ఎ.బి. సినిమాస్, నిహాల్ ప్రొడక్షన్స్ బ్యానర్స్‌పై రమేష్ చెప్పాల రచన-దర్శకత్వంలో డాక్టర్ బత్తిని కీర్తిలత గౌడ్, రాజా నరేందర్ చెట్లపెల్లి నిర్మించిన చిత్రం భీమదేవరపల్లి బ్రాంచి. ఈ చిత్రంలో సుధాకర్ రెడ్డి, అంజి వల్గమాన్, సాయి ప్రసన్న, అభి, రూప ప్రధాన పాత్రలలో నటించారు. గ్రామీణ నేపథ్యంలో అత్యంత సహజమైన పాత్రలతో నవ్విస్తూనే భావోద్వేగానికి గురిచేసేలా రూపొందిన ఈ చిత్రం ఈనెల 23న విడుదలైంది. ఈ సందర్భంగా సినిమా సక్సెస్‌మీట్‌ను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తెలంగాణ బీసీ కార్పొరేషన్ ఛైర్మన్ వకుళాభరణం కృష్ణమోహన్‌రావు, నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ హాజరయ్యారు.
తెలంగాణ బీసీ కార్పొరేషన్ ఛైర్మన్ వకుళాభరణం కృష్ణమోహన్‌రావు మాట్లాడుతూ… ఇటీవలే ‘బలగం’ అనే సినిమా తెలంగాణ పల్లె జీవితాన్ని, అనుబంధాల్ని కళ్లకు కట్టినట్టు చూపి, సూపర్ సక్సెస్ అయింది. అదే కోవలో ఇప్పుడు ఈ ‘భీమదేవరపల్లి బ్రాంచి’ కూడా విజయవంతం కావడం సంతోషంగా ఉంది. దర్శకుడు రమేష్ చెప్పాలకు అభినందనలు. ఇది మరింత సక్సెస్ కావాలని కోరుకుంటున్నా అన్నారు.
తమ్మారెడ్డి భరద్వాజ మాట్లాడుతూ…నిజంగానే మట్టి నుంచి పుట్టిన సినిమా ‘భీమదేవరపల్లి బ్రాంచి’. ప్రజల జీవన విధానాలను, వారిలోని ఎమోషన్స్‌ను బేస్ చేసుకుని చక్కని కథను తయారు చేసుకుంటే సక్సెస్ ఖచ్చితంగా వస్తుంది అని మరోసారి నిరూపించిన అద్భుతమైన సినిమా ఇది. ఇందులో నటించిన అందరూ నిజంగా చెప్పాలంటే జీవించారు. ఇలాంటి సినిమాలు ప్రేక్షకులు ఆదరించాలి అన్నారు.
నిర్మాతల్లో ఒకరైన రాజా నరేందర్ చెట్లపెల్లి మాట్లాడుతూ… ప్రేక్షకుల్ని అద్భుతంగా మెప్పించిన మంచి కంటెంట్ బేస్డ్ సినిమా అయిన ‘భీమదేవరపల్లి బ్రాంచి’కు నిర్మాత కావడం చాలా గర్వంగా ఉంది. ఆదరిస్తున్న ప్రేక్షకులకు ధన్యవాదాలు అన్నారు.
మరో నిర్మాత డాక్టర్ బత్తిని కీర్తిలత గౌడ్ మాట్లాడుతూ… నటిగా కెరీర్‌ను కొనసాగిస్తున్న నేను ‘భీమదేవరపల్లి బ్రాంచి’ వంటి మంచి సినిమాతో నిర్మాతగా మారడం చాలా చాలా సంతోషంగా ఉంది. మైత్రి మూవీ మేకర్స్ వారు రిలీజ్ చేయడంతో ప్రేక్షకులకు బాగా రీచ్ అయ్యింది. ఈ సందర్భంగా వారికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానని అన్నారు
దర్శకుడు రమేష్ చెప్పాల మాట్లాడుతూ… దాదాపు 20 సంవత్సరాలుగా సినీ పరిశ్రమలో ఉన్నాను. మనం తమిళం, కన్నడం, మలయాళం వంటి భాషల నుంచి ఎక్కువగా రీమేక్‌లు చేస్తుంటాం. అసలు మన సినిమాను వాళ్లు రీమేక్ చేసేలాంటి సినిమా మనం తీయలేమా అనిపించింది. సినిమా అంటూ చేస్తే.. ఖచ్చితంగా తెలుగు సినిమా పరిశ్రమ ఖ్యాతిని పెంచే సినిమా చేయాలని అనుకునేవాణ్ణి. అలాంటి కథే ఈ సినిమా. మంచి ఉద్దేశంతో సమాజానికి ఉపయోగపడే బర్నింగ్ ప్రాబ్లమ్‌తో తెరకెక్కిన ఈ చిత్రాన్ని ప్రేక్షకులు మరింతగా ఆదరించాలని కోరుకుంటున్నాను అన్నారు.
సినిమాకు పని చేసిన సాంకేతిక నిపుణులు, నటించిన పలువురు నటులు ఈ సమావేశంలో పాల్గొని ప్రసంగించారు.