21వ శతాబ్దంలో వచ్చిన గొప్ప థ్రిల్లర్లలో ఒకటిగా, గొప్ప సినిమాల్లో ఒకటిగా నిలుస్తుంది 'మెమొరీస్ ఆఫ్ మర్డర్'. కొరియన్ భాషలో, దక్షిణ కొరియా వేదికగా సాగే ఇది వైవిధ్యభరితమైన కథా నేపథ్యంతో రూపొందిన సినిమా. క్రైమ్, మిస్టరీ సినిమాలు అంటే.. వాటికో క్లైమాక్స్ అంటూ ఉంటుంది.
ఎన్నో సీరియల్ కిల్లింగ్స్ పై వచ్చిన సినిమాలుంటాయి. వాటన్నింటిలో కూడా.. హత్యలను ఎవరు చేస్తున్నారో.. అవి తెరపై జరిగేటప్పుడే ప్రేక్షకులకు తెలుస్తాయి! లేదంటే.. ఏవైనా ట్విస్టులు ఇచ్చినా సస్పెన్స్ ను క్లైమాక్స్ లో అయినా రివీల్ చేస్తారు. అలా ఇచ్చినప్పుడే ప్రేక్షకుడికి థ్రిల్. మరి అలాంటి థ్రిల్ ఏదీ లేకుండా.. అన్ సాల్వ్డ్ మిస్టరీ కథతో కూడా ప్రేక్షకుడిని థ్రిల్ చేయవచ్చని నిరూపించిన సినిమాల్లో ఒకటి 'మెమోరీస్ ఆఫ్ మర్డర్'.
మిస్టీరియస్ మర్డర్స్ గురించి సినిమా అంతా చూపించి, చివరకు అవి ఎందుకు జరిగాయో, ఎవరు చేశారో? చెప్పకుండానే ప్రేక్షకుడిని సంతృప్తి పరచాలంటే మాటలేమీ కావు! అలాంటి అరుదైన సినిమాలు వేళ్ల మీద లెక్కబెట్టదగిన సంఖ్యలోనే ఉంటాయి. హాలీవుడ్ రూపకర్తలు 'జోడియక్' అంటూ సినిమా తీశారు.
క్రైమ్ స్టోరీస్ ను అద్భుతంగా డీల్ చేయగల డేవిడ్ ఫించర్ ఆ సినిమాను రూపొందించాడు. జాడ దొరకని జోడియక్ కిల్లర్ గురించి రూపొందిన సినిమా అది. అది మరో అద్భుత థ్రిల్లర్. జోడియక్ 2007లో రాగా అంతకన్నా నాలుగు సంవత్సరాల ముందే 2003లో 'మెమోరీస్ ఆఫ్ మర్డర్' వచ్చింది. జోడియక్ లో హంతకుడు ఎక్కడా కనపడకపోయినా, పలుసార్లు అతడి వాయిస్ వినిపిస్తుంది. అయితే మెమోరీస్ ఆఫ్ మర్డర్ లో ఎక్కడా హంతకుడి ఊసే ఉండదు.
హత్యలు జరుగుతూ ఉంటాయి, జరుగుతూ ఉంటాయి, జరుగుతూనే ఉంటాయి. అతడిని పట్టుకోవడానికి జరిగే ప్రయత్నాలు బోలెడంత ఆసక్తిదాయకంగా ఉంటాయి. అయితే ఏ ఒక్కటీ సఫలం కావు. అనేక మంది అనుమానితులను పట్టుకుంటారు. అయితే ఎవరి విషయంలోనూ ఆధారాలు లభించవు. దీంతో అన్ సాల్వడ్ మిస్టరీగానే మిగిలిపోతుంది ఆ వ్యవహారం.
