కెరీర్ ఆరంభదశల్లోనే సరైన సినిమా అవకాశాలు లేక నటననే వదులుకోవాలనుకున్న వాళ్లకూ ఒక జీవితాన్ని ఇస్తోంది! సినిమాల్లో ఒక వెలుగు వెలిగి అక్కడ కెరీర్ మసకబారుతున్న వాళ్లకూ మళ్లీ వెలుగును ఇస్తోంది! ఉత్సాహవంతమైన యువతకు ముందుగా అవకాశాలను ఇచ్చి వాళ్లను పెద్ద తెరకూ పరిచయం చేస్తోంది! ఇలా సినిమా అవకాశాలను పొందలేకపోతున్న వాళ్లకు, సినిమా అవకాశాలు కావాలనుకునే వాళ్లకూ.. ఒక అవకాశాల గనిగా నిలుస్తోంది బుల్లితెర! ప్రత్యేకించి గత ఐదారేళ్లలో తెలుగు బుల్లితెర విస్తృతి విపరీతంగా పెరిగింది.
ఇరవై- ఇరవై ఐదు సంవత్సరాల నుంచి ఎంతో మంది నటీనటులకు అవకాశాలను ఇచ్చి , వాళ్లకు ఉపాధిని- గుర్తింపును ఇచ్చి ఆదరిస్తూ ఉంది బుల్లితెర. దూరదర్శన్ నాటి నుంచి బిగ్ బాస్ రోజుల వరకూ బుల్లి తెర నటనను నమ్ముకున్న వాళ్లకు ఇచ్చిన అవకాశాల గురించి, వాళ్లను ప్రేక్షకులకు చేరువ చేసిన వైనం గురించి ఎంత చెప్పినా తక్కువే! 90లలో ఎంతో మంది ఔత్సాహిక నటీనటులకు, చిత్రరంగంలో వెలగాలనే ప్రయత్నాల్లో ఉన్న వారికి దూరదర్శన్ ద్వారా అవకాశాలు లభించాయి.
సీరియల్స్ కూడా తక్కువే అయిన ఆ రోజుల్లో డీడీ వాళ్లు వివిధ తెలుగు రకాల తెలుగు సాహిత్యాన్ని టీవీ ప్రేక్షకులకు అందించే ప్రయత్నాలు చేశారు. గొప్పగొప్ప రచయితలు రాసిన కథలను అరగంట వ్యవధిలో చిత్రీకరించే కథాస్రవంతులను రూపొందించారు. వాటిల్లో కనిపించిన ఎంతో మంది నటీనటులు ఆ తర్వాత సినిమాల్లో వెలిగిన వారే. నటులుగా, దర్శకులుగా, సినిమాటోగ్రఫర్లుగా ఇప్పటికీ మంచి స్థాయిలో ఉన్న ఎంతో మంది 90లలో డీడీ ప్రోగ్రామ్స్ కు పని చేసిన వాళ్లే. అలా ఎంతోమంది బుల్లితెర బేస్ మెంట్ అయ్యింది.
సీరియల్స్ లో హీరోయిన్ల హవా..!
2000 సమయానికి టీవీ విస్తృతి చాలా పెరిగింది. దూరదర్శన్ కు ప్రత్యామ్నాయంగా ప్రైవేట్ చానళ్లు వచ్చేశాయి. 24 గంటల తెలుగు ప్రోగ్రామ్స్ తో అవి ప్రేక్షకులను టీవీలకు కట్టి పడేశాయి. 2000 సమయానికి టీవీ సీరియల్స్ చూడటం అతివలకు అత్యంత ఇష్టంగా మారింది.
ఇంటిల్లిపాదీ టీవీ సీరియల్స్ చూడటం అలవాటుగా మారింది. ఆ సమయంలో అటు తమిళం నుంచి సీరియళ్ల డబ్బింగ్, మరో వైపు ఈ టీవీ నెట్ వర్క్ వాళ్ల సొంత మేకింగ్ ట్రెండింగ్ గా నిలిచాయి. జెమినీ తమిళం నుంచి సీరియళ్లను అనువదించి తెలుగులో ప్రేక్షకులను కట్టి పడేయగా, ఈటీవీ వాళ్లు సొంత సీరియల్స్ తో ఆకట్టుకున్నారు.
రాధిక సీరియల్స్ ఎంట్రీ అనేక మంది హీరోయిన్లకు కొత్త అవకాశాన్ని చూపించింది. 80లలో హీరోయిన్ గా, ఆ తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా గుర్తింపు ఉన్న రాధిక తను స్వయంగా సీరియల్ లో నటించడం ద్వారా తన తరం నటీమణులకు కొత్తదారి చూపింది. రాధిక సీరియల్స్ లో సూపర్ హిట్ కావడం, అటు నిర్మాతగా కూడా డబ్బులు సంపాదించడంతో అనేక మంది సీనియర్ నటీమణుల దృష్టి సీరియల్స్ మీద పడింది.
