కావాలని ఏ సినిమాకు అన్యాయం చేయను

తాను కావాలని ఏ సినిమాకూ అన్యాయం చేయనని, లాస్ట్ మినిట్ వరకు ఇంకా ఇంకా ఏం చేయాలని ప్రయత్నం చేస్తూనే వుంటానని సంగీత దర్శకుడు థమన్ అన్నారు.  Advertisement కథను బట్టి, జానర్ ను…

తాను కావాలని ఏ సినిమాకూ అన్యాయం చేయనని, లాస్ట్ మినిట్ వరకు ఇంకా ఇంకా ఏం చేయాలని ప్రయత్నం చేస్తూనే వుంటానని సంగీత దర్శకుడు థమన్ అన్నారు. 

కథను బట్టి, జానర్ ను బట్టి, సన్నివేశాన్ని అనుసరించి, ఇలా అనేక ఫ్యాక్టర్ల ఆధారంగా ఓ పాట తయారవుతుందని ఆయన ‘గ్రేట్ ఆంధ్ర’కు ఇచ్చిన ఇంటర్వూలో వివరించారు. దర్శకుడు ఇచ్చిన ఇన్ పుట్, తన సృజన, పాటల రచయిత అందించిన సాహిత్యం, హీరో ఇమేజ్ ఇలా చాలా విషయాలు పాట పుట్టుకలో భాగస్వామ్యం తీసుకుంటాయన్నారు. ఒక్కో సినిమా సైజ్ ను బట్టి ఒక్కో విధమైన సంగీతం వస్తుందన్నారు.

వకీల్ సాబ్ కు అస్సలు అవకాశం లేదని, మగువా.. మగువా.. పాటను బేస్ చేసుకునే సినిమాలో కొంత ప్రయోగం చేసి సక్సెస్ అయ్యామన్నారు. భీమ్లా నాయక్ రేంజ్ వేరు అని, అలాగే ఇప్పుడు చేస్తున్న బ్రో రేంజ్ వేరు అని వివరించారు. అలవైకుంఠపురములో సినిమా ముందు.. తరువాత అనే విధంగా టాలీవుడ్ మ్యూజిక్ మారిపోయిందని థమన్ చెప్పారు. ప్రతి ఒక్కటీ అంతకు మించి అనే డిమాండ్ పెరిగిందని చెప్పారు. దాన్ని అందుకోవడానికే తాము ప్రయత్నిస్తుంటామన్నారు.

ఇన్ని సంవత్సరాలుగా నిలబడ్డా అన్నా, ఇన్ని సినిమాలు చేస్తున్నా అన్నా, దానికి ఒకటే కారణమని, తన హార్డ్ వర్క్ తప్ప మరేం కాదని, విమర్శలు లైట్ తీసుకుంటూ, తను సిన్సియర్ గా మని చేసుకుంటూ వెళ్తున్నా అని థమన్ చెప్పారు. మహేష్ సినిమాకు ఓసారి చంపకమాలా.. అనే క్లాస్ సాంగ్ చేసా అని, కానీ అక్కడ మాస్ సాంగ్ కావాల్సి వచ్చిందని, దాంతో మరో సినిమాలో వాడానని వివరించారు.

శంకర్-రామ్ చరణ్ సినిమా మ్యూజిక్ పరంగా ట్రిపుల్ ఎక్స్ ఎల్ సైజ్ లో వుంటుందని, పవన్ కళ్యాణ్ ఓజి సినిమా నెక్స్ట్ లెవెల్ లో వుంటుంది ఆ సినిమా ఎంత ఇచ్చినా ఇంకా కావాలనే రేంజ్ లో వుంటుంది థమన్ అన్నారు. మహేష్ బాబు గుంటూరు కారం పనులు జరుగుతున్నాయన్నారు. 

ఫ్యాన్స్ ను అలరించడానికే, వారికి నచ్చేలా చేయడానికే ప్రయత్నం చేస్తున్నామని, కానీ ఒక్కోసారి రిజల్ట్ తేడా వస్తుందని, అన్నీ మన చేతుల్లో వుండవని అన్నారు థమన్.