మరో విశేషం ఏమిటంటే.. ఇది దక్షిణ కొరియాలో జరిగిన నిజమైన వ్యవహారం. ఆ మిస్టీరియస్ హత్యల గురించి ఒక స్టేజ్ ప్లే ఒకటి తయారైందట. దాని ఆధారంగా దర్శకుడు బొంగ్-జూన్-హో ఈ సినిమాను రూపొందించాడు.
ఇతడు మరెవరో కాదు.. గత ఏడాది ఆస్కార్ అవార్డును కొల్లగొట్టిన 'పారసైట్' సినిమా రూపకర్త! 'పారసైట్' దర్శకుడిగా ప్రపంచం దృష్టిని ఆకర్షించిన ఈ డైరెక్టర్ 17 యేళ్ల కిందటే.. మెమోరీస్ ఆఫ్ మర్డర్ తో ప్రపంచాన్ని కట్టిపడేశాడు!
దక్షిణ కొరియాలో సైనిక పాలన సాగుతున్న సమయంలో, అప్పటికి ఆ దేశం ఇంత ప్రగతిని సాధించని తరుణంలో ఈ కథ సాగుతుంది. తన సినిమాల్లో తన దేశపు సామాజిక అంశాల గురించి కూడా ప్రస్తావించే దర్శకత్వ శైలి ఇతడిది. 'పారసైట్' లో సౌత్ కొరియాలో నార్త్ కొరియా గురించి ఉన్న అభిప్రాయాలను పాత్రల మాటల్లో వినిపించాడు.
నార్త్ కొరియా ఎప్పటికైనా తమపై దాడి చేసి తీరుతుందని సౌత్ కొరియన్లు బలంగా విశ్వసిస్తున్నారని ఆ సినిమాలోని డైలాగ్స్ తో అర్థం అవుతుంది. ఎంతలా అంటే.. ఇళ్లలోపల బంకర్లను కట్టుకుని మరీ వారు ఆ దాడులకు ప్రిపేర్డ్ గా ఉంటారట. ఇక మెమోరీస్ ఆఫ్ మర్డర్ లో కూడా సౌత్ కొరియన్ సామాజిక పరిస్థితులు గురించి పలు కామెంట్లు ఉంటాయి. సబ్ టైటిల్స్ తో ఈ సినిమాను చూస్తేనే అవన్నీ అర్థమవుతాయి. సబ్ టైటిల్స్ లేకపోయినా.. కథపై ఎలాంటి కన్ఫ్యూజన్ లేకుండా అర్థమవుతుంది ఈ కొరియన్ సినిమా.
1986లో ఒక సౌత్ కొరియన్ గ్రామీణ ప్రాంతంలో జరిగిన వరస హత్యల కథ ఇది. బాధితులు అంతా అమ్మాయిలు, మహిళలు. వారిపై అత్యాచారం, హత్యలు చేస్తూ ఉంటాడు ఒక సీరియల్ కిల్లర్. ముందుగా జరిగిన రెండు ఘటనలనూ లోకల్ పోలిస్ డీల్ చేస్తాడు.
తన చూపుతోనే కిల్లర్ ఎవరో చెప్పేస్తానంటూ ఆ పోలీసాఫీసర్ కామెడీ చేస్తూ ఉంటాడు. రెండు హత్యలు జరగడంతో సియోల్ నుంచి ఈ కేసుపై విచారణకు ఒక ప్రత్యేక అధికారి వస్తాడు. వచ్చేంది ఎఫ్బీఐ అధికారా.. అంటూ లోకల్ పోలీసు తన పాండిత్యాన్ని అంతా వెటకారం కోసం ఉపయోగిస్తాడు. సౌత్ కొరియాకు లోకల్ ఇన్వెస్టిగేషన్, నేషనల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ అంటూ సపరేట్ అవసరం లేదని, దక్షిణ కొరియా మొత్తాన్నీ నడుచుకుని చుట్టేస్తూ.. విచారణ పూర్తి చేసేయవచ్చంటాడు! .
