భోళాశంకర్ ఫ్లాప్ తో చిరంజీవిపై ఓ రేంజ్ లో పుకార్లు, ఊహాగానాలు చెలరేగుతున్నాయి. చిరంజీవి రెమ్యూనరేషన్, అనీల్ సుంకర నష్టాలు, డిస్ట్రిబ్యూటర్ల పాట్లు, భోళాశంకర్ కలెక్షన్లు.. అంటూ చాలా అంశాలపై ఇప్పటికే ఎన్నో కథనాలు ప్రచారంలో ఉన్నాయి. ఇప్పుడు వీటికి కొనసాగింపుగా మరో ప్రచారం ఊపందుకుంది. ఇందులో కొంత లాజిక్ ఉంది, ఇంకొంత అవాస్తవం కూడా ఉంది.
ఇంతకీ మేటర్ ఏంటంటే.. తన కెరీర్ లో బిగ్గెస్ట్ డిజాస్టర్ గా నిలిచిన భోళాశంకర్ రిజల్ట్ తో చిరంజీవి చాలా హర్ట్ అయ్యారంట. ఎంతలా అంటే, ఏకంగా సినిమాలకు కొన్నాళ్లు విరామం ఇవ్వాలని ఆయన అనుకుంటున్నారట. అలా డిసైడ్ అయిన తర్వాతే ఆయన సర్జరీ చేయించుకున్నారనే ప్రచారం సాగుతోంది.
కెరీర్ లో చిరంజీవికి గ్యాప్స్ కొత్తకాదు. గతంలో హిట్లర్ సినిమాకు ముందు ఆయన గ్యాప్ తీసుకున్నారు. బిగ్ బాస్, రిక్షావోడు లాంటి ఫ్లాప్స్ రావడంతో ఏడాదికి పైగా గ్యాప్ తీసుకున్నారు. హిట్లర్ నుంచి మళ్లీ కెరీర్ లో గ్యాప్ అన్నదే లేకుండా దూసుకుపోయారు. 2007 వరకు ఏటా కనీసం ఓ సినిమాను విడుదల చేశారు.
ఆ తర్వాత రాజకీయాల్లోకి రావడంతో, సినిమాలకు సుదీర్ఘ విరామం ప్రకటించారు చిరు. అలా లాంగ్ గ్యాప్ తీసుకొని ఖైదీ నంబర్ 150తో రీఎంట్రీ ఇచ్చారు. పునరాగమనంలో స్లోగా సినిమాలు చేస్తూ వచ్చిన చిరంజీవి, రీసెంట్ గా స్పీడ్ పెంచారు. అంతలోనే భోళాశంకర్ తో స్పీడ్ బ్రేకర్ పడింది.
పుట్టినరోజుతో క్లారిటీ వచ్చే ఛాన్స్..
దీంతో మరోసారి కెరీర్ లో గ్యాప్ తీసుకోవాలని అనుకుంటున్నారట చిరు. అయితే ఈ రూమర్ లో నిజం ఎంతనేది ఇప్పట్లో తేలేది కాదు. ఎందుకంటే, ఇలాంటి అంశాలపై ఎవ్వరూ స్పందించరు. దీనిపై క్లారిటీ కావాలంటే వారం రోజులు ఆగాల్సిందే. మరికొన్ని రోజుల్లో చిరంజీవి పుట్టినరోజు వస్తోంది ఆ రోజున కొత్త సినిమాను ఎనౌన్స్ చేస్తే ఓ స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఎనౌన్స్ చేయకపోతే మాత్రం అనుమానించాల్సిందే.
ప్రస్తుతం చిరంజీవి చేతిలో అధికారికంగా 2 సినిమాలున్నాయి. కల్యాణ్ కృష్ణ దర్శకత్వంలో ఓ సినిమా, యూవీ క్రియేషన్స్ బ్యానర్ పై మరో సినిమా చేయాల్సి ఉంది. ఈ రెండు సినిమాల్లో కల్యాణ కృష్ణ సినిమా ముందుగా సెట్స్ పైకి వస్తుంది. ఇది ఇప్పట్లో మొదలవుతుందా అవ్వదా అనే విషయంపై చిరంజీవి పుట్టినరోజు నాడు క్లారిటీ వస్తుంది.