తమ వదరబోతు తనానికి యావత్ ఇండియా మొత్తం స్పందించాలన్నట్టుగా మాట్లాడుతోంది నటి కంగనా రనౌత్. తన సోదరి నోటి దురుసుతో ట్విటర్ ఖాతాను పోగొట్టుకుంది. చంపాలి, కాల్చాలి.. అంటూ ఆమె తన రొటీన్ ఓవరాక్షన్ చేయగా, ఇప్పుడు ఆమెను సమర్థిస్తూ కంగనా రంగంలోకి దిగింది. ఈమె అయితే మరో అడుగు ముందుకేసింది, అదేమిటంటే.. ఇండియాలో ట్విటర్ ను నిషేధించాలట! ఆ సంస్థను డెమొలిష్ చేయమంటూ కంగనా ఇండియన్ గవర్నమెంట్ కు ఆదేశాలు ఇచ్చేసినంత పని చేసింది!
తన సోదరి అకౌంట్ ను డిలీట్ చేసిన ట్విటర్ కు ఇండియాలో ఉండే హక్కు ఏ మాత్రం లేదన్నట్టుగా కంగనా రనౌత్ తేల్చేసింది! వదరబోతు అయిన ఆ రంగోలీకి తగిన శాస్తి జరిగిందని, వాక్ స్వాతంత్రం పేరిట అందరి విషయంలోనూ ఇష్టానుసారం మాట్లాడుతూ.. అందరినీ తక్కువ చేసి, తాము గొప్ప అయినట్టుగా బిల్డప్పులు ఇచ్చే రంగోలీ ట్విటర్ ఖాతాను ఇప్పటికైనా డిలీట్ చేసి ఆ సంస్థ మంచి పని చేసిందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి అన్ని వైపుల నుంచి!
ఇక తన సోదరిని వెనకేసుకు వస్తూ.. ట్విటర్ భారతీయ సంస్థ కాదంటూ, దాన్ని ఇండియాలో ఉండనీయడానికి లేదంటూ కంగనా చెప్పుకొచ్చింది! దాన్ని నిషేధించేయాలని ఉచిత సలహా పడేసింది. అయినా ఇన్నాళ్లూ ఇష్టానుసారం మాట్లాడటానికి ఈమె, ఈమె సోదరి ట్విటర్ ను వాడుకున్నారు. ఇప్పుడు వీళ్లకు నొప్పి పుట్టింది కాబట్టి.. ఇండియాలో ట్విటర్ ను నిషేధించాలి! అవకాశవాదానికి కూడా ఒక హద్దంటూ ఉండాలి.
సినిమా కెరీర్ తొలి నాళ్లలో అందరూ మంచి వాళ్లే అన్నట్టుగా వ్యవహరించి, ఒక స్థాయికి ఎదిగాకా తనను వాళ్లంతా వేధించారంటూ కంగనా చెప్పుకొచ్చింది. ఆ వేధింపుల గురించి మొదట్లోనే చెప్పి ఉంటే అది వేరే కథ. అప్పుడేమో ఎదగడం కోసం కామ్ గా ఉండి, ఎదిగాకా కంగనా మరో రకంగా వ్యవహరించింది. ఇక బాలీవుడ్ వారసత్వం గురించి కూడా రంగోలీ తీవ్రంగా స్పందిస్తూ వచ్చింది. ఒకవేళ కంగనా రౌత్ కు సోదరి కాకపోయి ఉంటే తన పరిస్థితి ఏమిటో ఆ రంగోళీ ఆలోచించుకోలేదేమో ఎప్పుడూ! వీళ్లకు అన్ని విషయాల్లోనూ అవసరార్థం ఒక మాట, అవసరం తీరాకా మరో మాట మాట్లాడటం అలవాటైనట్టుగా ఉంది. అందుకు అనుగుణంగానే ఉంది ట్విటర్ ను నిషేధించాలనే వాదన!