అర్జున్ రెడ్డి- కబీర్ సింగ్ మానియా నుంచి ఇంకా బయటకు రాలేదు జాన్వీ కపూర్. ఆ సినిమా తనకు పిచ్చిపిచ్చిగా నచ్చేసిందని అంటోంది జాన్వీ. తన తాజా ఇంటర్వ్యూలో జాన్వీ ఈ విషయాలను చెప్పుకొచ్చింది. ఒకవైపు అర్జున్ రెడ్డి హిందీ వెర్షన్ కబీర్ సింగ్ ను కొంతమంది బాలీవుడ్ ఫిల్మ్ మేకర్లు విమర్శించారు. ప్రత్యేకించి హీరోయిన్ పై హీరో చేయి చేసుకునే సీన్ ను కొందరు తీవ్రంగా విమర్శించారు. ఆఖరికి రేప్ సంఘటనలకు కూడా ఆ సీన్ ను ముడిపెడుతూ కొంతమంది అక్కసు వెల్లగక్కారు.
బాలీవుడ్ లో కబీర్ సింగ్ సక్సెస్ ను అసూయ చెందిన వారు ఆ తరహా వ్యాఖ్యానాలు చేశారు. అయితే అందుకు పూర్తి భిన్నంగా కబీర్ సింగ్ సినిమా తనకు విపరీతంగా నచ్చిందని, ఆ సినిమాలో తప్పు పట్టేందుకు లేదని, ఆర్ట్ ను ఫిల్టర్ చేయలేమని.. భావోద్వేగాలను అద్భుతంగా పండించిన సినిమా అంటూ కబీర్ సింగ్ ను ఆకాశానికెత్తేసింది జాన్వీ కపూర్. అంతే కాదు.. అలాంటి సినిమాలో నటించే అవకాశం కోసం వేచి ఉన్నట్టుగా జాన్వీ చెప్పింది.
'ఐ లవ్డ్ కబీర్ సింగ్..' అని అంటోంది జాన్వీ కపూర్. ఆ సినిమాలో దేన్నీ తప్పుపట్టేందుకు లేదని జాన్వీ చెబుతోంది. అప్పుడప్పుడే టీనేజ్ దాటుతున్న వాళ్లను కబీర్ సింగ్ సినిమా హత్తుకోవడంలో పెద్ద ఆశ్చర్యం లేదు. జాన్వీ కూడా ఆ కేటగిరి అమ్మాయే. ఇది వరకే అర్జున్ రెడ్డి సినిమా విషయంలోనూ జాన్వీ స్పందించింది. ఆ సినిమా నచ్చిందని, విజయ్ దేవరకొండతో నటించాలని ఉందని కూడా జాన్వీ అప్పట్లో ప్రకటించింది.