ప్రేమకథాచిత్రమ్ సినిమాతో దర్శకుడు మారుతి ఈ కొత్త పద్దతికి తెరతీసారు. ఆయనకు వేరే కమిట్ మెంట్ లు వుండడం వల్ల కావచ్చు, లేదా చిన్న సినిమాలకు తన పేరు వాడడం అంతగా ఇష్టం లేక కావచ్చు, మొత్తం మీద తను కథ, మాటలు, స్క్రీన్ ప్లే, డైరక్షన్ అన్నీ అందించేయడం కానీ డైరక్టర్ గా వేరే వాళ్ల పేరు వేయడం అన్నది చేస్తూ వచ్చారు.
కానీ ఇలా చేసిన చాలా సినిమాలు ఆయనకు నెగిటివ్ నే అయ్యాయి. మారుతి టాకీస్ బ్యానర్ ను కేవలం డబ్బుల కోసం ఎవరికి పడితే వారికి ఇచ్చేసారనే కామెంట్లు వినిపించాయి. దాంతో ఆయన జాగ్రత్త పడ్డారు. ఇలాంటి వ్యవహారాలను పక్కన పెట్టారు.
ప్రతి రోజూ పండగే సినిమాతో పెద్ద హిట్ కొట్టిన తరువాత సరైన హీరో దొరకలేదు. ఆఖరికి గోపీచంద్ తో అడ్జస్ట్ అవుతూ, పక్కా కమర్షియల్ సినిమా స్టార్ట్ చేసి నలభై శాతం ఫినిష్ చేసేసారు. ఈలోగా కరోనా రెండో దశ వచ్చింది. దాంతో షూటింగ్ ఆగింది. కానీ మళ్లీ షూటింగ్ లో మరో రెండు వారాల్లో ప్రారంభం అవుతాయి అనగా, మారుతి చిత్రంగా వేరే నిర్ణయం తీసుకున్నారు.
యువి సంస్థ, మారుతి టాకీస్ కలిసి సంతోష్ శోభన్, మెహరీన్ ల కాంబినేషన్ లో కేవలం ముఫై రోజుల్లో ఓ సినిమా చేసేయాలని డిసైడ్ అయ్యారు. ఈ మేరకు అప్పుడే అల్యూమినియం ఫ్యాక్టరీలో షూటింగ్ కూడా ప్రారంభించినట్లు తెలుస్తోంది. గతంలో మారుతి మహానుభావుడు సినిమాలో మెహరీన్ నే హీరోయిన్. ఇటీవలే ఆమెకు పెళ్లయింది. పెళ్లయిన తరువాత ఇదే ఫస్ట్ సినిమా.
అయితే ఈ సినిమాకు డైరక్టర్ గా మారుతి పేరు వుండదు. ఆయన కథ, మాటలు, స్క్రీన్ ప్లేకు తన పేరు వేసుకుని, డైరక్టర్ గా ఎవరో ఒకరి పేరు వేసే ఆలోచనలో వున్నారు. ఇటీవలే ఏక్ మినీ కథ సినిమాతో ఓటిటి లాభాల రుచి చూసింది యువి సంస్థ.
అందుకే అర్జంట్ గా తమ గోపీచంద్ ప్రాజెక్టును అబేయన్స్ లో వుంచి ఈ చిన్న ప్రాజెక్టును స్టార్ట్ చేసేసింది. ఇటు మారుతికి అటు యువికి ఉభయతారకమైన ప్రాజెక్టు ఇది.