షారూక్ ఖాన్ తాజా చిత్రం జవాన్. సెప్టెంబర్ 7న ఈ సినిమా థియేటర్లలోకి వస్తోంది. ఈ సందర్భంగా ఈరోజు జవాన్ ట్రయిలర్ రిలీజ్ చేశారు. ఈ ట్రయిలర్ చూస్తే, కచ్చితంగా ఎవరికైనా ఓ వెబ్ సిరీస్ గుర్తొస్తుంది.
ఈరోజు రిలీజైన జవాన్ ట్రయిలర్, మనీ హెయిస్ట్ అనే వెబ్ సిరీస్ ను తలపిస్తోంది. అందులో ప్రొఫెసర్ అనే క్యారెక్టర్ ఉంటుంది. అతడు కొంతమందితో ఓ గ్రూప్ ను తయారుచేస్తాడు. ఒకరితో ఒకరికి సంబంధం లేని వ్యక్తుల్ని కలుపుతాడు. ఎవ్వరూ గుర్తుపట్టకుండా ఉండేందుకు నగరాల పేర్లు పెడతాడు. వాళ్లను ఓ బ్యాంక్ లోకి పంపిస్తాడు. బ్యాంక్ రాబరీ నేపథ్యంలో సాగే ఆ సిరీస్ ప్రపంచవ్యాప్తంగా సూపర్ హిట్టయింది.
ఆ వెబ్ సిరీస్ ఛాయలు జవాన్ ట్రయిలర్ లో కనిపిస్తున్నాయి. ట్రయిలర్ ప్రకారం చూసుకుంటే, హీరో ఓ మెట్రో ట్రయిన్ ను హైజాక్ చేసినట్టు కనిపిస్తోంది. అతడు తన కోసం కొంతమందిని తయారు చేసుకుంటాడు. వాళ్లు కూడా అదే ట్రయిన్ లో, ప్రయాణికులతో కలిసిపోయి ఉంటారు. ఓ మిషన్ కోసం వీళ్లంతా కలిసి పనిచేస్తున్నారనే విషయం ట్రయిలర్ చూస్తే అర్థమౌతోంది.
అయితే దర్శకుడు అట్లీని అంత తక్కువగా అంచనా వేయడానికి వీల్లేదు. అతడి పాత చిత్రాలు ఈ విషయాన్ని తెలియజేస్తాయి. షారూక్ కు బలమైన ఫ్లాష్ బ్యాక్ ఉందనే విషయాన్ని కూడా ట్రయిలర్ లో చూచాయగా చూపించారు. మనీ హెయిస్ట్ ఛాయలు ఈ సినిమాలో ఉన్నాయా లేదా అనే విషయం మరో వారం రోజుల్లో తేలిపోతుంది.