దక్షిణాది రాజకీయాల్లో పవన్ కల్యాణ్, కమల్ హాసన్ మధ్య పోలిక చూపెడుతూ చాలానే విశ్లేషణలు, కథనాలు వచ్చాయి. మరీ ముఖ్యంగా తమిళనాడు ఎన్నికల్లో కమల్ హాసన్ ఓడిపోయిన తర్వాత.. ఈ టైపు కథనాలు మరింత ఎక్కువయ్యాయి.
మొన్న జరిగిన ఎన్నికల్లో స్వయంగా కమల్ హాసన్ ఓడిపోవడం, ఏపీలో జరిగిన ఎన్నికల్లో పవన్ కల్యాణ్ ఓడిపోవడంతో ఈ పోలిక అనివార్యమైంది. అయితే గమ్మత్తుగా ఇప్పుడు సినిమాల విషయంలో కూడా వీళ్లిద్దరి మధ్య సారూప్యత కనిపిస్తోంది.
ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో చిత్తుగా ఓడిపోయిన తర్వాత ఏమాత్రం ఆలస్యం చేయకుండా సినిమాల్లోకి దూకేశారు పవన్ కల్యాణ్. ఒకటి కాదు, రెండు కాదు.. వరుసపెట్టి సినిమాలు చేసుకుంటూ పోతున్నారు. ఆల్రెడీ ఓ సినిమా థియేటర్లలోకి వచ్చేసింది కూడా. ఇప్పుడు కమల్ హాసన్ కూడా పవన్ కల్యాణ్ ను ఫాలో అయిపోవాలని నిర్ణయించుకున్నారు.
ఇలా ఎన్నికల ప్రక్రియ పూర్తయిందో లేదో అలా తన సినిమాలపై దృష్టిపెట్టారు కమల్. ఆగిపోయిన ఇండియన్-2 సినిమాను మళ్లీ పట్టాలపైకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించి నిర్మాత-దర్శకుడు మధ్య జరుగుతున్న గొడవల్ని పరిష్కరించే దిశగా కమల్ అడుగులు వేస్తున్నారు.
ఇండియన్-2 సినిమాను పక్కనపెట్టిన దర్శకుడు శంకర్.. ఆ వెంటనే రామ్ చరణ్, రణ్వీర్ సింగ్ తో తలో ఒక సినిమాను ప్రకటించుకున్నాడు. దీంతో లైకా ప్రొడక్షన్స్, శంకర్ మధ్య గొడవలు మొదలయ్యాయి. కోర్టు కేసుల వైపు దారితీస్తున్న ఈ వ్యవహారాన్ని, తన సమక్షంలో పరిష్కరించే దిశగా కమల్ చర్యలు చేపట్టారు.
ఇండియన్-2తో పాటు తన దర్శకత్వంలో తెరకెక్కుతూ, చాన్నాళ్లుగా ఆగిపోయిన శభాష్ నాయుడు సినిమాను కూడా కంప్లీట్ చేయాలని కమల్ నిర్ణయించారు. ఈ సినిమాను తనే రాసి, సహ-నిర్మాతగా వ్యవహరిస్తూ, దర్శకత్వం వహిస్తున్నారు.
కమల్ కూతురు శృతిహాసన్ కూడా ఇందులో నటించింది. ఈ రెండు సినిమాల్ని పూర్తిచేయడంతో పాటు మరో 2 సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చే ఆలోచనలో ఉన్నారు కమల్ హాసన్. ఈ మేరకు తన టీమ్ లో పనిచేసిన ఇద్దరు వ్యక్తులకు దర్శకులుగా ప్రమోషన్ ఇవ్వబోతున్నారు.