లెక్కే చేయ‌ని కంగ‌నా!

నోటి తీట అనేది కంగ‌నా విష‌యంలో చాలా చిన్న మాట‌. గ‌త కొన్నాళ్లుగా బీజేపీ భ‌క్తురాలిగా అవ‌తారం ఎత్తిన కంగ‌నా.. నోటికి అడ్డూఅదుపు లేకుండా మాట్లాడుతూ ఉంటుంది. బాలీవుడ్ లో రెబ‌ల్ అనిపించుకున్నా.. క్ర‌మంగా…

నోటి తీట అనేది కంగ‌నా విష‌యంలో చాలా చిన్న మాట‌. గ‌త కొన్నాళ్లుగా బీజేపీ భ‌క్తురాలిగా అవ‌తారం ఎత్తిన కంగ‌నా.. నోటికి అడ్డూఅదుపు లేకుండా మాట్లాడుతూ ఉంటుంది. బాలీవుడ్ లో రెబ‌ల్ అనిపించుకున్నా.. క్ర‌మంగా కంగ‌నా తీరు విచిత్రంగా త‌యారైపోయింది. ప్ర‌త్యేకించి బీజేపీ విధానాల‌ను వ్య‌తిరేకించే వారిపై ఈమె అనుచిత ప్రేలాప‌న‌కు కూడా వెనుకాడే టైపు కాదు. ఈ క్ర‌మంలో ఈమె బాధితులు వ‌ర‌స‌గా కోర్టుల‌ను, పోలిస్ స్టేష‌న్ల‌ను ఆశ్ర‌యిస్తూ ఉన్నారు.

అయితే కంగ‌నా మాత్రం కోర్టుల‌ను కూడా లెక్క చేయ‌డం లేదు. ర‌చ‌యిత జావేద్ అక్త‌ర్ వేసిన ప‌రువు న‌ష్టం దావా కేసులో ఇప్ప‌టి వ‌ర‌కూ 11 సార్లు కోర్టు పిలిచినా కంగ‌నా హాజ‌రు కాలేదంటే క‌థేంటో అర్థం చేసుకోవ‌చ్చు. త‌న‌కు ఆ కేసును విచారిస్తున్న కోర్టుపై న‌మ్మ‌కం లేద‌ని, జావేద్ పిటిష‌న్ ను మ‌రో కోర్టుకు మార్చాల‌నేది కంగ‌నా డిమాండ్. అయితే ఇప్ప‌టికే ఒక‌సారి కోర్టు అందుకు నిరాక‌రించింది. అయితే కంగ‌నా మాత్రం కోర్టుకు హాజ‌రు కావ‌డం లేదు. 

ఆమెపై కేసు వేసి కోర్టు చుట్టూ తిరుగుతున్నాడు జావేద్ అక్త‌ర్. ఆయ‌న అటెండ్ అయినా, ఈమె మాత్రం అటెండ్ కావ‌డం లేదు. ఈ నేప‌థ్యంలో ఆమెపై నాన్ బెయిల‌బుల్ వారెంట్ జారీ చేయాల‌ని జావేద్ త‌ర‌ఫు లాయ‌ర్ కోర్టును కోరాడు. ఈ మేర‌కు మ‌రో పిటిష‌న్ దాఖ‌లు చేశాడు. మ‌రి ఇప్పుడైనా కంగ‌నా క‌దులుతుందేమో చూడాల్సి ఉంది.

ఆ సంగ‌త‌లా ఉంటే.. ఇక వ్య‌వ‌సాయ చ‌ట్టాల‌కు వ్య‌తిరేకంగా నిర‌స‌న తెలిపిన రైతుల‌ను ఉద్దేశించి, ఖ‌లిస్తాన్ ఉగ్ర‌వాదులు అని వ్యాఖ్యానించిన వైనంపై కూడా కంగ‌నా పై ముంబైలో మ‌రో కేసు న‌మోదు అయ్యింది. సిక్కుల‌ను ఉద్దేశించి ఖ‌లిస్తాన్ ఉగ్ర‌వాదులు అని ఈమె వ్యాఖ్యానించి మ‌రో వివాదంలోకి త‌న‌దైన స్టైల్ లో దూకింది. దీనిపై ముంబై లో కొంద‌రు ఫిర్యాదు చేశారు. ఈ కేసులో ఆమె విచార‌ణ‌కు అటెండ్ కావాల్సి ఉంద‌ని తెలుస్తోంది. అయితే కేసుల‌ను, స‌మ‌న్ల‌ను పెద్ద‌గా ప‌ట్టించుకోకుండా.. త‌న‌దైన రీతిలోనే వ్య‌వ‌హ‌రిస్తోంది కంగ‌నా.