అమెరికా పెద్ద దేశం కాబట్టి., అక్కడ వేర్వేరు విచారణ సంస్థలు అవసరం అని, సౌత్ కొరియాకు అవసరం లేదంటూ.. సియోల్ నుంచి వచ్చే అధికారి ఏం చేస్తాడంటూ దెప్పి పొడుస్తాడు! అయితే నిందితుడి కళ్లలోకి చూసి అతడు నేరం చేశాడో లేదో చెప్పగలననే లోకల్ పోలిస్ ఈ కేసులో ఏమీ తేల్చలేకపోతాడు. దీంతో రంగంలోకి దిగిన సియోల్ అధికారి, ఈ కేసును చాలా సీరియస్ గా విచారిస్తాడు. అయితే.. ప్రయోజనం దక్కదు.
ఈ విచారణ ఆసాంతం ఆసక్తిదాయకంగా సాగుతుంది. హత్యలు జరిగినప్పుడు పరిస్థితులు, క్రైమ్ సీన్లో లభించే ఆధారాలు కథను ఉత్కంఠభరితంగా మారుస్తాయి. ఒక్కోసారి ఒక్కో అనుమానితుడు తెరపైకి వస్తాడు. అయితే వారు అనుకోకుండా అనుమానితులు అయిన వారు. ఒకడికేమో ఆడవాళ్ల లోదుస్తులను దొంగతనంగా తీసుకెళ్లి సంతృప్తి పడే అలవాటు ఉంటుంది. వాడు అనుకోకుండా సీరియల్ కిల్లర్ గా అనుమానించబడతాడు. తీసుకెళ్లి తుక్కురేగ్గొట్టాకా.. వాడో మానసిక రోగి అని మాత్రమే తేలుతుంది.
ఇంకో ఫ్యాక్టరీ వర్కర్ అనుమానితుడిగా తేలతాడు. అతడు నిందితుడు అనేందుకూ ఆధారాలు సరిపోలవు. ఆ తర్వాత మరో యువకుడు అనుమానితుడు అవుతాడు. రేప్ జరిగిన చోట నుంచి సేకరించిన స్పెర్మ్ డీఎన్ఏ లను పరిశీలించే టెక్నాలజీ అప్పటికి దక్షిణకొరియా వద్ద లేకపోవడంతో అనుమానితుడి శాంపిల్స్ తో పోల్చమని అమెరికాకు పరీక్షకు పంపుతారు. అక్కడ డీఎన్ఏ మ్యాచ్ కాకపోవడంతో మరొక అనుమానితుడు నిర్దోషిగా బయటకు వస్తాడు.
వర్షం కురిసిన రోజులే అన్ని హత్యలూ జరిగాయి, అలాగే హత్య జరిగిన ప్రతి రోజూ లోకల్ రేడియోలో ఒకే సాంగ్ ప్లే అయ్యిందనే విషయాన్ని పరిశోధనలో గుర్తిస్తారు. ఆ సాంగ్ అడిగిన వాడే ఆ మూడ్ లోనే వెళ్లి హత్య చేశాడని అనుకుంటారు. అలా అనుమానితుడిని పట్టుకున్నా.. అక్కడా ఆధారాలు లభించవు.
ఇదే కాన్సెప్ట్ నే తెలుగు దర్శకుడు రవిబాబు తన సినిమా 'అనసూయ'లో వాడుకున్నాడు. అందులో శాడిస్టిక్ కిల్లర్ పాత్రను చేసిన రవిబాబు.. తన ప్రేయసికి ఇష్టమైన 'ఏ తీగ పువ్వునో..' సాంగ్ ను ప్లే చేయమని కోరిన సమయంలోనే హత్యలు చేసి ఉంటాడు. సీరియల్ కిల్లర్ కూ, సాంగ్ కు పడిన ముడి ఈ దక్షిణ కొరియా సినిమాతోనే. దాన్నే తన సినిమాలో అన్వయించాడు రవిబాబు.
