ముద్దుగుమ్మ మెహ్రీన్‌తో నిశ్చితార్థం రద్దు అయిన నేపథ్యంతో ఎవరైనా తనను, తన కుటుంబాన్ని నిందిస్తూ కామెంట్స్ పెడితే మాత్రం తగిన చర్యలు తీసుకుంటామని హరియాణా మాజీ ముఖ్యమంత్రి భజన్‌లాల్ మనవడు భవ్య బిష్ణోయ్ హెచ్చరించారు. ప్రముఖ నటి మెహ్రీన్‌కు రాజకీయ కుటుంబానికి చెందిన భవ్య బిష్ణోయ్‌తో ఈ ఏడాది మార్చిలో నిశ్చితార్థం జరిగింది.
కరోనా కారణంగా పెళ్లిని కొంతకాలం వాయిదా వేస్తున్నామని మెహ్రీన్ చెప్పారు. మూడు నెలల గడవగానే తన నిశ్చితార్థాన్ని రద్దు చేసుకుంటున్నట్లు మెహ్రీన్ తాజాగా ప్రకటించి అందరినీ షాక్‌కు గురిచేశారు. ఇకపై భవ్య, వాళ్ల కుటుంబంతో తనకు ఎలాంటి సంబంధం లేదని ఆమె తేల్చి చెప్పడం సంచలనం రేపింది.
మెహ్రీన్‌తో నిశ్చితార్థం రద్దు కావడానికి బిష్ణోయ్ కుటుంబం వ్యవహరించిన తీరే కారణమనే విమర్శలు సోషల్ మీడియాలో వెల్లువెత్తాయి. ఈ సందర్భంగా బిష్ణోయ్ కుటుంబాన్ని నెటిజన్లు పెద్ద ఎత్తున ట్రోల్ చేశారు. ఈ నేపథ్యంలో బిష్ణోయ్ సీరియస్‌గా స్పందించారు.
‘మా ఇద్దరి మధ్య అభిప్రాయభేదాలొచ్చాయి. దీంతో పరస్పర అంగీకారంతో నిశ్చితార్థాన్ని రద్దు చేసుకోవాలని జూలై 1నే మేమిద్దరం నిర్ణయం తీసుకున్నాం. మెహ్రీన్‌ను ఎంతో ప్రేమించాను. ఆమె కుటుంబాన్ని కూడా గౌరవించాను. కాలం మా జీవితాలను విడదీసింది. మెహ్రీన్ నుంచి విడిపోతున్నందుకు నేను బాధపడడం లేదు.
నిశ్చితార్థం రద్దు విషయంలో నన్ను, నా కుటుంబాన్ని నిందిస్తూ ఎవరైనా కామెంట్లు చేస్తే.. వారిపై తగిన చర్యలు తీసుకుంటాను. మెహ్రీన్ ఎప్పుడూ సంతోషంగా ఉండాలని, ఆమె కలలన్నీ సాకారం కావాలని కోరుకుంటున్నాను. మా ప్రేమానురాగాలను జీవితాంతం గుర్తు చేసుకుంటూ వుంటాను’ అని భవ్య బిష్ణోయ్ పోస్ట్ పెట్టారు. నిశ్చితార్థంతోనే వాళ్ల ప్రేమ ప్రస్థానం ముగింపు పలకడం చర్చకు దారి తీసింది.