మరో రెండు మూడు నెలల్లో జరగనున్న ‘మా’ ఎన్నికలను కొందరు అగ్ర నటులు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. తమ ప్యానల్‌ను ఎలాగైనా గెలిపించుకోవాలని ఇప్పటి నుంచే వ్యూహ రచన చేస్తున్నారు.
ఇందులో భాగంగా ఎత్తుకు పైఎత్తులు వేస్తూ, తమను గెలిపిస్తే చేయబోయే మంచి పనుల గురించి చెబుతూ సభ్యుల్ని ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఈ క్రమంలో ఇంత వరకూ ‘మా’ అధ్యక్ష బరిలో నలుగురే తెరపై కనిపించారు. నిన్న ఆకస్మికంగా ఐదో అధ్యక్ష క్యారెక్టర్ తెరపైకి రావడం విశేషం.
తాను కూడా అధ్యక్ష బరిలో ఉన్నానంటూ సీనియర్ నటుడు సీవీఎల్ నరసింహారావు ప్రకటించి ఆశ్చర్యపరిచారు. తాను పోటీ చేయడానికి గల కారణాలను కూడా ఆయన వెల్లడించారు.
తన ప్యానల్ తెలంగాణ వాదంతో ముందుకొస్తుందని, సినిమా అవ కాశాల్లో తెలుగు వారికి న్యాయం జరగాలనే డిమాండ్‌తో స్వతంత్రంగా బరిలో నిలుస్తున్నట్టు నరసింహారావు ప్రకటించారు. 'మా'కు సంబంధించి ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లో రెండు విభాగాలు చేసి, రెండింటికీ ఎన్నికలు నిర్వహించాలని ఆయన డిమాండ్ చేశారు.
ఈ నేపథ్యంలో లేడీ అమితాబ్, బీజేపీ నాయకురాలు విజయశాంతి ‘మా’ ఎన్నికల్లో తన మద్దతు ఎవరికో నేడు తేల్చి చెప్పారు. తాను ‘మా’ సభ్యురాలిని కాకపోయినా ఒక కళాకారిణిగా స్పందిస్తున్నట్టు విజయశాంతి తెలిపారు.
సీవీఎల్ నరసింహారావు ఆవేదన న్యాయమైందని, ధర్మమైందని చెప్పుకొచ్చారు. చిన్న కళాకారుల సంక్షేమం దృష్టా సీవీఎల్ అభిప్రాయాలను సంపూర్ణంగా సమర్థిస్తున్నానని విజయశాంతి తెలిపారు. తన మద్దతు ఆయనకే అని స్పష్టం చేశారు.