1986 సమయంలో జరిగిన హత్యల గురించి అప్పటి విచారణలో ఏమీ తేలదు. హత్యలు చేసింది ఎవరో తేల్చకుండానే సియోల్ నుంచి వచ్చిన అధికారి బదిలీ అయిపోతాడు. అంతటితో విచారణ ముగిసినట్టుగా చూపుతారు. ఇక లోకల్ పోలిస్ 2003 నాటికి ఆ ఉద్యోగాన్ని వదిలి బిజినెస్ మ్యాన్ గా సెటిలయి ఉంటాడు.
నాటి గ్రామం కూడా చాలా మారిపోయి ఉంటుంది. గొప్ప పారిశ్రామీకరణతో.. ఎంతో అభ్యున్నతి సాధించి ఉంటుంది. ఆ మర్డర్ మిస్టరీ మాత్రం తేలలేదు. లోకల్ పోలీసాఫీసర్ గా చేసిన అతడికి ఇంకా నమ్మకం.. నిందితుడి కళ్లలోకి చూస్తే చాలు అతడు తప్పు చేశాడో లేదో తను చెప్పగలనని, కానీ ఆ హత్యలు చేసిన వాడు మాత్రం అతడికి ఇంకా ఎదురుపడకుండానే సినిమా ముగుస్తుంది.
ఏదైనా థ్రిల్లింగ్ సినిమాలో క్లైమాక్స్ వీక్ గా ఉన్నా, రొటీన్ గా ఉన్నా, అర్థవంతంగా లేకపోయినా.. ప్రేక్షకుడు తీవ్ర నిరాశకు గురవుతాడు. అయితే అసలు అన్ సాల్వ్డ్ అంటూ క్లైమాక్సే లేకుండా థ్రిల్లర్ ను రూపొందించి తన దేశాన్నే గాక.. విదేశాల్లోని ప్రేక్షకులను కూడా మెప్పించిన ఘనత ఈ సినిమా దర్శకుడిది.
కొసమెరుపు ఏమిటంటే.. ఈ కథ నిజంగా జరిగినది 1980లలో. ఈ సినిమా తీసింది 2003 సమయంలో. అప్పటికి ఆ సీరియల్ కిల్లర్ ఎవరో చట్టానికి దొరకలేదు. సినిమాలో చూపించినట్టుగా విచారణ మాత్రం 2003 నాటికి ముగియలేదు. ఆ కేసు అలాగే చాలా కాలంలో పెండింగ్ లో ఉన్నా.. విచారణ అంతర్గతంగా కొనసాగినట్టుగా ఉంది. చివరకు ఇటీవలే కొన్నేళ్ల కిందట ఈ కేసుల్లో నిందితుడు పట్టుబడ్డాడు.
ఆ హత్యలు చేసింది ఎవరో రియల్ దక్షిణ కొరియా పోలీసులు తేల్చారు. 'మెమోరీస్ ఆఫ్ మర్డర్' హంతకుడు దొరికాడు! దోషి ఎవరో తేలిన తర్వాత ఈ సినిమా దర్శకుడు స్పందించాడు. అది తనకు చాలా సర్ ప్రైజ్ గా ఉందన్నాడు. నిజమైన హంతకుడి ప్రస్తావన సినిమాలో ఎక్కడా ఉండదు. ఎందుకంటే.. ఈ సినిమా తీసే సమయానికి అతడెవరో ఎవరికీ తెలియదు! ఆస్కార్ అవార్డు స్థాయి క్రియేటర్ అయిన బొంగ్-జూన్ కూ అతడవెరో అప్పటికి అంతుపట్టలేదు! పోలీసులు మాత్రం దశాబ్దాల తర్వాత అతడెవరో తేల్చారు. సినిమా సమయానికి ఇది అన్ సాల్వ్డ్ మిస్టరీ అయినా, వాస్తవంలో మాత్రం దశాబ్దాలకు ఒక కొలిక్కి వచ్చింది!
-జీవన్ రెడ్డి.బి