ఆదిపురుష్.. భారీ ఈవెంట్ కు రంగం సిద్ధం?

పాన్ ఇండియా లెవెల్లో విడుదలకు సిద్ధమైంది ఆదిపురుష్ సినిమా. వచ్చే నెల 16న విడుదలకానున్న ఈ సినిమాకు నార్త్ లో భారీగా ప్రచారం చేయడానికి రంగం సిద్ధమైంది. అయోధ్య, వారణాసి లాంటి పవిత్ర స్థలాల్లో…

పాన్ ఇండియా లెవెల్లో విడుదలకు సిద్ధమైంది ఆదిపురుష్ సినిమా. వచ్చే నెల 16న విడుదలకానున్న ఈ సినిమాకు నార్త్ లో భారీగా ప్రచారం చేయడానికి రంగం సిద్ధమైంది. అయోధ్య, వారణాసి లాంటి పవిత్ర స్థలాల్లో ఆదిపురుష్ సినిమా కోసం భారీ ఈవెంట్లు ప్లాన్ చేశారు.

తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాకు ఎలాంటి ఈవెంట్లు ప్లాన్ చేయాలి, ఎక్కడ చేయాలి అనే అంశంపై మల్లగుల్లాలు పడుతున్నారు. ప్రస్తుతానికి అనుకున్న ప్లాన్ ప్రకారం.. జూన్ 1న తిరుపతిలో పెద్ద కార్యక్రమం నిర్వహించాలని అనుకుంటున్నారట. ఆ తర్వాత భద్రాచలంలో కూడా మరో భారీ ఈవెంట్ ప్లాన్ చేసే ఆలోచనలో యూనిట్ ఉన్నట్టు తెలుస్తోంది.

త్వరలోనే ఈ రెండు ఈవెంట్లపై స్పష్టత రాబోతోంది. తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలతో చర్చించి, వాళ్ల నుంచి అనుమతులొచ్చిన వెంటనే ఈ కార్యక్రమాల వివరాల్ని ప్రకటిస్తారు.

మరోవైపు ఆదిపురుష్ ప్రచారం కోసం ప్రభాస్ రెడీ అవుతున్నాడు. చాన్నాళ్లుగా బయట కనిపించని ఈ హీరో, ఇప్పుడు మరోసారి మీడియా కెమెరాల ముందుకు రాబోతున్నాడు. ఆదిపురుష్ ప్రచారానికి ఈ నెలలో 10 రోజులు టైమ్ కేటాయించాడు ప్రభాస్.

2 ఈవెంట్లతో పాటు, మీడియా ఇంటరాక్షన్ లో ప్రభాస్ పాల్గొంటాడు. ఆ తర్వాత గ్యాప్ ఇచ్చి, సినిమా రిలీజ్ కు వారం రోజుల ముందు మరోసారి ప్రచారం చేయబోతున్నాడు.

ప్రభాస్ కెరీర్ కు ఈ సినిమా అత్యంత కీలకంగా మారింది. సాహో, రాధేశ్యామ్ లాంటి డిజాస్టర్ల తర్వాత వస్తున్న సినిమా ఇది. తన పాన్ ఇండియా ఇమేజ్ ను, మార్కెట్ ను నిలబెట్టుకోవాలంటే.. ఆదిపురుష్ తో ప్రభాస్ పెద్ద హిట్ కొట్టాలి.