'బాహుబలి' తర్వాత పాన్ ఇండియా సినిమాలు చేసే ఉబలాటం దక్షిణాది హీరోలలో ఎక్కువైపోయింది. ఎలాంటి సినిమా తీస్తే దేశమంతా ఎగబడి చూస్తుందనేది లెక్కలు వేసుకుని మరీ వందల కోట్లు ఖర్చు పెట్టేస్తున్నారు.
ఇంతవరకు బాహుబలి క్వాలిటీలో సగం కూడా అందించలేక చతికిల పడ్డారు. కొన్ని సినిమాలు ఆడాయనే కారణంగా అదే ట్రెండ్‌లో ఏళ్ల తరబడి ఒకే సినిమాపై వుండడానికి మహేష్ ఇష్టపడడం లేదు.
ఇంతవరకు అతనికి పాన్ ఇండియాకి సరిపడే కాన్సెప్ట్‌లంటూ పలువురు దర్శకులు తమ ఐడియాలు చెప్పారు కానీ మహేష్ ఆమోదం పొందలేకపోయారు.
కెజిఎఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్ కథ చెప్పినా కానీ తన తెలుగు మార్కెట్‌కి లోబడి సినిమా చేయాలనే మహేష్ చెప్పాడు. ఏదో అద్భుతం చేసేయాలనే ఆదుర్దాతో తనపై తానే ఒత్తిడి పెంచుకోకుండా మహేష్ తెలివిగా వ్యవహరిస్తున్నాడు.
మహేష్‌కి రెగ్యులర్ సినిమాలతోనే యాభై కోట్ల వరకు వస్తోంది. సరిలేరు నీకెవ్వరు చిత్రానికి మహేష్ ఏడు నెలల సమయం మాత్రమే కేటాయించాడు. బాహుబలి లాంటి సినిమా చేసినా కానీ తనకి ఇంతకు మించి పారితోషికం రాదు. అందుకేనేమో వృధా ప్రయాస దేనికని మహేష్ హ్యాపీగా రెగ్యులర్ సినిమాలే చేస్తున్నాడు.