సీనియర్ నటి జయచిత్ర కుమారుడు అమ్రేష్ రైస్ పుల్లింగ్ పేరుతో భారీ మోసానికి పాల్పడ్డాడు. అతను మోసగించిన తీరు తెలిసి కోలీవుడ్ షాక్‌కు గురైంది. సదరు మోసగాడు నటుడు కూడా గమనార్హం. దీంతో కోలీవుడ్‌లో ఏ ఇద్దరి మధ్య అతనిపైనే చర్చ సాగుతోంది. బాధితుడి ఫిర్యాదు మేరకు చెన్నై క్రైమ్ బ్రాంచ్ పోలీసులు అతన్ని అరెస్ట్ చేసి విచారణ జరుపుతున్నారు.
చెన్నై క్రైం బ్రాంచ్ పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. నటి జయచిత్ర కుమారుడు, నటుడైన అమ్రేష్ తన స్నేహితులతో కలిసి 8 ఏళ్లుగా చెన్నైలోని వలసరవాక్కం నివాసి నెరుమారన్‌ను రైస్ పుల్లింగ్ పేరుతో మాయ చేస్తున్నారు. అతని నుంచి భారీ మొత్తంలో డబ్బు వసూలు చేస్తూ మున్ముందు అంతా మంచే జరుగుతుందని అమ్రేష్ గ్యాంగ్ నమ్మబలుకుతూ వస్తోంది.
రైస్ పుల్లింగ్ కలశం ఇంట్లో ఉంటే ప్రపంచాన్ని జయించవచ్చని చెబుతూ …గత 8 సంవత్సరాలలో ఏకంగా రూ.26 కోట్లను నెడుమారన్ నుంచి వసూలు చేశారు. ఒకవైపు ఇంట్లో డబ్బు మొత్తం అయిపోవడం, మరోవైపు అప్పులు తీసుకొచ్చి అమ్రేష్ గ్యాంగ్‌కు సమర్పించుకుంటున్నా ఎలాంటి మార్పు రాకపోవడంతో నెడుమారన్ విసిగిపోయాడు. దీంతో తాను మోసానికి గురైనట్టు పసిగట్టిన నెడుమారన్ చెన్నై క్రైం బ్రాంచ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
బాధితుడి ఫిర్యాదు మేరకు సీనియర్ నటి జయచిత్ర కుమారుడు అమ్రేష్‌తో పాటు అతని ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. విచారణలో మరిన్ని మోసాలు వెలుగు చూడొచ్చని పోలీసులు భావిస్తున్నారు. భారీ మొత్తంలో మోసానికి పాల్పడిన విషయం తెలిసి కోలీవుడ్ ముక్కున వేలేసుకుంది.