ఇండియన్ మూవీస్‌పై మొదటి నుంచి విదేశీ సినిమాల ప్రభావం ఉంది. అసలు సినిమాకు సంబంధించి టెక్నాలజీనే మనం విదేశాల నుంచి తెచ్చుకున్నది కాబట్టి విదేశీ సినిమాల ప్రభావం ఉండటం పెద్ద వింతకాదు. అయితే టెక్నాలజీ విదేశాలదే అయినా సినిమా టెక్నాలజీ రాకముందే మనకంటూ బోలెడన్ని కథలు, గాథలు, నాటకాలు ఉన్నాయి. దీంతో వాటినే మనవాళ్లు సినిమాలుగా మలుస్తూ వచ్చారు. ప్రఖ్యాత నాటకాలను, ఇతిహాసగాథలను సినిమాలుగా మార్చారు మనవాళ్లు. దీంతో కథల కోసం మొదట్లో విదేశాల మీద ఆధారపడలేదు.
ఇతిహాసాలు, పౌరాణికాల ఆధారంగా సినిమాలు వచ్చినన్ని రోజులూ సినిమాల్లో భారతీయ తత్వమే రాజ్యమేలింది. ఎప్పుడైతే సోషల్ సినిమాలు రావడం మొదలైందో అక్కడ నుంచి కథలో మార్పు వచ్చాయి. అయితే సోషల్ సినిమాలకూ తగిన ముడిసరుకు మనదగ్గర బోలెడంత ఉండింది. బెంగాళీ నవలలు, వివిధ భాషల్లో వచ్చిన సామాజిక రచనలు సినిమా కథలుగా మరాయి. అయితే ఎనభైలలో కథ మారింది. విదేశీ సినిమాలు భారతీయులకు మరింత చేరువఅయ్యాయి. క్యాసెట్లు, వీసీపీల యుగంలో విదేశీ సినిమాలను సులభంగా చూసే అవకాశం లభించింది.
పౌరాణికాల ప్రభావం తగ్గిపోయింది, తీవ్రమైన మెలోడ్రామా సినిమాలను ప్రేక్షకులు కూడా తిరస్కరించడం ప్రారంభం అయ్యింది. దీంతో తెలివైన రచయితలు విదేశీ సినిమాల నుంచి కాన్సెప్ట్‌లను తీసుకురావడం మొదలైంది. విదేశీ యాక్షన్ సినిమాలను, థ్రిల్లర్లను భారతీయకరణ చేసి వాటిని సినిమాలుగా మలిచి ప్రేక్షకుల మీదకు వదిలే ప్రక్రియ ఇండియాలో సూపర్‌హిట్ అయ్యింది. మనదగ్గర అప్పట్లో క్లాసిక్స్‌గా నిలిచిన ఎన్నో సినిమాలకు మూలాలు విదేశాల్లోనే కనిపించాయి.
ఆ తర్వాత రానురానూ ఈ ప్రక్రియ ఎక్కువైపోయింది. మొదట్లో ఏదో ఒక పాయింట్ నో, సీన్ నో ఇన్ స్పిరేషన్‌గా తీసుకుని సినిమాలు తీయడం జరిగింది. ఆ తర్వాత సీన్ల కొద్దీ కాపీలు కొట్టారు. ఆపై విదేశీ సినిమాలకు అనధికార రీమేక్‌లు రావడం మొదలైంది. మొత్తం యథాతథంగా ఫారెన్ సినిమాలను తీశారు. అయితే క్రెడిట్స్ మాత్రం వాళ్లకు ఇవ్వరు. వీళ్ల టైటిళ్లే వసుకొంటూ వచ్చారు. గమనించాల్సిన అంశం ఏమిటంటే.. ఆ ప్రక్రియ దశాబ్దాల పాటు సాగింది. ఎనభైయవ దశకం చివర్లో మొదలైన ఆ విదేశీ సినిమాల యథాతథ కాపీ ప్రక్రియ ఇటీవల వరకూ కొనగాసింది.
