సంచలన ట్వీట్స్, కామెంట్స్‌తో నిత్యం వార్తల్లో నిలిచే వ్యక్తిగా బాలీవుడ్ వివాదాస్పద నటి కంగనా రనౌత్ రికార్డుకెక్కారు. ముంబైని పాక్ ఆక్రమిత కశ్మీర్‌గా విమర్శించడం ఆమెకే చెల్లింది. ఈ వివాదాస్పద వ్యాఖ్యపై మహారాష్ట్ర ప్రభుత్వం సీరియస్ అయింది. ఆమె కార్యాలయాన్ని పగలగొట్టే వరకు వెళ్లింది.
బీజేపీకి రాజకీయంగా ప్రయోజనం కలిగించేందుకే కంగనా రనౌత్ ఓ పథకం ప్రకారం వివాదాస్పదమవుతున్నారనే విమర్శ లేకపోలేదు. బాలీవుడ్‌లో నెపోటిజంపై మొదలైన ఆమె విమర్శలు, ఆ తర్వాత అనేక మలుపులు తిరిగాయి.
బాలీవుడ్‌పై మొదలైన విమర్శల దాడి, ఆ తర్వాత కాలంలో రాజకీయంగా టర్న్ తీసుకున్నాయి. కంగనా రనౌత్‌కు బీజేపీ నుంచి పరోక్షంగా బలమైన మద్దతు లభిస్తోందనేది బహిరంగ రహస్యమే.
ఈ నేపథ్యంలో విలక్షణ హీరో, తమిళ రాజకీయ నేత కమల్‌హాసన్‌పై కంగనా రనౌత్ విమర్శలు గుప్పించారు. తమిళనాడు అసెంబ్లీకి త్వరలో జరగనున్న ఎన్నికల్లో కమల్‌హాసన్ పార్టీ మక్కల్ నీది మయ్యన్ పోటీ చేయనున్న విషయం తెలిసిందే.
తాము అధికారంలోకి వస్తే ఇంటి పనిని కూడా వేతన వృత్తిగా గుర్తిస్తామని ఇటీవల కమల్‌హాసన్ తన ఎన్నికల ప్రధాన అంశంగా ప్రకటించారు.
ఈ ప్రకటనను దృష్టిలో పెట్టుకుని కంగనా ట్విటర్ వేదికగా తాజాగా ఘాటుగా స్పందించారు.
‘ప్రతి విషయాన్ని వ్యాపారంగా చూడకండి. మాతృత్వం కోసం అమితంగా ప్రేమించే వారితో శృంగరానికి వెల కట్టడం కరెక్ట్ కాదు. ఓ భార్యగా, తల్లిగా ఇంట్లో పనిచేయడం మహిళల హక్కు. దానికి మీరు వెల కట్టకండి. ఇంటి యజమానురాలైన మహిళను తన సొంతింటిలోనే ఉద్యోగిగా మార్చకండి. మాకు కావాల్సింది వేతనం కాదు.. సమాజంలో గౌరవం, ప్రేమ. భగవంతుడి సృష్టికి డబ్బులు చెల్లించాలనుకుంటున్న మీ ఆలోచనను మార్చుకోండి’ అంటూ కంగనా మండిపడ్డారు.
ఇదిలా ఉండగా ఒక కేసు విషయమై సుప్రీంకోర్టు సీనియర్ న్యాయమూర్తి ఎన్వీ రమణ కీలక వ్యాఖ్యలు చేశారు.
‘ఉద్యోగం చేసే వ్యక్తుల భవిష్యత్ ఆదాయాలను గణించటానికి వారి జీతభత్యాలను ఆధారం చేసుకోవడానికి వీలుంటుంది. అయితే, జీవితాంతం కుటుంబ సభ్యుల కోసమే శ్రమించే గృహిణుల సేవలను ఖరీదు కట్టడం అసాధ్యమనే విషయమని, అందువల్ల వాటిని విలువలేనివిగా భావించటం తగదు. ఇందుకు ప్రత్యేక విధానాలను అనుసరించాలి. మహిళల శ్రమకు సముచిత గౌరవాన్ని, విలువను ఇవ్వాల్సి ఉంటుంది’ అని జస్టిస్ ఎన్వీ రమణ స్పష్టం చేయడం గమనార్హం.
కమల్‌హాసన్‌ను విమర్శించినట్టే జస్టిస్ ఎన్వీ రమణపై కంగనా రనౌత్ ఘాటు వ్యాఖ్యలు చేయగలరా? కంగనా ఏం మాట్లాడినా బీజేపీ కోసమే అనే విమర్శలకు మరోసారి ఆమె ట్వీట్ బలం చేకూర్చిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.