లైగర్ డబ్బులు ఎక్కడకు వెళ్లాయి

బిడ్డ చనిపోయినా పురిటి కంపు పోలేదు అన్నది సామెత. పూరి-చార్మిల లైగర్ సినిమా వ్యవహారం ఇలాగే వుంది. సినిమా హీరో విజ‌య్ దేవరకొండ కెరీర్ లో మరో భయంకరమైన డిజాస్టర్ గా మిగిలింది డియర్…

బిడ్డ చనిపోయినా పురిటి కంపు పోలేదు అన్నది సామెత. పూరి-చార్మిల లైగర్ సినిమా వ్యవహారం ఇలాగే వుంది. సినిమా హీరో విజ‌య్ దేవరకొండ కెరీర్ లో మరో భయంకరమైన డిజాస్టర్ గా మిగిలింది డియర్ కామ్రేడ్, వరల్డ్ ఫేమస్ లవర్ ల సరసన పెద్ద ఫ్లాప్ పీట వేసుకుని కూర్చుంది. కానీ ఆ సినిమా ఆర్థిక వివాదాలు మాత్రం చార్మి-పూరి ని వెన్నాడుతున్నాయి.

ఈ వ్యవహారమే చిత్రంగా వుంది.

హీరో విజ‌య్ దేవరకొండకు పూర్తిగా రెమ్యూనిరేషన్ ఇవ్వలేదు.

సినిమాను మంచి రేట్లకు మార్కెట్ చేసారు.

నాన్ థియేటర్ హక్కులు కూడా మంచి రేట్లకు అమ్మారు

సినిమా చూస్తే మరీ భయంకరంగా డబ్బులు ఖర్చు చేసేసినట్లు అయితే లేదు.

ఇప్పటి వరకు బయ్యర్లకు ఒక్క పైసా కూడా వెనక్కు ఇవ్వలేదు.

మరి పూరి-చార్మి ల దగ్గరకు చేరిన డబ్బులు అన్నీ ఎటు పోయినట్లు?

ఇవన్నీ ఇలాగే వుంటే ఇప్పుడు ఈడీ విచారణ మొదలైంది. విచారణ వెనుక వున్న అసలు విషయం తెలిస్తే ఆశ్చర్యకరమైన సంగతి ఏమిటంటే, లైగర్ నిర్మాణం కోసం విదేశాల నుంచి నిధులు వచ్చాయని. రాజ‌కీయ నాయకులు బినామీ పెట్టుబడులు పెట్టారని ఈడీ కి అందిన సమాచారం.

సాధారణంగా సినిమా పూర్తయిన తరువాత మార్కెట్ చేసి డబ్బులు వచ్చాక, ఎవరి డబ్బులు వారికి పంపేస్తారు. మరి విదేశీ నిధులు అలావెనక్కు వెళ్లాయా? లేదా? వెళ్తే మళ్లీ డమ్మీ ఖాతాల ద్వారానే పంపాలి. అలా పంపితే ఇప్పుడు ఈడీ కి దొరికే అవకాశం వుంటుంది. కానీ ఈడీ డబ్బులు వచ్చాయి అంటోంది కానీ వెళ్లాయి అనడం లేదు. అలాగే రాజ‌కీయ నాయకుల బినామీ ఖాతాలు అని కూడా అంటోంది ఈడీ. సాధారణంగా రాజ‌కీయ నాయకులు పెట్టుబడి పెట్టి, డబ్బులు ఎప్పటికప్పుడు సెటిల్ చేసుకోరు. కేవలం వడ్డీలు మాత్రమే తీసుకుంటూ వుంటారు.

ఆ లెక్కన ఆ డబ్బులు కూడా పూరి-చార్మిల వద్దనే వుండి వుండాలి. మరి ఇలా చూసుకుంటే పూరి-చార్మిల దగ్గర పెద్ద మొత్తమే వుండి వుండాలి. వుందా? మరే దారి అయినా పట్టిందా? అన్నది అనుమానం. టాలీవుడ్ జ‌నాలు ఈ విషయంలో ఆఫ్ ది రికార్డుగా మాట్లాడే మాటల్లో చార్మి మీదనే అనుమానం వ్యక్తం చేస్తున్నారు.