మైత్రీ- ఆసియన్.. థియేటర్ల వివాదం

హనుమాన్ సినిమా థియేటర్ల వివాదం రచ్చకెక్కింది. నైజాంలోని ఆసియన్ చెయిన్ థియేటర్లలో హనుమాన్ ప్రీమియర్ లు వేయడం లేదు. నిన్నటికి నిన్న ఆరు థియేటర్ల అగ్రిమెంట్ లు క్యాన్సిల్ చేయించారని హనుమాన్ డిస్ట్రిబ్యూటర్ శశి…

హనుమాన్ సినిమా థియేటర్ల వివాదం రచ్చకెక్కింది. నైజాంలోని ఆసియన్ చెయిన్ థియేటర్లలో హనుమాన్ ప్రీమియర్ లు వేయడం లేదు. నిన్నటికి నిన్న ఆరు థియేటర్ల అగ్రిమెంట్ లు క్యాన్సిల్ చేయించారని హనుమాన్ డిస్ట్రిబ్యూటర్ శశి అంటున్నారు. వరంగల్ థియేటర్ కు హనుమాన్ కట్ అవుట్ పంపిస్తే రోడ్డు మీద పడేసారని ఆరోపించారు.

నైజాంలో థియేటర్ల దారుణం అంత ఎక్కడా చూడలేదని అన్నారు. మొత్తం ఇస్యూ మీద ఒక ఇంటర్వూ ఇవ్వవచ్చు కదా అనగా, తనకు పబ్లిసిటీ వద్దని, న్యాయం జరగాలని కోరుకుంటున్నా అని అన్నారు.

ఇదే విషయమై ఆసియన్ సునీల్ ను ప్రశ్నించగా, డిస్ట్రిబ్యూటర్ శశి కేవలం సింపతీ కోసం ప్రయత్నిస్తున్నారని, తమ థియేటర్లలో ప్రీమియర్లకు షో లు ఇవ్వడానికి రెడీగా వున్నామని అన్నారు. సింగిల్ థియేటర్లు కావాలని అడుగుతున్నారని, ఎక్కడి నుంచి తెస్తామని, అన్ని సినిమాలు వున్నపుడు తామేం చేయగలమని అన్నారు. సోమవారం తరువాత ఏ సినిమా బాగుంటే ఆ సినిమాకు థియేటర్లు ఇవ్వడం జరుగుతుందన్నారు.

గుంటూరుకారం, సైంధవ్, నా సామి రంగా డిస్ట్రిబ్యూటర్ శిరీష్ రెడ్డిని ప్రశ్నించగా, అసలు గుంటూరుకారం సినిమాతో హనుమాన్ సినిమాను ఎందుకు కంపార్ చేస్తున్నారని అన్నారు. అది 40కోట్ల సినిమా, ఇది ఏడు కోట్ల సినిమా అని, కావాలంటే నా సామి రంగా సినిమాతో కంపార్ చేసుకుని చూసుకోవాలని అన్నారు.

థియేటర్లు క్యాన్సిల్ కొట్టామన్నది అబద్దం అని, ఆ థియేటర్లు తమకు ముందే అగ్రిమెంట్ అయ్యాయని, సలార్ సినిమా ఇవ్వము అని చెప్పి, బలవంతంగా వాటితో మళ్లీ అగ్రిమెంట్ చేయించారని శిరీష్ అన్నారు. ఎగ్జిబిటర్ తమకు నచ్చిన, తమ బాగోగులు చూసే పంపిణీ దారుతో వుండాలనుకుంటున్నాడని అన్నారు.

మీడియా ఒక వైపు కాకుండా అన్ని వైపులా చూసి వార్తలు రాయాలని శిరీష్ రెడ్డి అన్నారు. మొత్తం మీద చూస్తుంటే నైజాం థియేటర్ల సమస్య మరోసారి రచ్చకెక్కినట్లే వుంది.