ప్రభుత్వ ప్రధాన సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి తనయుడు, వైసీపీ సోషల్ మీడియా ఇన్‌చార్జ్ సజ్జల భార్గవ్‌రెడ్డిని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి టార్గెట్ చేశారు. పనిలో పనిగా సజ్జలపై కూడా తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ప్రస్తుతం కోటంరెడ్డి వర్సెస్ వైసీపీ అనే రీతిలో రాజకీయ పోరు నెల్లూరు జిల్లాలో నడుస్తోంది. తన ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నారనే కోటంరెడ్డి ఆరోపణల్ని ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది. దీంతో ఆయన్ను పార్టీ నుంచి బయటికి పంపారు. కోటంరెడ్డి స్థానంలో మాజీ మంత్రి ఆదాల ప్రభాకర్‌రెడ్డిని వైసీపీ నియమించిన సంగతి తెలిసిందే.
ఈ నేపథ్యంలో ఇవాళ కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి మరోసారి మీడియా ముందుకొచ్చారు. తనపై విమర్శలు చేసిన ప్రతి ఒక్కరికీ ఆయన కౌంటర్ ఇవ్వడం గమనార్హం. ప్రధానంగా సజ్జలను ఆయన టార్గెట్ చేశారని చెప్పొచ్చు. అధికారం వుంది కదా అని తనపై మాటల దాడి చేస్తున్నారని మండిపడ్డారు. మీడియాకు నువ్వే లీకులు ఇస్తున్నావని సజ్జలపై ఫైర్ అయ్యారు. జగనన్న కష్టాల్లో వున్నప్పుడు లక్షలాది మంది వైసీపీ కార్యకర్తలు, అభిమానులు సోషల్ మీడియాలో మద్దతుగా నిలబడ్డారన్నారు. సోషల్ మీడియాలో పోస్టులు పెట్టి కేసులు కూడా పెట్టించుకున్నారని ఆయన గుర్తు చేశారు.
ఆ రోజు నీ కొడుకు భార్గవ్‌రెడ్డి ఎక్కడున్నారో తనకు తెలియదన్నారు. కానీ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇంకెవరూ లేనట్టు సోషల్ మీడియా ఇన్‌చార్జ్‌గా సజ్జల భార్గవ్‌రెడ్డిని నియమించారని తూర్పారపట్టారు. మీరు, మీ కుమారుడు మీడియాకు లీకులు ఇవ్వడం ఎందుకని ఆయన నిలదీశారు. తనను ఎప్పుడు అరెస్ట్ చేస్తావో చెప్పాలని సజ్జలను కోటంరెడ్డి డిమాండ్ చేశారు. కేసులు ఒకటి పెడ్తావా, రెండు పెడ్తావా, పదా, ఇరవా…మీరు అలసిపోవాల్సిందే తప్ప తన గొంతు ఆగే ప్రశ్నే లేదని కోటంరెడ్డి తేల్చి చెప్పారు.
తన గొంతు ఆగాలంటే ఒక్క పరిష్కారం వుందని ఆయన అన్నారు. తనను ఎన్‌కౌంటర్ చేయడం ఒక్కటే పరిష్కారమన్నారు. తాను చచ్చిపోతేనే తన మాటలు ఆగుతాయని కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి పేర్కొన్నారు.