మెగాస్టార్ చిరంజీవి.. మెగాభిమానుల ఆరాధ్య దైవం. చిరంజీవి తప్పుచేసినా ఆయన్ను వెనకేసుకొచ్చిన చరిత్ర వీళ్లకుంది. చిరుపై ఈగ కూడా వాలనీయరు వీళ్లు. అలాంటి అభిమానులే ఇప్పుడు చిరంజీవికి రివర్స్ అయ్యారు. సోషల్ మీడియాలో చిరంజీవిపై ఏకంగా కామెంట్స్ కూడా పెడుతున్నారు. దీనికి ఒకే ఒక్కడు కారణం. ఆయన పేరు మెహర్ రమేష్.
రీఎంట్రీ తర్వాత మెల్లమెల్లగా సినిమాల సంఖ్య పెంచారు చిరంజీవి. ఖైదీనంబర్ 150, సైరా తర్వాత ఇప్పుడు ఆచార్య చేస్తున్నారు. దీని తర్వాత ఏడాదికి రెండు సినిమాలు చేయాలనే ఆలోచనలో ఉన్నారు. ఇందులో భాగంగా సుజీత్ దర్శకత్వంలో లూసిఫర్ రీమేక్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. డైరక్టర్ బాబి చెప్పిన ఓ పవర్ ఫుల్ కథకు కూడా ఓకే చెప్పారు.
ఇంత వరకు బాగానే ఉంది కానీ ఆ తర్వాత చిరంజీవి చెప్పిన పేరు మాత్రం ఫ్యాన్స్ కు అస్సలు నచ్చలేదు. అదే మెహర్ రమేష్ పేరు. తన లిస్ట్ లో సుజీత్, బాబితో పాటు మెహర్ రమేష్ పేరు కూడా ఉందని, అతడితో కూడా ఓ సినిమా చేయాలనుకుంటున్నట్టు చిరంజీవి స్వయంగా ప్రకటించడంతో అభిమానులు అవాక్కయ్యారు.
మెహర్ రమేష్ ట్రాక్ రికార్డు గురించి అందరికీ తెలిసిందే. ఎన్టీఆర్ కు కంత్రి, శక్తి రూపంలో 2 డిజాస్టర్లు ఇచ్చాడు. ఇక వెంకటేష్ కు షాడో రూపంలో ఇంకో డిజాస్టర్ ఇచ్చాడు. షాడో తర్వాత మెహర్ తో సినిమా చేయడానికి హీరోలంతా వణికిపోయారంటే ఆ సినిమా రిజల్ట్-ఇంపాక్ట్ అర్థం చేసుకోవచ్చు. అలాంటి దర్శకుడితో చిరంజీవి సినిమా ఎనౌన్స్ చేయడాన్ని ఫ్యాన్స్ తట్టుకోలేకపోయారు.
ఓవైపు అభిమానులంతా చిరంజీవి-త్రివిక్రమ్, చిరంజీవి-రాజమౌళి, చిరంజీవి-హరీష్ శంకర్, చిరు-పూరి లాంటి కాంబినేషన్లు ఊహించుకుంటుంటే.. చిరంజీవి మాత్రం మెహర్ రమేష్ పేరుచెప్పి అందరికీ బిగ్ షాకిచ్చారు. దీంతో నిన్న సాయంత్రం నుంచి సోషల్ మీడియా హోరెత్తిపోతోంది. మెహర్ తో సినిమా చేయొద్దు మహాప్రభో అంటూ ఒకటే విన్నపాలు.
అయితే ఆ వెంటనే కాంపౌండ్ నుంచి ఫ్యాన్స్ కు చిన్నపాటి భరోసా కూడా వచ్చింది. ఘనంగా ప్రకటించిన త్రివిక్రమ్ తోనే చిరంజీవి ఇంకా సినిమా చేయలేదు. పైగా సుజీత్, బాబి సినిమాలు పూర్తవ్వాలి. ఈ గ్యాప్ లో మరో కొత్త ప్రాజెక్టు వచ్చి చేరినా ఆశ్చర్యపోనక్కర్లేదు. కాబట్టి మెహర్ రమేష్ తో సినిమా ప్రాక్టికల్ గా కుదిరేపని కాదని, చిరంజీవి ఏదో ఫ్లోలో అలా అనేశారని చెప్పుకొచ్చారు. దీంతో అభిమానులు కాస్త చల్లారారు.