చెల‌రేగిపోతున్న‌ నాగ‌బాబు…అన్న బాట‌లో ప‌య‌నం!

జ‌న‌సేనాని, త‌న త‌మ్ముడైన ప‌వ‌న్‌క‌ల్యాణ్ చేసిన ఆ ఒక్క ప‌నితో అన్న నాగ‌బాబు చెల‌రేగిపోతున్నాడు. ప‌వ‌న్ క‌ల్యాణ్ మార్గాన్ని విడిచి అన్న చిరంజీవి బాట‌లో నాగ‌బాబు ప్ర‌యాణం సాగిస్తున్నార‌నే అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. ఇటీవ‌ల ఓ…

జ‌న‌సేనాని, త‌న త‌మ్ముడైన ప‌వ‌న్‌క‌ల్యాణ్ చేసిన ఆ ఒక్క ప‌నితో అన్న నాగ‌బాబు చెల‌రేగిపోతున్నాడు. ప‌వ‌న్ క‌ల్యాణ్ మార్గాన్ని విడిచి అన్న చిరంజీవి బాట‌లో నాగ‌బాబు ప్ర‌యాణం సాగిస్తున్నార‌నే అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. ఇటీవ‌ల ఓ ప్ర‌ముఖ చాన‌ల్‌కు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో తాను జ‌న‌సేన‌కు సేవ‌లందిస్తాన‌ని చెప్పిన‌ప్ప‌టికీ…త‌న సేవ‌లు పార్టీకి అవ‌స‌రం లేద‌నే భావ‌న‌లో నాగ‌బాబు ఉన్న‌ట్టు స‌మాచారం.

ఇటీవ‌ల గాడ్సేపై నాగ‌బాబు ట్వీట్లు తీవ్ర దుమారం రేపిన విష‌యం తెలిసిందే. ఈ నేప‌థ్యంలో ప‌వ‌న్‌క‌ల్యాణ్ ట్విట‌ర్ వేదిక‌గా విడుద‌ల చేసిన ప్ర‌క‌ట‌న నాగ‌బాబును హ‌ర్ట్ చేసింద‌నే వాద‌న వినిపిస్తోంది. దీంతో అప్ప‌టి నుంచి తాను స్వేచ్ఛా జీవిని అయిన‌ట్టు నాగ‌బాబు వ్య‌వ‌హార శైలిని గ‌మ‌నించిన వారు అభిప్రాయ‌ప‌డుతున్నారు.

గ‌త నెల 23వ తేదీ ట్విట‌ర్‌లో నాగ‌బాబు గురించి ప‌వ‌న్ ఏమ‌న్నారో చూద్దాం. ‘పార్టీ రాజ‌కీయ వ్య‌వ‌హారాల క‌మిటీ స‌భ్యుడు శ్రీ నాగ‌బాబు గారు సోష‌ల్ మీడియాలో వ్య‌క్త‌ప‌రుస్తున్న అభిప్రాయాలు పూర్తిగా ఆయ‌న వ్య‌క్తిగ‌త‌మైన‌వి. పార్టీకి ఎటువంటి సంబంధం లేదు’

అప్ప‌టి నుంచి నాగ‌బాబు మ‌రింత చెల‌రేగిపోతున్నారు. ఏ పార్టీ చ‌ట్రంలో లేక‌పోవ‌డంతో నాగ‌బాబు స్వేచ్ఛ‌గా, ధైర్యంగా త‌న అభిప్రాయాల‌ను సూటిగా, స్ప‌ష్టంగా చెబుతున్నారు. త‌మ్ముడి రాజ‌కీయ ప్రాధాన్యాలను ప‌క్క‌న పెట్టిన‌ట్టే క‌నిపిస్తోంది. దానికి ఉదాహ‌ర‌ణ జ‌గ‌న్ ప‌రిపాల‌న‌పై ఆయ‌న వెలిబుచ్చిన అభిప్రాయాలు నిద‌ర్శ‌నం. ఏపీ సీఎం జ‌గ‌న్‌తో అన్న చిరంజీవికి సాన్నిహిత్యం ఉండ‌డంతో మారిన రాజ‌కీయ ఆలోచ‌న‌ల్లో భాగంగా… నాగ‌బాబు త‌న వైఖ‌రి కూడా మార్చుకున్న‌ట్టే క‌నిపిస్తోంది.

