మా ఇంట పెళ్లికి మీ హడావుడి ఏంటీ అన్నాడట వెనకటికి.. సామాజిక పిచ్చి తలకెక్కిన వారికి ఇలాంటి సుద్దలు తలకెక్కవు. అభ్యుదయ, ఆధునిక భావాలతో ముందుకు వెళ్లాల్సిన యువతరం, విదేశీ గడ్డ మీద కూడా కులాల కుమ్ములాటలకు, పిచ్చి ఫ్యానిజమ్ కు దిగి తెలుగు జాతి పరువును నగుబాటు పాలు చేస్తోంది.
జై బాలయ్య అని వున్నట్లుండి.. సమయం సందర్భం లేకుండా అరవడం మీకు బాగుండొచ్చు. కానీ అందరికీ కాదు కదా.. అది ఎప్పుడు తెలుసుకుంటారో ఈ బాలయ్య అభిమానులు. సినిమా మాంచి రసపట్టులో సాగుతుంటుంది. సీన్ తో, సినిమాతో సంబంధం లేకుండా జై బాలయ్య అనే అరుపు ఏ మూల నుంచో వినిపిస్తుంది. జనం ఘొల్లున నవ్వుతారు.
సినిమా వరకు ఓకె. లైట్ తీసుకుంటారు. కానీ ఫంక్షన్లో, పార్టీలో, మరోటో అయినపుడు కూడా ఇవే అరుపులు. వాళ్లకు నచ్చుతుందో, నచ్చదో అన్న ఆలోచన అనవసరం. అరిచేయడమే. కానీ అక్కడ బాలయ్య అభిమానులు కాని వారు వుంటేనే అసలు సమస్య మొదలవుతుంది. అలా గొడవ కావడమే అసలు వీళ్లకు కావాల్సింది కూడా అనిపిస్తుంది ఒక్కోసారి. కొట్టుకోవడం, తన్నుకోవడం, దాన్ని పక్కదారి పట్టించేలా రాతలు రాయించుకోవడం.
లేటెస్ట్ గా అమెరికాలో జరిగింది కూడా ఇలాంటిదే. కోవిడ్ తరువాత అమెరికాకు వచ్చి యంగ్ బ్యాచ్‌లో సినిమా హీరోల అభిమానులు విపరీతంగా వున్నారు. అలా వుండడం తప్పు కాదు, కానీ వీరి అభిమానం వెర్రితలలు చేసి, అమెరికాలో మన వాళ్ల పరువు నిలువునా తీస్తోంది. అమెరికాలో ఇప్పటి తరం ప్రవర్తిస్తున్న తీరు చూసి, తొలితరం జనాలు తలదించుకుంటున్నారు.
ఇల్లినాయిస్ లో..ఓ ఆర్కెస్ట్రా బ్యాండ్. టికెట్‌లు అమ్మారు. ఆడియన్స్ వచ్చారు. స్మూత్ గా ప్రోగ్రామ్ జరిగిపోతోంది. అప్పుడు వచ్చారు కొంతమంది. మామూలే కదా.. జై బాలయ్య అంటూ అరుపులు. దాంతో బలవంతంగా బయటకు పంపారు. ఎవరైనా చేసేది అదే కదా. వాళ్ల కార్యక్రమం రసాభాస కాకూడదనే కదా. అలా బయటకు వెళ్లిన వాళ్లు, సినిమాల్లో మాదిరిగా మరి కొంత మందిని పోగేసుకున్నారు. ఇంకేముంది.. ప్రోగ్రామ్ కాగానే దాడికి దిగిపోయారు. కొట్టుకున్నారు, చొక్కాలు చించుకున్నారు.
అంతా బాగానే వుంది.
అసలు కథ అప్పుడే మొదలైంది. ఈ వీడియోలు బయటకు వదిలి అదేదో వైకాపాలోని రెండు వర్గాల నడుమ జరిగిన గొడవలా వాట్సాప్ గ్రూపుల్లో ప్రచారం. ఇందులో స్వామికార్యం, స్వకారం రెండూ వున్నాయి. జైబాలయ్య గడబిడ అన్నది మరుగున పడిపోతుంది. వైకాపాను బదనామ్ చేయడం అన్నది జరిగిపోతుంది. మన గ్రూపులు, మన మీడియా, మన ప్రచారం అంటూ రెడీగా వుంటుందిగా ఓ సామాజిక వర్గం ఇలాంటివి చేయడానికి. అదే జరిగిపోయింది.
కానీ అసలు విషయం… జై బాలయ్య.