మళ్లీ సినిమాల్లో నటించాలని పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తీసుకున్న నిర్ణయం అతని పొలిటికల్ కెరీర్ ను పూర్తిగా దెబ్బతీసేస్తున్నట్లు కనిపిస్తోంది. ఎంత గుట్టుగా దాచినా, ఎంత సీక్రెట్ గా షూటింగ్ లు చేస్తున్నా, జనాలకు తెలుస్తూనే వుంది. పవన్ రాజకీయాలను గట్టున పెట్టి, సినిమాల్లోకి వెళ్లిపోయారని. దిల్ రాజు నిర్మాతగా పింక్ రీమేక్ స్టార్ట్ చేసారు. అలా చేసి, అది ఫినిష్ చేసిన తరువాత మరో సినిమా స్టార్ట్ చేసి వుంటే వేరుగా వుండేది.
అలా కాకుండా, క్రిష్ డైరక్షన్ లో మరో సినిమా మొదలెట్టేసారు. చాలా సీక్రెట్ గా, ఫొటోలు కూడా తీయకుండా, హడావుడి చేయకుండా చేసినా, దాని ప్రభావం కొట్టనే కొట్టింది. జనసేనలో వున్న కీలక నేత వివి లక్ష్మీనారాయణ, అలియాస్ జేడి లక్ష్మీనారాయణ పార్టీని వదిలి వెళ్లిపోయారు. కేవలం వెళ్లిపోవడమే కాకుండా, పవన్ సినిమాల్లోకి వెళ్లాలన్న నిర్ణయాన్ని నిరసిస్తూ వెళ్లిపోయారు.
గతంలో అనేకసార్లు సినిమాల్లో నటించను అని చెప్పిన పవన్ ఇఫ్పుడు ఇలా మళ్లీ మడమ తిప్పడం సరికాదని లక్ష్మీనారాయణ తన రాజీనామా లేఖలో పేర్కొన్నారు. నిజానికి పవన్ ముందుగా పింక్ రీమేక్ మాత్రమే చేయాలనుకున్నారు. కానీ క్రిష్ వెంటపడడంతో, ఆ సినిమా కు కూడా క్లాప్ కొట్టి, ఓ నాలుగు రోజులు షూట్ చేసి వదలాలనుకున్నారు. అదే ఇప్పుడు దెబ్బతీసినట్లు కనిపిస్తోంది.
పాపం, క్రిష్ ఏ ముహుర్తాన ఈ రోజు క్లాప్ కొట్టించారో కానీ, ఆ వెంటనే జనసేన వికెట్ పడింది. ఇంక ఈ సినిమా ఇలా ముందుకు వెళ్తే, జనసేనలో ఇంకెన్ని వికెట్లు పడతాయో?