మాజీ మంత్రి, కాపు ఉద్యమనాయకుడు ముద్రగడ పద్మనాభం కోసం వైసీపీ తహతహలాడడం ఆశ్చర్యం కలిగిస్తోంది. అసలు ముద్రగడ అవసరం వైసీపీకి ఉందా? అనేది ప్రశ్న. అసలు తన ఇంటి వద్దకు వైసీపీ నేతలెవరూ రావద్దని బహిరంగంగా ఛీత్కరించిన ముద్రగడను చేర్చుకుని ఏం సాధిస్తారో అర్థం కావడం లేదనే చర్చకు తెరలేచింది.
టీడీపీలో లేక జనసేనలో చేరుతామని ముద్రగడ పద్మనాభం కుమారుడు గిరి మీడియాకు చెప్పిన సంగతి తెలిసిందే. జనసేనకు చెందిన తన కులం నాయకులను ఇంటికి పిలిపించుకుని మరీ భోజనాలు పెట్టి, వైసీపీ నేతల్ని అవమానించే రీతిలో ముద్రగడ వ్యవహరించారు. జనసేనలోకి వెళ్తున్నామనే అత్యుత్సాహంలో వైసీపీని చిన్న చూపు చూసిన ముద్రగడ వెంట ఆ పార్టీ నాయకులు ఎందుకు పరుగెత్తుతున్నారో వారికే తెలియాలి.
ముద్రగడ పద్మనాభం అంటే కాపు పెద్దలకు గౌరవం వుండొచ్చు. అయితే ఆయన చెప్పినట్టు నడుచుకునే పరిస్థితిలో కాపు యువత లేదు. ముద్రగడ పద్మనాభాన్ని చేర్చుకోవడం వల్ల ఇతర కులాలు ఆలోచనలు ఎలా వుంటాయో వైసీపీ అంచనా వేసుకోవడం మంచిది. ఇవాళ ముద్రగడ పద్మనాభం ఇంటికి వైసీపీ నేత జక్కంపూడి గణేష్ వెళ్లారు. ఉభయగోదావరి జిల్లాల వైసీపీ కోఆర్డినేటర్ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డితో ముద్రగడ ఫోన్‌లో మాట్లాడినట్టు ప్రచారం జరుగుతోంది.
కేవలం ఎన్నికల కోసం, అది కూడా పవన్‌కల్యాణ్ కాదు పొమ్మంటే వచ్చే నాయకుల వల్ల లాభమా? నష్టమా? అనేది వైసీపీ ఆలోచించాలి. ముద్రగడ వ్యక్తిగతంగా నిజాయతీపరుడు. ఇందులో రెండో మాటకు తావు లేదు. అయితే రాజకీయంగా నిలకడలేని తనమే ఆయనకు నష్టం కలిగిస్తోంది. ఇప్పుడు వైసీపీలోకి వచ్చినా, ఏ మేరకు నిబద్ధతతో వుంటారనే దానిపై ఫలితం ఆధార పడి వుంటుంది. పవన్‌పై పోటీకే ముద్రగడను తీసుకుంటున్నారనే వాదన బలంగా వినిపిస్తోంది. చూడాలి ఏమవుతుందో.