‘మా’ లో ముసలం.. చీలిక స్పష్టం

మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ కు మంచు విష్ణు ఇలా ప్రెసిడెంట్ అవ్వడం, అలా రాజీనామాల పర్వానికి తెరతీయడం చకచకా జరిగిపోయాయి. ఈ పరిణామం ఒక్కటి చాలు, అసోసియేషన్ లో చీలిక ఉందని చెప్పడానికి.  Advertisement…

మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ కు మంచు విష్ణు ఇలా ప్రెసిడెంట్ అవ్వడం, అలా రాజీనామాల పర్వానికి తెరతీయడం చకచకా జరిగిపోయాయి. ఈ పరిణామం ఒక్కటి చాలు, అసోసియేషన్ లో చీలిక ఉందని చెప్పడానికి. 

పైకి అంతా ఒక కుటుంబం అని చెప్పుకుంటున్నప్పటికీ, తేడా స్పష్టంగా ఉందనే విషయం తాజా రాజీనామాలతో తెలుస్తూనే ఉంది. ఇప్పటికే 3 వికెట్లు పడ్డాయి. రాబోయే రోజుల్లో మరిన్ని వికెట్లు పడతాయంటున్నారు టాలీవుడ్ జనం.

“మా”లో విజేతల వివరాలు పూర్తిగా ప్రకటించకముందే నాగబాబు తన సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఆయన రాజీనామా ప్రకటించే టైమ్ కు ఈసీ మెంబర్స్ విజేతలే కాకుండా.. కీలకమైన మరికొన్ని పదవులకు సంబంధించిన విజేతల వివరాలు కూడా ప్రకటించలేదు. పైకి చెప్పకపోయినా, కేవలం ప్రకాష్ రాజ్ ఓడిపోయాడనే కారణంతోనే ఆయన రాజీనామా చేశారు.

నాగబాబు రాజీనామా చేసిన కొన్ని గంటలకే ప్రకాష్ రాజ్ కూడా రాజీనామా చేశారు. 21 ఏళ్ల “మా” బంధానికి గుడ్ బై చెబుతున్నానని ఆయన అన్నారు. ఈయన రాజీనామా చేసిన టైమ్ కు కూడా ఈజీ మెంబర్స్ విజేతలకు ప్రకటించలేదు. ఆ తర్వాత కొద్దిసేపటికే శివాజీరాజా కూడా తన “మా” సభ్యత్వానికి రాజీనామా
చేశారు.

శ్రీకాంత్ పై అనుమానాలు

ఇప్పుడీ సంఖ్య ఇక్కడితో ఆగదంటున్నారు విశ్లేషకులు. రాబోయే 2-3 రోజుల్లో మరిన్ని రాజీనామాలుంటాయని, ఏకంగా చీలిక వస్తుందని చెబుతున్నారు. అంతెందుకు, ఫలితాల వెల్లడి వరకు వేదికపై ఉన్న శ్రీకాంత్ కూడా ఆ వెంటనే సైడ్ అయిపోయారు. 

ఆయన ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ గా గెలిచారు. ఇప్పుడా పదవితో పాటు “మా” ప్రాధమిక సభ్యత్వానికి కూడా రాజీనామా చేస్తారనే పుకార్లు వస్తున్నాయి. ఓవైపు మంచు విష్ణు ఈ పుకార్లను ఖండిస్తున్నప్పటికీ.. నా చేతిలో ఏం లేదంటూ చెప్పడంలోనే అసలు విషయం అర్థమౌతోంది. 

ఈసారి మంచు విష్ణు ప్యానెల్ కు పాలన విషయంలో పెద్దగా వ్యతిరేకత, అసంతృప్తి ఎదురుకాకపోవచ్చు. ఎందుకంటే కీలకమైన పదవులతో పాటు 18 మంది ఈసీ మెంబర్లకు గాను 10 మంది మంచు విష్ణు ప్యానెల్ నుంచే గెలిచారు. 

కాబట్టి గతంలో నరేష్ కు ఎదుర్కొన్న అంతర్గత తిరుగుబాట్లు లాంటివి మంచు విష్ణుకు ఉండవు. కాకపోతే మిగతా వాళ్లంతా తమ పదవులకు రాజీనామా చేస్తారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. వీటిని మంచు విష్ణు ఖండించకపోవడం విశేషం.

మెగా వర్గం మొత్తం తప్పుకుంటుందా?

ప్రస్తుతం పరిణామాలు చూస్తుంటే.. అసోసియేషన్ నుంచి మెగా వర్గం మొత్తం తప్పుకునే సూచనలు కనిపిస్తున్నాయి. వ్యవహారం అంతవరకు వస్తే మాత్రం అది అసోసియేషన్ కు మాత్రమే కాదు, టాలీవుడ్ ప్రతిష్టకే పెద్ద మచ్చగా నిలిచిపోతుంది. 

మరోవైపు అసోసియేషన్ లో ఇప్పటికే తెలంగాణ-ఆంధ్ర ఫీలింగ్ ఉంది. ఇంకోవైపు రాజకీయ ప్రమేయం కూడా స్పష్టంగా కనిపిస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో అధ్యక్ష పదవి చేపట్టిన మంచు విష్ణు.. ఈ రాజకీయాల్ని తట్టుకొని రెండేళ్ల పాటు ఎలా కొనసాగుతాడో చూడాలి.