దాదాపు రెండున్నర దశాబ్దాల పాటు అనేకమంది భారతీయ మూవీమేకర్లు విదేశీ సినిమాలను మక్కికిమక్కి దించి సినిమాలు రూపొందించారు. అలాంటి వాటిల్లో హిట్టైన సినిమాలూ ఉన్నాయి, ఫ్లాపులూ ఉన్నాయి. అలా విదేశీ సినిమాలను కాపీకొట్టడం గొప్పదనం అనే తీరున కూడా వ్యవహరించారు కొంతమంది మూవీమేకర్లు. తమ కాపీ స్క్రిల్స్ గర్వకారణం అన్నట్టుగా కొందరు వ్యవహరించారు. మరికొందరు మాత్రం తాము కాపీకొట్టిన విషయాన్ని ఒప్పుకోవడం మొదలుపెట్టారు.
బహుశా అలాంటి మొదటి డేరింగ్ మూవీ మేకర్ రామ్‌గోపాల్ వర్మ మాత్రమేనేమో! తను ఏయే సినిమాలను ఎక్కడ నుంచి కాపీ కొట్టింది వివరించిన ఘనుడు ఆర్జీవీ.అయితే ఆ దశలో కూడా చాలామంది టాప్ డైరెక్టర్లు, రచయితలు విదేశీ సినిమాలను కాపీ కొట్టి వాటికి తమ పేర్లను వేసుకొంటూ వచ్చారు, వారు అదేరీతిన సాగుతూ ఉన్నారు. అయితే ఇప్పుడు ప్రపంచపోకడలో చాలామార్పు వచ్చింది. కాపీలు కొడితే విదేశీ మూవీమేకర్లు కూడా ఊరికే ఉండటంలేదు.
రెండు నిమిషాల కంటెంట్ ను కాపీకొట్టినా దానిపై కోర్టుకు వెళ్లేందుకు ఇప్పుడు అవకాశాలున్నాయి. అందుకే ఇండియన్ మూవీమేకర్ల తీరులో కూడా మార్పు వచ్చింది. అధికారికంగా రైట్స్‌ను కొనుగోలు చేసి ఆయా సినిమాలను రీమేక్ చేస్తూ ఉన్నారు. విశేషం ఏమిటంటే.. ఇప్పుడు ఇండియా వ్యాప్తంగా విదేశీసినిమాల హవా నడుస్తూ ఉంది. ఈ మధ్యకాలంలో ఇండియాలో హిట్ అయినా, అవుతున్న కొన్ని సినిమాల జాబితాను పరిశీలిస్తే వాటి వెనుక విదేశీ సినిమాల ప్రభావం స్పష్టం అవుతుంది.
అంధాధున్ ఒక ఫ్రెంచి సినిమా..
ఇటీవల ప్రకటించిన జాతీయ అవార్డుల్లో కూడా ఈ సినిమా పేరు వినిపించింది. ఆయుష్మాన్ ఖురానా ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమాకు దర్శకుడు శ్రీరామ్ రాఘవన్. ఒక ఫ్రెంచి సినిమా ఆధారంగా ఈ సినిమాను రూపొందించాడు ఆ దర్శకుడు. 'ది పియానో ట్యూనర్' అనే సినిమా ఆధారంగా 'అంధాధున్' వచ్చింది.
'ఎవరు', 'బద్లా', ఒక స్పానిష్ సినిమా..
తెలుగు వారిని ఈ మధ్య బాగా థ్రిల్లింగ్‌కు గురిచేసిన సినిమా 'ఎవరు'. తెలుగులో కూడా ఇలాంటి సినిమాలు వస్తాయా.. అని చాలామంది ఆశ్చర్యపోయారు. అయితే ఇదంతా తెలుగు మూవీమేకర్ల క్రెడిట్ కాదు, మూల కథ వేరే వాళ్లది అని చెప్పకతప్పదు. ఈ సినిమా ముందుగా స్పానిష్ భాషలో వచ్చింది. 'ది ఇన్విసిబుల్ గెస్ట్' పేరుతో ఆ థ్రిల్లర్ రూపొందింది. అక్కడ సూపర్‌హిట్ అయ్యాకా ప్రపంచం దష్టిలో పడింది ఆ సినిమా. దానికి అనేక మార్పులు చేసుకొంటూ వివిధ భాషల్లో రీమేక్ చేస్తూవచ్చారు. అదే హిందీలో 'బద్లా'గా వచ్చింది. దానికి మరొకొన్ని మార్పులు చేసి తెలుగులో 'ఎవరు'గా తీశారు. హిందీలో ఈ సినిమా వంద కోట్ల రూపాయలకు మించిన లాభాలను సాధించింది. తెలుగులోనూ మంచి ఫలితాన్ని పొందుతోంది.
