ఇకపై హీరోలు దిగాల్సిందే

శేష్..నిఖిల్..విష్వక్..నవీన్…ఇప్పుడు నాని.. సినిమా ప్రచారానికి కొత్త ఒరవడిలు దిద్దుతున్నారు. సినిమా ప్రచారం అన్నది ఎప్పటికప్పుడు కొత్త పుంతలు తొక్కుతూనే వుంది. పీఆర్ టీమ్ లు, పబ్లిసిటీ నిపుణులు కొత్త కొత్త మార్గాలు కనిపెడుతూనే వున్నారు. …

శేష్..నిఖిల్..విష్వక్..నవీన్…ఇప్పుడు నాని.. సినిమా ప్రచారానికి కొత్త ఒరవడిలు దిద్దుతున్నారు. సినిమా ప్రచారం అన్నది ఎప్పటికప్పుడు కొత్త పుంతలు తొక్కుతూనే వుంది. పీఆర్ టీమ్ లు, పబ్లిసిటీ నిపుణులు కొత్త కొత్త మార్గాలు కనిపెడుతూనే వున్నారు. 

కాలేజీలకు వెళ్లడాలు, షాపింగ్ మాల్స్ చుట్టేయడం, థియేటర్ టూర్లు ఇవన్నీ అందులో భాగాలే. తరువాత తరువాత టీవీ ఇంటర్వూలు వచ్చాయి. ఆ తరువాత తరువాత టీవీ షో లకు కూడా హీరోలు వెళ్లడం మొదలైంది. అక్కడితో ఆగలేదు రీల్స్ చేయడం ప్రారంభించారు. షార్ట్స్ చేయడం మొదలుపెట్టారు.

అందరికన్నా ముందుగా నిఖిల్ ఎక్కువగా జనంలోకి వెళ్లే ప్రయత్నం చేసాడు. ఆ తరువాత ఈ పద్దతులను కొత్త పుంతలు తొక్కించింది మాత్రం అడవి శేష్, నవీన్ పోలిశెట్టి అనే చెప్పాలి. సినిమాను అడవిశేష్ భుజన మోసినట్లు ఎవ్వరూ మోయరేమో? విష్వక్ సేన్ కూడా సినిమాను చివరంటా ప్రచారం చేస్తాడు. కిరణ్ అబ్బవరం లాంటి వాళ్లు కిందా మీదా పడతారు. కానీ కాస్త రేంజ్ వచ్చిన హీరోలు మరీ ప్రచారం కోసం ఓ మెట్టుదిగడం అన్నది జరగలేదు.

రాజమౌళి మాట కాబట్టి రామ్ చరణ్, ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్ కోసం తిరిగారు తప్ప,వేరే సినిమాలకు అయితే రమ్మన్నా రారు.

ఇప్పుడు నాని ఆ పని చేసారు. ఇచ్చిన అన్ని భాషల ఇంటర్వూలు లెక్క కడితే వందకు పైగానే వుంటాయేమో? అన్ని భాషల్లో రీల్స్ చేసారు. వెళ్లిన ప్రతి పట్టణంలో లోకల్ ఫ్లావర్ లు రుచి చూసారు. ఇలా ఎన్ని చేయాలో అంతా చేసారు. దీనికి నాని కేటాయించుకున్నది అచ్చంగా ముఫై రోజులు.

ఇకపై ఏ హీరో అయినా ఇలా చేయాల్సిందే. లేని పోని భేషజాలకు పోతే ఓపెనింగ్ లు రావు. దసరా సినిమాకు ఈ రేంజ్ ఓపెనింగ్ రాకపోయి వుంటే బయ్యర్ల పరిస్థితి వేరుగా వుండేది. ఓపెనింగ్ అన్నది ఫస్ట్ వీకెండ్ అన్నది చాలా అంటే చాలా కీలకంగా మారింది. అలాంటి ఓపెనింగ్ కు కేవలం నాని చేసుకున్న ప్రచారం తప్ప మరేం కాదు.

ఇకపై మిగిలిన హీరోలు కూడా ఈ కొత్త దారిలో అడుగు పెట్టాల్సిందే.