'బాలీవుడ్ తనను భరించలేదు..' అన్నట్టుగా వ్యాఖ్యానించిన టాలీవుడ్ స్టార్ హీరో మహేశ్ బాబుకు బాలీవుడ్ నుంచి తగిన మద్దతు లభిస్తూ ఉంది. మహేశ్ వ్యాఖ్యలను వివాదాస్పదం చేయనక్కర్లేదంటూ బాలీవుడ్ ప్రముఖులు స్పందిస్తూ ఉన్నారు.
మహేశ్ బాబు వ్యాఖ్యలు ఆయన వ్యక్తిగతం అని, అందులో ఈకలు పీకడానికి ఏమీ లేదని బాలీవుడ్ జనాలు దీన్నో వివాదం చేయనక్కర్లేదని అంటున్నారు.
ఈ క్రమంలో మహేశ్ కు మరో బాలీవుడ్ స్టార్ నుంచి కూడా మద్దతు లభించింది. మహేశ్ వ్యాఖ్యలు ఏ సెన్స్ లోనో తనకు తెలియదని, అయితే ఆయన మాటల్లో తప్పేముంది? అంటోంది కంగనా రనౌత్. ఈ మేరకు ఆమె స్పందించింది.
మహేశ్ నిస్సందేహంగా మంచి నటుడని, ఆయన జనరేషన్ టాలీవుడ్ హీరోలు తెలుగు చిత్ర పరిశ్రమను నంబర్ పొజిషన్లోకి తీసుకొచ్చారని కంగనా చెప్పుకొచ్చింది. టాలీవుడ్ లోనే మహేశ్ కంఫర్ట్ గా ఫీలవ్వొచ్చని, ఆయనకు బాలీవుడ్ ఆఫర్లు వెళ్లినట్టుగా కూడా తనకు తెలిసని కంగనా చెప్పింది.
తెలుగు చిత్ర పరిశ్రమలోనే మహేశ్ కు కంఫర్ట్ అనిపించి, బాలీవుడ్ వైపు రాకపోయి ఉండవచ్చని, ఈ విషయంలో 'బాలీవుడ్ తనను భరించలేదు..' అని మహేశ్ అనుకోవడంలో విడ్డూరం ఏమీ లేదని కంగనా వ్యాఖ్యానించింది.
బాలీవుడ్ జనాలే కొందరు హాలీవుడ్ తమను భరించలేదు.. అనే తత్వంతో ఉంటారని కంగనా చమత్కరించింది. భాషాపరమైన విబేధాలు సరికాదని కంగనా ఐక్యతారాగాన్ని ఆలపించింది. మహేశ్ బాబును ప్రశంసిస్తూ, ఆయన వ్యాఖ్యలు ఆయన వ్యక్తిగతం అని, వాటిని వివాదం చేయొద్దని కంగనా సర్దిచెప్పింది.