రాధిక మొదలుపెట్టిన ట్రెండ్ లోనే ఇప్పటికీ అనేక మంది నటీమణులు ప్రయాణాన్ని సాగిస్తున్నారు. జయసుధతో మొదలుకుని యమున వంటి వారితో పాటు.. ప్రస్తుతం కూడా అనేక మంది మాజీ హీరోయిన్లు సీరియల్స్ లో కనిపిస్తూ ఉన్నారు. ఏజైన హీరోయిన్లందరికీ సీరియల్స్ లో అక్కా, వదిన పాత్రలు రెడీ గా ఉంటున్నాయి. ఆ హీరోయిన్లనే టైటిల్ రోల్ లో పెట్టి సీరియల్స్ రూపొందిస్తూ ఉన్నారు. 20 యేళ్లుగా ఎంతో మంది హీరోయిన్లు ఈ తరహాలో ఉపాధిని పొందారు, పొందుతూ ఉన్నారు కూడా. కొందరైతే సినిమాలకు పూర్తిగా టాటా చెప్పేసి, పూర్తిగా తమ నటనా జీవితాన్ని సీరియల్స్ కే అంకితం ఇచ్చేశారు!
మాజీ హీరోలకూ ఉపాధి!
సీరియల్స్ అనేక మంది నటులకు కూడా ఉపాధిని చూపుతున్నాయి. 80లలో తమిళంలో హీరోగా నటించిన శివకుమార్ తమిళ-తెలుగు సీరియళ్ల పాలిట తొలి హీరోల్లో ఒకరు.ఈ తరం హీరోలు సూర్య-కార్తీల తండ్రి అయిన శివకుమార్ రాధిక సీరియళ్ల ద్వారానే తెలుగులో ఎక్కువ గుర్తింపు సొంతం చేసుకున్నారు. ఆ తర్వాత 80ల నాటి హీరోలు సురేష్, నరేష్ వంటి వారితో పాటు శుభలేక సుధాకర్ వంటి క్యారెక్టర్ ఆర్టిస్టులు కూడా సీరియల్స్ లో బిజీబిజీగా సాగిపోతూ ఉన్నారు.
రియలిటీ షోల తో కొత్త ఊపు!
తెలుగు తెరపై తొలి తరం రియాలిటీ షోల్లో యాంకర్లుగా వ్యవహరించిన వారితో పాటు, ప్రస్తుత బిగ్ బాస్ బౌట్ వరకూ.. ప్రతి రియాలిటీ షో కూడా అనేక మందికి గుర్తింపును ఇచ్చింది. వారికి సినిమా అవకాశాలను ఇచ్చింది. అంత్యాక్షర, డ్యాన్స్ బేబీ డ్యాన్స్ వంటి రియాలిటీ షోల్లో కనిపించిన వాళ్లు ఆ తర్వాత సినిమాలతో బిజీ అయిపోయారు. రఘు కుంచె తో మొదలుపెడితే ఇలాంటి వారి జాబితా పెద్దదే. టీవీల్లో యాంకర్లుగా చేసిన వాళ్లంతా సినిమాల్లో అవకాశాలను ఒడిసిపట్టారు. వాళ్లకు టీవీల్లో వచ్చే గుర్తింపు ద్వారా సినిమా అవకాశాలు సులభంగానే లభిస్తూ ఉన్నాయి కూడా! చిన్న సినిమాలతో పాటు పెద్ద సినిమాలకు కూడా ఇలాంటి వాళ్ల అవసరం ఏర్పడుతూ ఉంది.
ఆల్రెడీ ప్రేక్షకులకు పరిచయం ఉన్న వారు కావడంతో వీళ్లను తీసుకోవడానికి సినిమా వాళ్లు కూడా ఆసక్తి చూపుతూ ఉన్నారు. సినిమాల్లో అవకాశాలు వచ్చినంత మాత్రన వీళ్లు టీవీని వదులుకోవడం లేదు. టీవీ నిరంతర ఉపాధి మార్గం, అవకాశాలు ఎప్పుడూ ఉండే పరిశ్రమ కావడంతో.. సినిమాల్లో చేసినా వీళ్లు టీవీతో తమ బంధాన్ని కొనసాగిస్తూ ఉన్నారు.
సినిమా అవకాశాలు లేని వాళ్లకూ!
