టాప్ ఫైట్ మాస్టర్లలో ఒకరైన అనల్ అరసు చాలా కాలం తరువాత మళ్లీ తెలుగులో ఫైట్స్ కంపోజ్ చేయబోతున్నారు. మహేష్ సినిమాకు ఓ ఫైట్ కంపోజ్ చేయడానికి ఆయన నిన్న సెట్ కు వచ్చారు.
ఈ ఫైట్ సోమ, లేదా మంగళవారం నుంచి ప్రారంభమవుతుంది. ఈ భారీ ఫైట్ కంపోజింగ్ కు అనల్ అరసు ను ఎంచుకున్నారు. మిర్చి, జనతాగ్యారేజ్, శ్రీమంతుడు, జైలవకుశ సినిమాల ఫైట్లు జనాలకు గుర్తున్నాయి. కొరటాల శివ ప్రత్యేకంగా ఈ ఫైట్లను అనల్ అరసు చేత కంపోజ్ చేయించుకున్నారు.
మహేష్-త్రివిక్రమ్ సినిమాకు ముందుగా కేజిఎఫ్ ఫైట్ మాస్టర్లను తీసుకున్నారు. భారీ అడ్వాన్స్ కూడా ఇచ్చారు. వాళ్లు చేసిన తొలిఫైట్ సీక్వెన్స్, వాళ్ల వర్క్ స్టయిల్ హీరోకి నచ్చలేదు. దాంతో చేసిన వర్క్ పక్కన పెట్టి, వాళ్లను తప్పించేసారు. తరువాత రామ్ లక్ష్మణ్ అనుకున్నారు. అలా కాదు, ఒక్కో ఫైట్ కు ఒక్కొక్కళ్లని తీసుకోవాలనుకున్నారు.
సరే, ఏం చేస్తారో అన్నది పక్కన పెడితే ఈ భారీ ఫైట్ కు మాత్రం అనల్ అరసు ను తీసుకున్నారు, తమిళ్, మలయాళం, హిందీ, తెలుగులో వంద సినిమాల వరకు ఫైట్లు కంపోజ్ చేసారు అనల్ అరసు. తమిళంలో పెద్ద హిట్ లు అయినా అనేక యాక్షన్ సినిమాలకు ఈయనే కంపోజర్. సింగం సిరీస్, ఇప్పుడు వస్తున్న ఇండియన్ 2 లకు ఈయనే యాక్షన్ కొరియోగ్రాఫర్.