మంచు విష్ణుకు నాగబాబు చాకిరేవు పెట్టిన గంటల వ్యవథిలోనే ప్రతిస్పందన వచ్చింది. నాగబాబు కోసం, కేవలం నాగబాబుకు కౌంటర్ ఇవ్వడం కోసం మంచు విష్ణు వీడియో రిలీజ్ చేశాడు. టీవీ9 ఇంటర్వ్యూతో ట్రోలింగ్ కు గురైన విష్ణు, ఈసారి కాస్త జాగ్రత్తపడ్డాడు. తను మాట్లాడిన వీడియోను ముందుగా షూట్ చేసి, అక్కడక్కడ ఎడిట్ చేసి మరీ బయటకు వదిలాడు.
ఇక వీడియోలో మంచు విష్ణు ప్రధానంగా ఎత్తుకున్న అంశం.. నాగబాబు చేసిన తెలుగు భాష ఎలిమెంట్. తెలుగు భాషపై ప్రకాష్ రాజ్ కు, విష్ణుకు పరీక్ష పెడితే.. ప్రకాష్ కు 90శాతం మార్కులొస్తాయని, మంచు విష్ణు కనీసం పాస్ అవ్వరని నాగబాబు విమర్శించారు. ఈ విమర్శను పెర్ ఫెక్ట్ గా తిప్పికొట్టాడు మంచు విష్ణు.
తెలుగు భాష కంటే.. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అధ్యక్షుడికి క్యారెక్టర్ చాలా ముఖ్యమని.. కాబట్టి ఎవరి క్యారెక్టర్ ఎలాంటిదో పరీక్ష పెడితే బాగుంటుందని నాగబాబుకు సూచించారు.
“వ్యక్తిగతంగా క్యారెక్టర్ లో మార్కులు వేయాలనుకుంటే నాకు నూటికి ఎన్ని మార్కులొస్తాయో ఇండస్ట్రీలో అడగండి. ఆయనకు (ప్రకాష్ రాజ్) ఎన్ని మార్కులొస్తాయో.. ఆయనతో నటించిన తోటి నటీనటుల్ని, దర్శకుల్ని అడగండి. మన భాషలోనే కాదు, ఆయన నటించిన అన్ని భాషల్లో ఆయన క్యారెక్టర్ గురించి అడగండి. క్యారెక్టర్ లేని నాలెడ్జ్ పనికిరాదు.”
నరేంద్రమోడీని విమర్శించేంత మేధానిగా ప్రకాష్ రాజ్ ను నాగబాబు అభివర్ణించారని, ట్విట్టర్ ఓపెన్ చేస్తే, ప్రకాష్ రాజ్ లానే వేలమంది పిచ్చుకలు ట్విట్టర్ లో విమర్శలు చేస్తుంటారని ఎద్దేవా చేశాడు విష్ణు. మోహన్ బాబు మాత్రమే తెలుగోడని, మంచు విష్ణు తమిళవాడని నాగబాబు చేసిన విమర్శను కూడా విష్ణు తిప్పికొట్టాడు.
చిన్నప్పట్నుంచి నాగబాబు కళ్లముందే పెరిగానని, ఆ మాట అనడానికి నాగబాబుకు ఎలా మనసొచ్చిందని ప్రశ్నించాడు విష్ణు.