Advertisement

Advertisement


Home > Movies - Movie News

జోజూ జార్జ్.. జూనియ‌ర్ ఆర్టిస్టు నుంచి స్టార్ డ‌మ్ వ‌ర‌కూ!

జోజూ జార్జ్.. జూనియ‌ర్ ఆర్టిస్టు నుంచి స్టార్ డ‌మ్ వ‌ర‌కూ!

దాదాపు రెండు ద‌శాబ్దాల కింద‌ట తెలుగులో 'స్నేహ‌మంటే ఇదేరా' అని ఒక సినిమా వ‌చ్చింది. త‌మిళంలో హిట్ అయిన ఒక సినిమాకు రీమేక్ ఇది. ఆ త‌మిళ సినిమా ఒక మ‌ల‌యాళీ సినిమా కు రీమేక్. ప్ర‌ముఖ మ‌ల‌యాళీ ద‌ర్శ‌కుడు సిద్ధిక్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన 'ఫ్రెండ్స్' అనే సినిమా అది. అందులో జ‌య‌రాం  పాత్ర‌ను అరెస్టు చేయ‌డానికి అంటూ ఒక పోలీస్ బ్యాచ్ దిగుతుంది. ఐదారు మంది పోలీసు పాత్ర‌ధారులు జీప్ నుంచి దిగుతారు. ఆ గుంపులో వెనుక వైపు, కెమెరాకు క‌నిపించీ క‌నిపించ‌ని రీతిలో ఒక పోలిస్ కానిస్టేబుల్ పాత్ర‌ధారి ఉంటాడు. ఐదారు సెక‌న్ల పాటు తెర‌పై ఒక్క డైలాగ్ కూడా లేకుండా గుంపులో గోవింద‌య్య‌లా క‌నిపించే ఆ పాత్ర‌ధారి ఆ రోజు ఎవ్వ‌రి దృష్టినీ ఆక‌ర్షించే అవ‌కాశం లేదు! 

సాధార‌ణంగా స‌క్సెస్ ఫుల్ సినిమా తార‌ల గురించి చెబితే.. తొలి సినిమాతోనే అత‌డు అలా, ఇలా అంటూ మొద‌లుపెట్ట‌వ‌చ్చు. లేదా వార‌స‌త్వాలు అవి వేరే క‌థ‌. అయితే.. గుంపులో గోవింద‌య్య పాత్ర‌లు చేస్తూ, జూనియ‌ర్ ఆర్టిస్టు నుంచి త‌న‌కంటూ ఒక ప్ర‌త్యేక‌త‌ను నిరూపించుకునే స్థాయికి ఎద‌గ‌డం అంటే.. అది మాట‌లు కాదు! ఒక్క మాట‌లో చెప్పాలంటే అనిత‌ర సాధ్యం. అలాంటి అనిత‌ర సాధ్యుడే జోజూ జార్జ్. ఓటీటీ యుగంలో కేర‌ళ ఆవ‌ల మంచి గుర్తింపును సంపాదించుకున్న న‌టుడు జోజూ. 

'జోసెఫ్' సినిమాతో జోజూ మొద‌ట తెలుగు ప్రేక్ష‌కుల దృష్టిని బాగా ఆక‌ర్షించాడు. ఇటీవ‌లి 'ఇర‌ట్టా' సినిమాతో ఈ న‌టుడి ప‌ట్ల ఆస‌క్తి అమితాస‌క్తిగా మారింది. ఈ రెండింటి సినిమాల‌కూ ముందు 'నాయ‌ట్' సినిమా ఇత‌డి ప్ర‌త్యేక‌త‌ను ప‌రిచ‌యం చేసింది. 

జూనియ‌ర్ ఆర్టిస్టు స్థాయి నుంచి జోజూ ఒక్కో మెట్టే ఎక్కుకుంటూ వ‌చ్చాడు. కేర‌ళ ఆవ‌ల ఆడిన కొన్ని సినిమాల్లో ఇత‌డు స‌హాయ పాత్ర‌లు, క్యారెక్ట‌ర్ ఆర్టిస్టు పాత్ర‌ల‌నూ చేశాడు. అప్పుడెప్పుడో క‌ల్లోల ఇరాక్ నుంచి భార‌తీయ న‌ర్సుల‌ను ఎయిర్ లిఫ్టింగ్ గురించి వ‌చ్చిన టేకాఫ్ సినిమాలో జోజూ ఒక సీన్లో క‌నిపిస్తాడు. అలాగే గాడ్ ఫాద‌ర్ త‌ర‌హా లో ఫ‌హ‌వాద్ ఫాజిల్ చేసిన మాలిక్ లో జోజూ మ‌రో కీల‌క పాత్ర‌లో క‌నిపిస్తాడు.

జోజూ చిన్న సైజు నిర్మాత కూడా. జోసెఫ్, ఇర‌ట్టా సినిమాలు జోజూ సొంత బ్యాన‌ర్ లో రూపొందిన సినిమాలే! ప‌రిమిత బ‌డ్జెట్ లో ఇలాంటి స్ట‌న్నింగ్ స్టోరీల‌ను ఎంపిక చేసుకుని త‌న‌లోని న‌టుడిని బీభ‌త్స స్థాయిలో ప‌రిచ‌యం చేస్తూ ఈ న‌టుడు వాటిని నిర్మిస్తున్నాడు. ఇప్ప‌టికే త‌మిళ, తెలుగు మూవీ మేక‌ర్ల క‌న్ను జోజూ మీద ప‌డింది. మాస్ మ‌సాలాల్లో ఇత‌డిని విల‌న్ పాత్ర‌ల్లో చూపించ‌డానికి రెడీ అయిపోయారు. వీటితో జోజూ మ‌ల‌యాళీ సినిమాల‌తో పోలిస్తే భారీ స్థాయిలో డ‌బ్బు సంపాదించుకోవ‌చ్చు. అయితే ఈ సినిమాలు జోజూకు త‌న‌వైన సినిమాల రూప‌క‌ల్ప‌న‌కు అడ్డుగా మార‌క‌పోతే మంచిది!

జూనియ‌ర్ ఆర్టిస్టుగా చాలా సంవ‌త్స‌రాల పాటు పోరాడాడు జోజు. ఆ త‌ర్వాత చిన్న చిన్న అవ‌కాశాలు, ఆ త‌ర్వాత గుర్తింపును తెచ్చిపెట్టే వేషాలు! ఇప్పుడు సోలోగా సినిమాల‌ను లీడ్ చేస్తున్నాడు. సంచ‌ల‌నం అనిపించే సినిమాల‌ను తెర‌పై ఆవిష్క‌రిస్తున్నాడు. ఒక న‌టుడికి ఇంత‌కు మించిన స‌క్సెస్ స్టోరీ ఉండ‌దేమో!

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?