లోకేష్ కనగరాజ్ కు టాలీవుడ్ లో సెపరేట్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అతడి సినిమాల కోసం ఇక్కడ కూడా ఎదురుచూసే ఆడియన్స్ ఉన్నారు. లియోపై తెలుగులో కూడా అంచనాలు పెరగడానికి హీరో విజయ్ ఓ కారణమైతే.. అంతకంటే పెద్ద కారణం లోకేష్ కనగరాజ్. తనపై పెట్టుకున్న నమ్మకాన్ని మరోసారి నిలబెట్టుకున్నాడు లోకేష్ కనగరాజ్.
కొద్దిసేపటి కిందట విడుదలైన లియో ట్రయిలర్, మరోసారి లోకేష్ కనగరాజ్ మార్క్ ను ఎలివేట్ చేసింది. యాక్షన్ ఎలిమెంట్స్ చూపిస్తూనే, మరోవైపు కథపై ఆసక్తి రేకెత్తించేలా ట్రయిలర్ కట్ చేశారు. హీరో పాత్రధారి విజయ్ ఒక్కడా, ఇద్దరా.. ఒకవేళ ఇద్దరైతే రెండో వాడు మంచోడా.. చెడ్డోడా అనే ఆసక్తిని రేకెత్తించేలా ఉంది లియో ట్రయిలర్.
ట్రయిలర్ లో విజయ్ తో పాటు అర్జున్, సంజయ్ దత్ పాత్రల్ని కూడా పరిచయం చేశాడు. వీళ్లిద్దరూ ఇందులో విలన్స్ గా నటించారు. ఎప్పట్లానే ఈ ట్రయిలర్ కు కూడా అదిరిపోయే బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందించాడు అనిరుధ్. త్రిష పాత్రకు కూడా మంచి స్కోప్ ఉన్నట్టు ట్రయిలర్ చూస్తే తెలుస్తోంది.
ఈ దసరాకు పోటీ గట్టిగా ఉండబోతోందనే విషయం లియో ట్రయిలర్ తో స్పష్టమైంది. ఇటు భగవంత్ కేసరి, అటు టైగర్ నాగేశ్వరరావుకు పోటీ ఇచ్చేలా ఉంది లియో. పైగా సితార ఎంటర్ టైన్ మెంట్స్ డిస్ట్రిబ్యూషన్ ఉండనే ఉంది.