'నువ్వేకావాలి' సినిమాతో తెరకు పరిచయం అయిన సాయికిరణ్ ను ఒక ఉదాహరణగా పేర్కొనవచ్చు. కొన్ని సినిమాలు చేయడం, అవేవీ అంత హిట్ కాకపోవడంతో సాయికిరణ్ కు చిత్ర పరిశ్రమలో అవకాశాలు మృగ్యం అయిపోయాయట. దీంతో అతడు వేరే ఉద్యోగం చూసుకునే ప్రయత్నాలు కూడా చేశాడట. దీని కోసం ముంబై వరకూ వెళ్లి ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న దశలో అతడికి సీరియల్స్ అవకాశాలు వచ్చాయట.
ఆ తర్వాత మళ్లీ సినిమాల కోసం కానీ, ఉద్యోగం కోసం ప్రయత్నం చేయాల్సిన అవసరం రాలేదట ఆ నటుడికి. అలా సీరియల్స్ తనకు ఒక ఉపాధి మార్గాన్ని చూపించాయని సాయికిరణ్ ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు. ఒక్క సాయి కిరణే కాదు.. సినిమా ఇండస్ట్రీలో హీరోలుగా కెరీర్ మొదలుపెట్టి అనుకున్న విజయాలు సాధించలేని అనేక మందికి సీరియల్స్ సెకెండ్ ఛాన్స్ ను ఇచ్చాయి. అటు సినిమాలకూ, ఇటు వేరే ఉద్యోగాలకూ పనికి రాకుండా పోతున్న దశలో వాళ్ల జీవితాలనే మార్చేసింది బుల్లితెర!
స్టార్లకూ ఇప్పుడు బుల్లితెరే బిగ్!
మెగాస్టార్ చిరంజీవి, నాగార్జున, ఎన్టీఆర్.. ఇలా తెలుగులోనే పెద్ద పెద్ద స్టార్లు ఇప్పుడు టీవీల్లో కనిపిస్తూ ఉన్నారు. టీవీ ప్రోగ్రామ్స్ చేస్తూ ఉన్నారు. ఇలా బుల్లి తెర తన స్థాయిని మెగాస్టార్ వరకూ పెంచుకుంది! టీవీ ప్రోగ్రామ్ లు అంటే అవి కొందరికి సంబంధించినవే అనే నిర్వచనం ఇప్పుడు మారిపోయింది.
స్టార్ హీరోలు రియాలిటీ షోల్లో కనిపిస్తూ ఉన్నారు. సీరియళ్ల కాన్సెప్ట్ లను అంతా తిట్టుకుంటూ ఉంటారు. అయితే అవే సీరియళ్ల వాళ్లు అవార్డులు ఇచ్చుకుంటుంటే వాటికి చీఫ్ గెస్టులుగా స్టార్ హీరోలు వస్తుంటారు! అవన్నీ వంటింటి కుందేళ్ల ప్రోగ్రామ్స్ అనుకునే వాళ్లు కూడా మళ్లీ ఆ అవార్డు షోలను వీక్షించాల్సిందే! అన్నట్టుగా మారింది పరిస్థితి.
సినిమా-సీరియల్ సరిహద్దు చెరిగిపోతోంది!
టీవీల్లో కనిపించే వాళ్లే సినిమాల్లో కనిపిస్తూ ఉన్నారు. సినిమా వాళ్లు సీరియల్స్ లో నటిస్తూ ఉన్నారు. ఇలా సినిమా-సీరియల్ మధ్యన సరిహద్దు చెరిగిపోతూ ఉండటాన్ని గమనించవచ్చు. జబర్దస్త్ కమేడియన్లు లేకుండా వస్తున్న సినిమాలు లేకుండా పోయాయి. ఇక సినిమాలకు తమ కామెడీతో ప్రత్యేక ఆకర్షణలుగా నిలుస్తున్న పోసాని, పృథ్విరాజ్ వంటి కమేడియన్లు సీరియళ్లలో స్పెషల్స్ లో కనిపిస్తూ ఉన్నారు.
ఇంకా అనేక మంది సీనియర్ సినిమా స్టార్లు ఇప్పుడు సీరియల్స్ మీద దృష్టి పెట్టారు. ఎప్పుడో దశాబ్దం కిందటే నాగార్జున ఒక టీవీ సీరియల్ లో మెరిసిన దాఖలాలున్నాయి. ఇదంతా చూస్తుంటే.. పెరుగుతున్న సీరియల్స్ విస్తృతి, వాటి మార్కెట్ తో రేపోమాపో ఊపు మీదున్న హీరోలు కూడా సీరియల్స్ లో ఏ గెస్ట్ అప్పీరియన్స్ లోనో, స్పెషల్ రోల్ లోనో కనిపించినా ఆశ్చర్యపోనక్కర్లేదేమో!