Advertisement

Advertisement


Home > Movies - Movie News

లాగితే తెగుతుంద‌ని తెలుసుకున్న నాగ‌బాబు!

లాగితే తెగుతుంద‌ని తెలుసుకున్న నాగ‌బాబు!

సోష‌ల్ మీడియా చేతిలో ఉంది క‌దా అని చెప్పేసి.. తాం ఏం చెప్పినా వినేవాళ్లున్నార‌ని చెప్పి అడ్డ‌గోలుగా మాట్లాడ‌టం, ఆ త‌ర్వాత వివ‌ర‌ణ‌లు ఇచ్చుకోవ‌డం! ఒక అభిప్రాయం అంటూ చెప్పాకా దానికి క‌ట్టుబ‌డి అయినా ఉండాలి, అది చేత‌గాక‌పోతే కామ్ గా అయినా ఉండాలి! మొద‌ట ఏదో చెప్ప‌డం, ఆ త‌ర్వాత త‌న‌ను అపార్థం చేసుకున్నార‌ని అన‌డం, ఆ త‌ర్వాత అది పూర్తిగా త‌న వ్య‌క్తిగ‌త అభిప్రాయం అన‌డం.. ఇదో ఫ్యాష‌న్ అయిపోయింది!

మీ వ్య‌క్తిగ‌త అభిప్రాయం అయితే మీ డైరీలో రాసుకోవ‌చ్చు. అన‌వ‌స‌రంగా స‌మాజంపై రుద్దే ప్ర‌య‌త్నం చేయ‌కూడ‌దు, ఒక‌వేళ రుద్దాల‌ని అనుకుంటే.. అందుకు పూర్తిగా క‌ట్టుబ‌డి అయినా ఉండాలి, మ‌ళ్లీ వ్య‌క్తిగ‌తం అనే మాట రాకూడ‌దు! మా ఇంట్లో వాళ్ల‌కు సంబంధం లేదు, మా పార్టీ వాళ్ల‌కు సంబంధం లేదు.. మ‌రి ఇంకెవ‌రికి సంబంధం?

మీరు గాంధీపై మాట్లాడండి, గాడ్సేపై మాట్లాడుకోండి.. అయితే మీరో స్టేట్ మెంచ్ ఇచ్చాకా అందులో ప‌స ఉండాలి, పూర్వాప‌రాలు అయినా మీకు తెలుసా? విష‌యం ఏమిటంటే.. గాడ్సేను దేశ‌భ‌క్తుడు అనే వారిలో నాగ‌బాబు తొలి వ్య‌క్తీ కాదు, చివ‌రి వ్య‌క్తీ కాదు. చాలా సంవ‌త్స‌రాలుగా గాడ్సేను వీర దేశ‌భ‌క్తుడిగా నిరూపించ‌డానికి చాలా మంది ర‌క‌ర‌కాలుగా ప్ర‌య‌త్నాలు చేస్తూ ఉన్నారు.  ప‌దేళ్ల నుంచి గాంధీని కించ‌ప‌ర‌చ‌డం, గాంధీని చంపి గాడ్సే మంచి ప‌ని చేశాడ‌నే అభిప్రాయాల‌ను జ‌నాల్లో చొప్పించ‌డానికి అనేక మంది వీర హిందుత్వ‌వాదులు ప్ర‌య‌త్నాలు చేస్తూనే ఉన్నారు. వారి ప్ర‌య‌త్నాలు వారివి. 

హ‌త్య చేసిన ప్ర‌తి వాడి వాద‌న‌నూ వింటే.. ఒసామా బిన్ లాడెన్ కూ ఒక వాద‌న ఉంటుంది, క‌స‌బ్ కూ త‌న వెర్ష‌న్ ఉంటుంది, ఆ వెర్ష‌న్ కొంత‌మందికి స‌బ‌బుగా అనిపిస్తుంది. ఆ కోవ‌లోనే గాడ్సే వెర్ష‌న్ ను స‌మ‌ర్థించే వారు కూడా! వారితో వాదించడం కూడా అన‌స‌వ‌ర‌మే, ఎటొచ్చీ నాగాబాబే మ‌రీ కొత్త బిచ్చ‌గాడి చందానా క‌నిపిస్తున్నారు.  త‌న త‌మ్ముడు ఇప్పుడు బీజేపీతో చ‌ట్టాప‌ట్టాలేసుకున్నాడు కాబ‌ట్టి... బీజేపీ వాళ్ల‌ను, వీర హిందుత్వ వాదుల‌ను రంజింప‌జేయ‌డానికి ఏదో అలా మాట్లాడేశారు.

అంత‌కు మించి గాడ్సే గురించి కూడా ఆయ‌న‌కు పూర్తి వివ‌రాలు తెలియ‌క‌పోవ‌చ్చు. గాడ్సేను పొగిడితే హిందుత్వ‌వాదు‌ల‌మ‌ని అనిపించుకోవ‌చ్చ‌నే లెక్క కాబోలు. ఇప్పుడేమో త‌న అభిప్రాయాల‌కూ జ‌న‌సేన పార్టీకి, త‌న కుటుంబ స‌భ్యుల‌కూ సంబంధం లేద‌ని ఆయ‌న వివ‌ర‌ణ ఇచ్చుకున్నారు. ఇది రెండో వివ‌ర‌ణ‌. దీని బ‌దులు పాత ట్వీట్ల‌ను డిలీట్ చేసుకోవ‌డం అనే సంప్ర‌దాయం ఒక‌టి ఉంది, దాన్ని కొంత‌మంది ప్ర‌ముఖులే ఫాలో అవుతూ ఉంటారు. కాబ‌ట్టి నాగ‌బాబు కూడా ఆ ర‌కంగా ట్రై చేయ‌డం మేలేమో!

ప్రతిపక్ష నేతగా బాబు చేసిందేంటి..?

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?