మతపరమైన విద్వేషాలను రేకెత్తించేలా స్పందించడం గురించి తనపై, తన సోదరిపై నమోదైన కేసులను కొట్టి వేయాలంటూ ముంబై హై కోర్టును ఆశ్రయించింది నటి కంగనా రనౌత్. కంగనా, ఆమె సోదరి రంగోలీ లపై ఈ వ్యవహారంలో మహారాష్ట్రలో కేసులు నమోదైన సంగతి తెలిసిందే.
ఆ కేసుల్లో విచారణకు రావాలంటూ ముంబై పోలీసులు ఇప్పటికే మూడు సార్లు వారికి నోటీసులు ఇచ్చారు. ఈ నోటీసులు జారీ అయిన దగ్గర నుంచి ముంబై వైపు వెళ్లకుండా ఉంది కంగనా రనౌత్. హిమాచల్ ప్రదేశ్ లోనే గడుపుతోంది. ఈ మధ్యనే తన సోదరుడి వివాహం చేసినట్టుగా ఉందామె. ఎంతైనా బాలీవుడ్ తార కావడంతో ముంబైకి దూరంగా ఉండటం సాధ్యం కానట్టుంది.
అయితే అక్కడకు వెళితే విచారణ పేరుతో ముంబై పోలీసులు ఎక్కడ అరెస్టు చేస్తారో అనే ఆందోళన కూడా కంగనకు ఉన్నట్టుంది. ఈ నేపథ్యంలో తనపై ముంబై పోలీసులు నమోదు చేసిన ఎఫ్ఐఆర్ లను కొట్టి వేయాలంటూ కంగనా కోర్టును ఆశ్రయించింది.
మత విద్వేషాలను రేపేలా సోషల్ మీడియాలో స్పందించిన వ్యవహారానికి సంబంధించి తనపై నమోదైన అభియోగాలను కొట్టి వేయాలని ఈమె కోరుతోంది. మరి కోర్టు స్పందన ఎలా ఉంటుందనేది ఆసక్తి దాయకంగా మారింది.
ఇటీవలే అర్నబ్ గోస్వామికి ఊరట దక్కడం విశేష పరిణామంగా చర్చనీయాంశం అయ్యింది. ఇప్పుడు కంగనాకు న్యాయస్థానంలో ఎలాంటి అనుభవం ఎదురవుతుందనేది కూడా ఆసక్తిదాయకమైన అంశం అవుతోంది. ఒకవేళ కంగనా పై కేసులను కోర్టు కొట్టి వేస్తే తప్ప ఆమె ధైర్యంగా ముంబైలో అడుగు పెట్టే పరిస్థితి ఉన్నట్టుగా లేదు!