ముప్పైకోట్ల పై వసూళ్లు సాధించిన 'ఓబేబీ'..
తెలుగు వాళ్లకు ఈ మధ్యకాలంలో బాగా నచ్చిన విదేశీ సినిమాగా దీన్ని చెప్పాలి. కొరియన్ సినిమా 'మిస్ గ్రానీ' ఆధారంగా తెలుగులో ఈ సినిమా రూపొందింది. కేవలం తెలుగు వారినే కాగా ఇంకా ప్రపంచ వ్యాప్తంగా అనేకమంది సినీప్రియులను ఈ సినిమా ఆకట్టుకుంది. కొరియన్ భాషలో రూపొందాకా ఇప్పటివరకూ పదకొండు భాషల్లో ఈ సినిమా రూపొందింది. ఇక హిందీలో కూడా ఈ సినిమా రీమేక్‌కు రంగం సిద్ధం అవుతూ ఉంది. ఇలా ఇండియాపై కొరియన్ సినిమాల ప్రభావం కొనసాగుతూ ఉంది.
స్టార్ హీరోలకూ విదేశీ సినిమాలే దిక్కు!
హిందీలో మూవీమేకర్లు ఇప్పుడు రీమేక్‌లకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ ఉన్నారు. అందుకోసం అన్నిభాషల వైపు చూస్తూ ఉన్నారు. సౌతిండియన్ సినిమాలను రీమేక్ చేయడంతో పాటు విదేశీ సినిమాలను రీమేక్ చేయడానికి కూడా అక్కడి స్టార్లు రెడీ అవుతున్నారు. వారు ఇన్నేళ్లూ కాపీలు కొట్టేవారు. ఇప్పుడు అధికారికంగా హక్కులు కొనుక్కొని రీమేక్ చేస్తూ ఉన్నారు. అలాంటి వాటిల్లో ఒకటి సల్మాన్‌ఖాన్ సినిమా 'భారత్'. కొరియన్ డ్రామా 'ఏన్ ఆడ్ టు మై ఫాదర్' ఆధారంగా 'భారత్' సినిమా వచ్చింది. ఈ సినిమాకు మిశ్రమ స్పందన వ్యక్తం అయ్యింది.
తెలుగులో మన్మథుడికి విదేశీ స్ఫూర్తి!
తెలుగులో విదేశీ సినిమాలను రీమేక్ చేయడం ఒక సంప్రదాయంగా మారుతూ ఉంది. ఇదివరకే 'ఊపిరి' సినిమాతో నాగార్జున మంచి అనుభూతి పొందారు. ఒక ఫ్రెంచి సినిమా ఆధారంగా ఆ సినిమా రూపొందింది. ప్రశంసలు పొందింది. అలా విదేశీ సినిమా ఇచ్చిన విజయంతో నాగార్జున మన్మథుడు 2 రూపంలో మరో ప్రయత్నం చేశారు. ఈసారి కూడా మరో విదేశీ సినిమా హక్కులను కొనుక్కొని రీమేక్ చేశారు. అయితే ఈ సినిమా అంత సానుకూల ఫలితాన్ని ఇవ్వలేదు. నార్జున కెరీర్‌కు ఒక ఫ్లాప్‌ను జోడించింది మన్మథుడు 2 సినిమా. విదేశీ సినిమాలను రీమేక్ చేయడంలో కాస్త జాగ్రత్త వహించాలనే సందేశాన్ని మూవీమేకర్లకు ఇచ్చింది మన్మథుడు 2.
మరిన్ని రాబోతున్నాయి..
హిందీలో ప్రస్తుతం మేకింగ్ దశలో కొన్ని సినిమాలు ఉన్నాయి. వాటి వెనుక విదేశీ సినిమాల పేర్లు వినిపిస్తూ ఉన్నాయి. పరిణితీ చోప్రా ప్రధాన పాత్రలో నటిస్తున్న ఒక సినిమాకు ఆధారం 'ది గర్ల్ ఆన్ ట్రైన్' అనే హాలీవుడ్ సినిమా అనేమాట వినిపిస్తూ ఉంది. వచ్చే ఏడాది ఈ సినిమా విడుదల కాబోతూ ఉంది.