1983లో కపిల్ సేన సాధించిన విఖ్యాత విజయం పై సినిమా విడుదలకు రెడీ అయ్యింది. ఫస్ట్ వేవ్ కరోనాకు పూర్వమే ఈ సినిమా చాలా వరకూ షూటింగును కంప్లీట్ చేసుకుంది. పలుసార్లు ఈ సినిమా ఓటీటీ విడుదల ఊహాగానాలు కూడా వినిపించాయి. అయితే ఈ సినిమా థియేటర్లకే వస్తోంది. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ కు మిశ్రమ స్పందన వచ్చింది.
క్రికెట్ అంటే ఇంత విపరీతమైన ఆదరణ లేని రోజుల్లో, క్రికెట్ అంటే డబ్బుకు పర్యాయపదంగా మారని రోజుల నాటి.. అద్బుత విజయగాథను ఎలా చూపిస్తారని సినీ, క్రికెట్ ప్రియులు ఆసక్తిదాయకంగా చూస్తున్నారు. ఒక సినిమాకు కావాల్సినంత బోలెడంత ముడి సరకు ఆ కాన్సెప్ట్ లో ఉంది. అయితే కల్పిత భావోద్వేగాలను ఏమైనా మిక్స్ చేస్తే మాత్రం.. తేడా రావొచ్చు.
ఇక 83 సినిమా హిట్ అయితే, ఆ వెంటనే 2011 టీమిండియా ప్రపంచకప్ సాధించిన వైనంపై కూడా ఒక సినిమా రెడీ కావొచ్చు. కపిల్ సేన విజయంపై సినిమా భారీ వసూళ్లను సాధిస్తే.. ఆ పై ధోనీ సేన విజయంపై మరో సినిమాకు ఛాన్సున్నట్టే. అయితే కపిల్ సేన విజయంలో ఉన్నంత సర్ ప్రైజ్ 2011లో ప్రపంచకప్ విజయంలో లేదు. స్వదేశంలో ప్రపంచకప్ జరగడంతో సహా అనేక పాజిటివ్ అంశాలున్నాయి 2011 ప్రపంచకప్ విజయంలో.
1983 ప్రపంచకప్ విజయంలో ఉన్నంత సర్ ప్రైజ్, డ్రామా.. 2011లో లేదు. అయితే బాలీవుడ్ దర్శకులు అనుకుంటే.. అలాంటి దాన్ని సృష్టించగలరు. క్రికెట్ ఆధారిత సినిమాలకు వాటి అనౌన్స్ మెంట్లతోనే.. బోలెడంత ప్రచారం రానే వస్తుంది. ఈ నేపథ్యంలో 83 హిట్ అయితే, 11 కు మార్గం సుగమం అయినట్టే!