దసరా టైమ్ కు పోటా పోటీగా విడుదలవుతున్నాయి బాలయ్య-భగవంత్ కేసరి, రవితేజ – టైగర్ నాగేశ్వరరావు, విజయ్ – లియో. మామూలుగా అయితే లియో సినిమాను పట్టించుకునే అవకాశం వుండేది కాదేమో? కానీ సితార సంస్థ ఆ సినిమా హక్కులు 18 కోట్లకు కొనుగోలు చేయడం, విజయ్-లోకేష్ కనకరాజ్ కాంబినేషన్ అనేసరికి క్రేజ్ వచ్చింది. సినిమా విడుదల తరువాత సంగతి ఎలా వున్నా, ముందు విడుదల విషయంలో ఈ డబ్బింగ్ సినిమా మిగిలిన రెండు సినిమాలకు గట్టి పోటీ ఇస్తోంది.
ఎందుకంటే లియో సినిమాను నైజాంలో దిల్ రాజు విడుదల చేస్తున్నారు. అలాగే సితార సంస్థతో కలిసి జర్నీ చేస్తున్న డిస్ట్రిబ్యూటర్లు అంతా ఆంధ్రలో విడుదల చేస్తున్నారు. వీళ్లంతా థియేటర్లు, మార్కెటింగ్ విషయంలో ఆరితేరిపోయి వున్నారు. దాని వల్ల కచ్చితంగా భగవంత్ కేసరి సినిమాకు థియేటర్ల విషయంలో కాస్త పోటీ తప్పదు. టైగర్ నాగేశ్వరరావు ఈ విషయంలో కాస్త వెనుక బడి వుండే అవకాశం వుంది.
పైగా భగవంత్ కేసరి – లియో రెండూ ఒకే రోజు విడుదలవుతున్నాయి. అందువల్ల బాలయ్య సినిమా కలెక్షన్లకు కాస్త డెంట్ పెడుతుంది. ఎందుకు పెడుతుంది అంటే బాలయ్య సినిమాతో సమానంగా మంచి మంచి థియేటర్లు ఎంచుకుని వేయడం వల్ల. వేరే ఎవరైనా కొని వుంటే ఈ పరిస్థితి వచ్చి వుండేది కాదేమో? సితార లాంటి పెద్ద సంస్థ కొనడంతో ఇప్పుడు బాలయ్య సినిమాకు గట్టి పోటీ ఎదురవుతోంది.
పెద్ద పట్టణాల్లో ఫరవాలేదు. రెండు థియేటర్లు, సింగిల్ థియేటర్ వున్న చోట్ల తెలుగు సినిమా అయిన బాలయ్య సినిమాకు ప్రయారిటీ ఇవ్వాల్సి వుంటుంది. అలాగే జరిగితే సమస్య లేదు. కానీ అలా కాకుండా లియో బయ్యర్లు తమ సినిమాకే సింగిల్ థియేటర్లు అంటే కాస్త కష్టం అవుతుంది.
ప్రస్తుతానికి అయితే పెద్ద పట్టణాల్లో అటు భగవంత్ కు ఇటు లియో కి సమానంగా థియేటర్లు పడుతున్నాయంటే కారణం, విడుదల పెద్ద సంస్థ చేతిలో వుండడం వల్లనే. లేదంటే బాలయ్య సినిమా కచ్చితంగా అప్పర్ హ్యాండ్ తీసుకునేది.