మంచు సోదరులు విష్ణు, మనోజ్ మధ్య ఇంతకాలం అంతర్గతంగా సాగుతున్న గొడవలు ఒక్కసారిగా రోడ్డున పడ్డాయి. తమ బంధువు, కుటుంబ సన్నిహితుడిపై మంచు విష్ణు దాడికి సంబంధించి వీడియోను మనోజ్ సోషల్ మీడియాలో షేర్ చేయడం, అది వైరల్ కావడంతో అన్నదమ్ముల మధ్య గొడవలు కాస్త ప్రపంచానికి తెలిశాయి. మోహన్‌బాబు ఆగ్రహంతో సదరు వీడియోను ఫేస్‌బుక్ నుంచి మనోజ్ తొలగించారని ప్రచారం జరుగుతోంది.
ఈ నేపథ్యంలో ట్విటర్, ఇన్‌స్టా వేదికల నుంచి చేసిన పోస్టులు పరోక్షంగా తన అన్న విష్ణుకు హితవు, వార్నింగ్ ఇచ్చేలా ఉన్నాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అ పోస్టులు ఏంటో తెలుసుకుందాం.
'కళ్ల ముందు తప్పులు జరుగుతుంటే చూసీచూడనట్టు వదిలేయడం కన్నా నిజం కోసం పోరాడి చావడానికైనా సిద్ధమే అంటూ ఓ స్ఫూర్తిదాయక కొటేషన్‌ను మనోజ్ షేర్ చేశారు. అలాగే 'క్రియేటివిటీకి నెగెటివిటీయే శత్రువు' అని మరో కోట్‌ను తెరపైకి తెచ్చారు. ఇవి చాలవన్నట్టు 'మీరు బతకండి, ఇతరులను కూడా బతకనివ్వండి' అంటూ దండం పెడుతున్న ఎమోజీని క్యాప్షన్‌లో మనోజ్ షేర్ చేయడం విశేషం.
అన్నతో వివాదం నేపథ్యంలో ఇలాంటివి షేర్ చేయడం సహజంగానే విష్ణు గురించే అనే అభిప్రాయాలకు బలం కలిగిస్తోంది. కళ్ల ముందే మిత్రుడిపై తన అన్న విష్ణు దాడి చేస్తుంటే చూసీచూడనట్టు వదిలేయలేనని మనోజ్ పరోక్షంగా హెచ్చరించారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అలాగే మీరు బతకండి, ఇతరులను బతకనివ్వండి అని విష్ణుకు హితవు చెప్పే క్రమంలో ఆ కామెంట్ చేశారని చెబుతున్నారు.
ఇలా ప్రతిదీ విష్ణును దృష్టిలో పెట్టుకునే మనోజ్ మరోసారి సోషల్ మీడియా వేదికగా మనసులోని ఆవేశాన్ని ఈ రకంగా బయట పెట్టారని ఆయన అభిమానులు చెబుతున్నారు.