో మిగిలిన దర్శకులు, హీరోలు వెళ్లగలరా అంటే కాలమే చెప్పాలి. ఎందుకంటే ఆశ, ఆశయం, డబ్బు అందరికీ ఉండొచ్చు. కానీ రాజమౌళిలో ఉన్నంత ఓపిక, ఓర్పు, కసి అందరిలో ఉంటాయా అంటే అనుమానమే. కానీ అవి లేకపోతే ఆస్కారుపోరులో ఓటమి తప్పదు. 

రాజమౌళి ముందుగా ఒక సంగీత దర్శకుడికి, గీతరచయితకి అవార్డు ఇప్పించగలిగాడు. తర్వాత తాను ఏదొ ఒక రోజు దర్శకుడిగా పొందగలుగుతాడు. అందులో సందేహం లేదు. ఎందుకంటే అతను ఏది అనుకున్నా మామూలుగా అనుకోడు. “గట్టిగా” అనుకుంటాడు, “గట్టిగా” ప్రయత్నిస్తాడు. 

– శ్రీనివాసమూర్తి