అత్యంత పొదుపరి, జాగ్రత్తపరుడు, ముందుచూపు ఉన్న నిర్మాత సురేష్ బాబు కూడా మోసపోయారు. తన వద్ద వ్యాక్సిన్లు ఉన్నాయని నమ్మించిన ఓ వ్యక్తి, సురేష్ బాబు నుంచి ఏకంగా లక్ష రూపాయలు కొట్టేశాడు.
ప్రతి పైసాను ఆచితూచి ఖర్చు చేసే వ్యక్తి సురేష్ బాబు. ఎవరికైనా డబ్బులివ్వాలంటే ఒకటికి రెండుసార్లు ఆలోచించి మరీ జేబులో చేతులు పెడుతుంటారు. ఇలాంటి వ్యక్తి కూడా మోసపోవడం ఇప్పుడు అందర్నీ ఆశ్చర్యంలో ముంచెత్తుతోంది.
కొన్ని రోజుల కిందట సురేష్ బాబు ఆఫీస్ కు ఫోన్ వచ్చింది. తన దగ్గర కరోనా టీకాలు ఉన్నాయని, స్టాఫ్ మొత్తానికి వేయించడానికి సరిపడినన్ని వ్యాక్సిన్ డోసులు తన వద్ద ఉన్నాయని నమ్మబలికాడు. సురేష్ బాబు తరఫున ఆయన మేనేజర్ రంగంలోకి దిగి, పలుమార్లు సంప్రదింపులు జరిపారు. ఫైనల్ గా సదరు వ్యక్తి చెప్పిన ఎకౌంట్ లోకి అడ్వాన్స్ గా లక్ష రూపాయలు ట్రాన్సఫర్ చేశారు.
అంతే.. డబ్బులు పడిన వెంటనే సదరు వ్యక్తి ఫోన్ స్విచాఫ్ అయింది. సురేష్ బాబు మేనేజర్ ఎంత ప్రయత్నించినా ఆ ఫోన్ పనిచేయలేదు. దీంతో మోసపోయామని గ్రహించిన మేనేజర్, వెంటనే జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఫిర్యాదుచేశాడు.
ప్రస్తుతం టాలీవుడ్ లో వ్యాక్సినేషన్ డ్రైవ్ చురుగ్గా సాగుతోంది. ఓవైపు షూటింగ్స్ కూడా మొదలవ్వడంతో, టీకాలు తీసుకున్న వ్యక్తుల్నే సెట్స్ పైకి అనుమతించాలని ఎవరికి వాళ్లు నిర్ణయించుకున్నారు. ఇందులో భాగంగా తాజాగా నిర్మాత దిల్ రాజు తన సిబ్బంది మొత్తానికి వ్యాక్సిన్ వేయించారు. సురేష్ బాబు కూడా ఇలానే చేద్దామని అనుకున్నారు. కానీ మోసపోయారు.