కెజిఎఫ్2..మాటల తూటాలు

మన సినిమా రైటర్లలో కొంత మంది పావలా కల్లు తాగి ఊరంతా ఊసే రకాలు. ఒకటో రెండో డైలాగులు రాసి తమను మించిన వారు లేనట్లు బిల్డప్ ఇచ్చేస్తారు. ఆ బిల్డప్ తో కోట్ల…

మన సినిమా రైటర్లలో కొంత మంది పావలా కల్లు తాగి ఊరంతా ఊసే రకాలు. ఒకటో రెండో డైలాగులు రాసి తమను మించిన వారు లేనట్లు బిల్డప్ ఇచ్చేస్తారు. ఆ బిల్డప్ తో కోట్ల రెమ్యూనిరేషన్ కొల్లగొడతారు. కానీ తీరా చూస్తే సినిమాలో పట్టుపని ఒక్క డైలాగు కూడా ఇంప్రెసివ్ గా వుండదు. 

తెలుగులో వందల కోట్ల భారీ సినిమాల్లో ఎలివేషన్లు, విజువల్ వండర్లే తప్ప గుర్తు పెట్టుకునే డైలాగు ఒక్కటి వుండదు. తెలుగు సినిమా బ్లాక్ బస్ట‌ర్లు, చరిత్రను తిరగరాసిన చాలా సినిమాల తంతు ఇదే. కానీ ఈ రోజు విడుదలయన భారీ సినిమా కెజిఎఫ్ తీరు వేరు.

నిజానికి ఇలాంటి మాస్ ఎలివేషన్, యాక్షన్ సినిమాల్లో డెప్త్ డైలాగులకు చోటు వుండదు. కానీ కెజిఎఫ్ 2లో ఏరు కోవాలే కానీ ఎన్ని మాంచి డైలాగులో. ఆరంభం నుంచి చివరి వరకు. 

'..రక్తం తో రాసిన కథ ఇది. సిరాతో ముందుకు తీసుకెళ్లలేం.. ముందుకెళ్లాలంటే మళ్లీ రక్తాన్నే కోరుతుంది….'

' నా కొడుకు శవాన్ని ఎవరూ మోయనక్కరలేదు…వాడి కాళ్లే వాడి శవాన్ని సమాధి వరకు తీసుకెళ్తాయి…''

''..ఇక్కడ తలలు శాశ్వతం కాదు. కిరీటాలు మాత్రమే శాశ్వతం…'

'…నెపోటిజం..నెపోటిజం…నెపోటిజం…మెరిట్ ను ఎదగనివ్వరా…''

ఓ భార్య తను తల్లి కాబోతున్నాను అని చెప్పే సీన్ ను ఇప్పటి వరకు ఏ డైరక్టర్ ఇలా తీసి వుండడు. కెజిఎఫ్ 2 సినిమాకే ఆ సీన్ హైలైట్….ఆ సీన్ లో భర్తతో భార్య చెప్పే డైలాగ్….''..అమ్మ వస్తోంది…'' రెండు పదాల్లో అనంత అర్థం.

''..ఇంటిని ఆక్రమిస్తే నా సమస్య కాదు..వీధిని ఆక్రమిస్తే నా సమస్య కాదు, ఊరిని ఆక్రమిస్తే నా సమస్య కాదు అనుకోవడం వల్లే బ్రిటిష్ వాళ్లు దేశాన్ని ఆక్రమించారు…''

ఇలా ఒకటి కాదు. రెండు కాదు ప్రతి సీన్ లోనూ ఓ మాంచి డైలాగు. అలా అని పంచ్ డైలాగులు, పడికట్టు డైలాగులు కాదు. అవుట్ ఆఫ్ ది బాక్స్ అయిడియాలతో రాసిని అధ్భుతమైన భావాలు నిండిన డైలాగులు. 

కోట్లు తీసుకుని సెల్ఫ్ డబ్బా కొట్టుకునే మన సంభాషణల రైటర్లు కాస్త ఈ సంభాషణలు వినాలి.