ఏప్రిల్ 14న రిలీజ్ కాబోతోంది కేజీఎఫ్2 సినిమా. లెక్కప్రకారం ఈపాటికి ప్రచారం మొదలుపెట్టాలి. కనీసం పోస్టర్లయినా వదలాలి. కానీ అలాంటిదేం జరగలేదు. మేకర్స్ అంతా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ లో బిజీగా ఉన్నారు. దీంతో పుకార్లు మరోసారి ఊపందుకున్నాయి.
కేజీఎఫ్2, చెప్పిన తేదీకి రాదనే ప్రచారం ఊపందుకుంది. 2 రోజులుగా సోషల్ మీడియాలో నడుస్తున్న ఈ ప్రచారానికి యూనిట్ చెక్ పెట్టింది. పుకార్లు నమ్మొద్దంటూ కేజీఎఫ్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ కార్తీక్ గౌడ్ ప్రకటన చేశాడు.
సినిమాకు సంబంధించిన అప్ డేట్స్ అన్నీ అధికారిక సోషల్ మీడియా హ్యాండిల్స్ ద్వారా మాత్రమే వస్తాయని, ఫేక్ హ్యాండిల్స్ నుంచి వచ్చే అప్ డేట్స్ ను నమ్మొద్దని విజ్ఞప్తి చేస్తున్నాడు.
తాజా ప్రకటనతో కేజీఎఫ్2 సినిమా చెప్పిన టైమ్ కే వస్తుందనే విషయంపై క్లారిటీ వచ్చింది. మరోవైపు ఈ సినిమా ట్రయిలర్ పై కూడా చాలా పుకార్లు ప్రచారంలో ఉన్నాయి. మరో వారం రోజుల్లో కేజీఎఫ్2 ట్రయిలర్ వస్తుందంటూ కొంతమంది ప్రచారం చేశారు. వీటిని కూడా యూనిట్ ఖండించింది.
యష్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న కేజీఎఫ్2 సినిమా, మోస్ట్ ఎవెయిటెడ్ మూవీస్ లో ఒకటిగా గుర్తింపు తెచ్చుకుంది. దేశవ్యాప్తంగా హిట్టయిన కేజీఎఫ్ కు కొనసాగింపుగా పార్ట్-2 వస్తోంది.
పార్ట్-1లో గోల్డ్ ఫీల్డ్ లో ఉన్న మాఫియా సామ్రాజ్యాన్ని నాశనం చేస్తాడు రాకీ భాయ్. పార్ట్-2లో అతడు ఎలా కింగ్ గా మారాడనే విషయాన్ని చూపించబోతున్నారు. హీరోయిజంను పీక్ స్టేజ్ లో చూపించిన ఈ సినిమా దేశవ్యాప్తంగా అభిమానుల్ని సంపాదించుకుంది.