అన్న చిరంజీవిపై బాల‌కృష్ణ ప‌దేప‌దే టార్గెట్ చేసి మాట్లాడుతున్న క్ర‌మంలో నాగ‌బాబు కూడా త‌న‌దైన శైలిలో రివ‌ర్స్ అటాక్ చేయడాన్ని గ‌మ‌నించ‌వచ్చు. చిరంజీవిపై ఎల్లో మీడియా కావాల‌నే చ‌ర్చ‌లు పెట్ట‌డాన్ని గుర్తించిన నాగ‌బాబు త‌న మార్క్ పంచ్‌లు విసిరాడు.

‘టీడీపీ జెండాని, అజెండాని మోస్తున్న కొన్ని తెలుగు ఛానల్స్‌ చూస్తుంటే ముచ్చటేస్తుంది. టీడీపీ ఉప్పు తిన్న విశ్వాసాన్ని, ఆ పార్టీ పట్ల వాళ్లకున్న అనురాగం, చంద్రబాబు నాయుడు మనోడే అన్న అభిమానం, చంద్రబాబు కోసం ఎంతకయినా తెగించే సాహసం. వారికి ఉపయోగపడినంత కాలం ఓడ మల్లయ్య అని, బాబోరి తప్పుల్ని ఎత్తి చూపిస్తే బోడి మల్లయ్య అంటూ ప్రతిపక్ష పార్టీ నాయకులను చక్కగా విమర్శిస్తున్నారు. చంద్రబాబు ప్రయోజనాలను కాపాడే రక్షణ కవచాలుగా మీడియా చూపిస్తున్న తెగువ, బాబుగారికి దగ్గరగా వుండే బాబులను కూడా ముద్దు చేసే వారి మమతానురాగాలు.. వావ్‌ ఇదీ అసలైన వార్తా పత్రికల స్పిరిట్ అంటే..శభాష్. ఒక్కోసారి వైఎస్‌ జగన్‌మోహన్ రెడ్డి గారే వీళ్ళకి కరెక్ట్ అనిపిస్తుంది’ అని ట్విటర్‌ వేదికగా తన నాగ‌బాబు ఘాటుగా అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు.

అలాగే నంద‌మూరి బాల‌కృష్ణను ఓ ట్వీట్‌తో చెడుగుడు ఆడుకున్నాడు. బాల‌య్య పాడిన పాట‌పై నాగ‌బాబు ట్విట‌ర్‌లో స్పందించాడు. క‌రోనా కంటే ప్ర‌మాద‌క‌ర‌మైన సంగీతం అని బాల‌య్య పాట‌ను ఉద్దేశించి నాగ‌బాబు వ్యాఖ్యానించాడు. అంతేకాదు,  అయ్యబాబోయ్ చిన్న పిల్లలని,  వృద్ధుల్ని , అనారోగ్యంతో బాధ‌ప‌డేవాళ్ల‌ని  సంగీతం వినకుండా చూసుకోండ‌ని అప్ర‌మ‌త్తం చేశాడు. ఎందుకంటే ఆ సంగీతం విన్నారంటే ఏదైన జరగొచ్చు అని ట్విట‌ర్‌లో నాగ‌బాబు వెట‌కారం చేశారు. మొత్తానికి అన్న చిరంజీవి ఆలోచ‌న‌ల‌కు అనుగుణంగా నాగ‌బాబు న‌డుచుకుంటున్న‌ట్టు రాజ‌కీయ విశ్లేష‌కులు చెబుతున్నారు.

‘జగనన్న చేదోడు’ ప్రారంభం