దేశం గర్వించదగ్గ వెండితెర కళాకారుడు, అగ్రహీరో కమల్‌హాసన్. ఆయన నటనా వారసురాలు శ్రుతిహాసన్. అయితే తండ్రి పేరు మీద తాను చిత్ర పరిశ్రమలో రాణించాలని మాత్రం అనుకోలేదు. నటనలో అద్భుత ప్రతిభతో మాత్రమే చిత్రపరిశ్రమలో నిలుదిక్కుకుంటారనే స్పృహ ఆమెలో ఎక్కువే. అందుకే సొంత కాళ్లపై నిలబడేందుకు మాత్రమే శ్రుతి ప్రాధాన్యం ఇస్తారు.
లాక్డౌన్ సమయంలో కుటుంబ సభ్యులెవరూ తోడు లేకుండా ముంబయ్‌లో రెండు నెలలుగా ఒంటరిగా ఉంటున్నారామె. ఇదేంటని ఎవరైనా అడిగితే ఒంటరితనం తనకు అలవాటే అని సమాధానం ఇస్తున్నారు. అంతేకాదు, ఏకాంతంగా గడపడాన్ని తానెంతగానో ఆస్వాదిస్తానని చెప్పుకొచ్చారు.
‘కుటుంబానికి దూరంగా ఉండటం నాకు కొత్తేమీకాదు. 19 ఏట ఉన్నత విద్యాభ్యాసం కోసం అమెరికా వెళ్లాను. ఆ సమయంలో నా ఒంటరిజీవితం ఆరంభమైంది. స్వీయ సాంగత్యాన్ని నేను ఇష్టపడతా. ఒంటరితనం నాలో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిం చడంతో పాటు సమస్యల్ని ధైర్యంగా ఎదుర్కొనే నేర్పును అలవర్చింది. ఇంటిపనులు, సంగీతసాధన, పుస్తక పఠనంతో విరామాన్ని సద్వినియోగం చేసుకుంటుంటాను’ అని శ్రుతి తన అభిప్రాయాలను కుండబద్దలు కొట్టినట్టు వెల్లడించారు.